.
Pardha Saradhi Potluri
…. మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు- part 3
సరిగ్గా 10 రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 9 న ఇజ్రాయేల్ ఖతార్ దేశ రాజధాని దోహ మీద దాడి చేసి హమాస్ నాయకులని చంపేసింది!
Ads
ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ ఖచ్చితమైన దాడిలో ( Precision Strike) ఒక అపార్ట్మెంట్ లో ఉన్న హమాస్ నాయకులని హతమార్చింది! అఫ్కోర్స్ సెప్టెంబర్ 9 న దాడి జరిగిన రోజున దాదాపుగా అన్ని అంతర్జాతీయ మీడియా ఔట్లెట్స్ కొద్దో గొప్పో మిగిలి ఉన్న హమాస్ నాయకత్వం ఇజ్రాయేల్ దాడిలో తుడిచిపెట్టుకుపోయింది అనే చెప్పాయి.
చివరికి ఖతార్ దేశ ప్రధాన మీడియా అల్ జజీరా కూడా ఇజ్రాయేల్ దాడిలో హమాస్ నాయకత్వం తుడుచుపెట్టుకొని పోయింది అనే చెప్పింది!
కానీ దాడి జరిగిన మూడో రోజే అసలు విషయం బయటికి వచ్చింది.
ఇజ్రాయేల్ దోహాలోని హమాస్ నాయకులు ఉన్న ఇంటి మీద దాడి చేయబోతున్నది అని టర్కీ ఇంటెలిజెన్స్ దోహాని హేచ్చరించింది.
కానీ దోహాలోని అధికారులు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇజ్రాయేల్ ఫైటర్ జెట్స్ దోహా వరకూ రావడం అసంభవం అనుకొని మొదట ఉదాసీనంగా ఉన్నా… తరువాత ఎందుకైనా మంచిది అని సదరు అపార్ట్మెంట్ లో ఉన్న హమాస్ నాయకులని వేరే చోటకి మార్చారు…
కొద్దిసేపటికే ఇజ్రాయేల్ ఫైటర్ జెట్స్ హమాస్ నాయకులు ఉన్న అపార్ట్మెంట్ మీద దాడిచేసి కూల్చివేసాయి.
ఇజ్రాయేల్ దాడి గురుంచి టర్కీ ఇంటెలిజెన్స్ కి ఎలా తెలిసింది?
ఇజ్రాయేల్, అమెరికా రెండు ప్రధాన వైఫల్యాలు ఏమిటంటే ఇరాన్ అణు శుద్ధి కర్మాగారం మీద దాడి చేస్తే అది ధ్వంసం అయిపొయింది అని ప్రకటించాయి… కానీ ఇప్పటికీ అది పనిచేస్తూనే ఉంది… దోహాలో హమాస్ నాయకులు అందరూ తమ దాడిలో చనిపోయారు అని ప్రకటించాక అది వట్టిదే అని తెలిసిపోయింది.
ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది?
జస్ట్ ఇజ్రాయేల్ దోహా మీద దాడి చేయబోయే రెండు రోజుల ముందు పుతిన్ ఇజ్రాయేల్ లోని తమ దౌత్య సిబ్బందిని ఆఫీసు ఖాళీ చేసి మాస్కో రమ్మని ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటలలోనే ఇజ్రాయేల్ నుండి రష్యా దౌత్య సిబ్బంది ఖాళీ చేసి వెళ్లిపోయారు.
*******************
Well….! దాదావు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి దోహా లో టార్గెట్ మీద దాడి చేసి తిరిగి ఇజ్రాయేల్ వెళ్లిపోయాయి జెట్ ఫైటర్లు.
F-35, F-15, F-16, లు కలిపి మొత్తం 15 జెట్ ఫైటర్స్ ఇజ్రాయేల్ నుండి బయలుదేరగా, తోడుగా బోయింగ్ 707 ఫ్యూయల్ టాంకర్ కూడా వచ్చింది మిడ్ ఎయిర్ రీ ఫ్యూయలింగ్ కోసం.
1.ఇజ్రాయేల్ F-35I అదిర్ ( Adir – meaning Mighty in Hebrew ) నిజానికి అమెరికా తయారీ అయినా అమెరికా దగ్గర, అమెరికా ఇతర దేశాలకి అమ్మిన F 35 లకి పోలికే ఉండదు. F-35 I Adir లో ఇజ్రాయేల్ స్వంత ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ ఏక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ జామర్స్ ఉంటాయి.
ఇక సాఫ్ట్వేర్ అయితే తన స్వంత సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఇంస్టాల్ చేసుకుంది. గ్రౌండ్ రాడార్ ని బోల్తాకొట్టించి వెళ్ళిపోగలదు. ప్రెసిషన్ బాంబ్స్, మిసైల్స్ ని చాలా దూరం నుండి ప్రయోగించి టార్గెట్ ని చాలా ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఇది కనుక మనకి అమ్మితే ఎంత ధర అయినా సరే కోనేయచ్చు.
2.F-15I ఫైటర్ జెట్. ఇ F-15I Ra’am ( హిబ్రూ లో Ra’am అంటే Thunder అని అర్ధం ) ది కూడా అమెరికన్ తయారీ అయినా కొన్ని మేజర్ మార్పులు చేసి వాడుతున్నది. F35I అదిర్ కంటే ఎక్కువ సంఖ్యలో మిసైల్స్ మోసుకెళ్లగలదు. కొన్ని F-15I లని F-35I లకి రక్షణ కల్పించే విధంగా మార్పులు చేసింది ఇజ్రాయేల్. ఎయిర్ కవర్ చేయడంలో F-15I కి తిరుగులేని చరిత్ర ఉంది. ఇది కూడా ఇజ్రాయేల్ కే పరిమితం.
3.F-16 I. ఇది కూడా ఇజ్రాయేల్ తన అవసరాల కోసం మార్పులు చేసి వాడుకుంటున్నది. అయితే దోహా మీద దాడికి కోసం ప్రత్యేకంగా జామర్లు ఏర్పాటు చేసి పంపించింది.
4.దోహా మీద మిట్ట మధ్యాహ్నం జరిగింది కానీ దాడి జరిగే వరకూ ఎవరూ గుర్తించలేదు.
5.దాడి జరిగిన ప్రదేశానికి కేవలం 30 km దూరంలో అల్ ఉదైద్ ( Al Udeid ) ఎయిర్ బేస్ ఉంది. ఆల్ ఉదైద్ ఎయిర్ బేస్ అమెరికాకి మధ్యప్రాచ్యంలో ఉన్న ఏకైక అతి పెద్ద ఎయిర్ బేస్. ఆల్ ఉదైద్ ఎయిర్ బేస్ అమెరికన్ ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ కమాండ్ కి. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ అయిన పేట్రియాట్ మిసైల్ బాటరీలు ఉన్నాయి. కనీసం 200 km దూరం వరకూ శత్రు జాడలని పసిగట్టగలిగిన గ్రౌండ్ రాడార్లు ఉన్నాయి.
6.అమెరికాకే చెందిన బోయింగ్ E-3 Sentry AWACS విమానం కూడా అదే ఎయిర్ బేస్ లో ఉంది. E-3 Sentry విమానం 400 km పరిధిలో శత్రు కదలికలని గుర్తించగలదు.
7.దోహాకి 20 km దూరంలో ఇజ్రాయేలి ఫైటర్ జెట్స్ హమాస్ నాయకులు ఉన్న అపార్ట్మెంట్ మీద F-35I, F-15I లు కలిసి ఒకేసారి 15 ఎయిర్ to సర్ఫెస్ మిసైల్స్ ప్రయోగించాయి. F-16I లు రక్షణగా ఉంటూ ఆ ప్రాంతం మీద వలయాకారంలో తిరుగుతూ కాపలాకాసాయి.
మరీ ఇన్ని ఉన్నా ఇజ్రాయేల్ 15 ఫైటర్ జెట్లు ఖతార్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించి దాడిచేసి సురక్షితంగా ఎలా వెళ్ళగలిగాయి?
దాడికి ముందు రోజు డోనాల్డ్ ట్రంప్ తో నెతన్యాహు అక్షరాలా 50 నిముషాల సేపు సమావేశం అయ్యాడు!
దోహాలో ఉన్న ఎయిర్ బేస్ రాడార్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి ఇజ్రాయేల్ జెట్స్ దాడి ముగించి వెళ్లిపోయే వరకూ.
కానీ దోహా మీద దాడికి అమెరికాతో సంబంధం లేదు, మా టార్గెట్ కేవలం ఖతార్ లో ఉన్న హమాస్ నాయకులు మాత్రమే అని నేతన్యాహు ప్రకటించాడు.
అమెరికా ఖతార్ ని వెన్నుపోటు పొడిచింది!
కాస్త నారెటివ్ మార్చి MBS, నెతన్యాహు ట్రంప్ ని ఫుట్ బాల్ ఆడుకున్నారు అంటే సమంజసంగా ఉంటుంది.
ఇజ్రాయేల్ దోహా మీద దాడి చేయగానే పాకిస్థాన్ ఒక స్క్వాడ్రన్ J-17 ఫైటర్ జెట్స్ ని దోహాకి పంపించింది.
మధ్య ప్రాచ్యంలో అతిపెద్ద అమెరికన్ ఎయిర్ బేస్ దోహాలో ఉండగా పాకిస్తాన్ ఖతార్ కి సపోర్ట్ గా తన ఫైటర్ జెట్స్ ఎందుకు పంపించినట్లు?
ఆసిమ్ మునీర్ ట్రంప్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇక ట్రంప్ ని పెద్దగా లెక్కచేయక్కరలేదు అనే ధోరణిలో ఉన్నాడు!
*****************
దోహా మీద ఇజ్రాయేల్ దాడి తరువాత ఇస్లామిక్ దేశాలలో వణుకు పుట్టింది!
సెప్టెంబర్ 15 OIC ( Organisation of Islamic Cooperation) ఖతార్ లో సమావేశం అయ్యింది.
OIC లో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి.
1969 లో OIC ని ఏర్పాటు చేశారు.
WELL..! సెప్టెంబర్ 15 OIC సమావేశంలో ఇజ్రాయేల్ దోహా మీద చేసిన దాడిని షరా మామూలుగా ఖండించాయి!
కేవలం 5 దేశాలు మాత్రమే సభ్యత్యం కల GCC తో తమ వాయిస్ వినిపించలేము అని OIC సమావేశం నిర్వహించాయి.
ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
OIC దేశాలు తమ స్వంత సెక్యూరిటీ ని ఏర్పాటు చేసుకోవాలి.
OIC దేశాలు తమ ఎయిర్ స్పేస్ లో ఏ విమానాలు ఎగుతున్నాయో పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి. ఇజ్రాయేలి జెట్ ఫైటర్స్ దోహా మీద దాడి చేసి తిరిగి వెళ్లే సమయంలో కొద్ది సేపు UAE గగనతలం మీదుగా వెళ్లాయి కానీ UAE రాడార్లు గుర్తించలేకపోయాయి. అఫ్కోర్స్! 15 జెట్ ఫైటర్స్ UAE మీదుగా వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది కానీ ఎవరూ పట్టించుకోలేదు.
సమావేశంలో నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ ఇజ్రాయేల్ పేరు ప్రస్తావించి అమెరికా పేరుని ధైర్యంగా అనలేకపోయాయి.
57 ఇస్లామిక్ దేశాల సమావేశం తమ స్వంత రక్షణ వ్యవస్థలని ఏర్పాటు చేసుకొని, ఇజ్రాయేల్ దాడుల నుండి తమని తాము కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నా అవి ఆచరణకి నోచుకోవు అన్నది జగమెరిగిన సత్యం!
UAE తమ దేశం మీదకి ఎమెన్ హుతీలు ప్రయోగించే రాకెట్లని ముందుగానే పసిగట్టడానికి సోమాలియాలో ఇజ్రాయేల్ రాడార్లని మొహరించింది!
ఇక వీళ్ళకంటూ స్వంత రక్షణ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేసుకోగలుగుతారు?
Well…! ఈజీప్ట్ తన సైన్యాన్ని సినాయ్ పెనున్సిలా ( సినాయ్ ఎడారి ) వైపు నడుపుతున్నది. సినాయ్ ఎడారి ఇజ్రాయేల్ కి సరిహద్దుగా ఉంది.
ఎప్పుడో 60, 70 దశకాలలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక వేళ ఈజీప్ట్ కనుక ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే మాత్రం ఈసారి ఇజ్రాయేల్ జనాభా పరంగా, ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.
గత వారం IDF సైనికులు తాము యుద్ధం చేసి అలిసిపోయాము కాబట్టి మాకు విశ్రాంతి కావాలంటూ తమ పై అధికారుల మీద తిరగబడ్డ దృశ్యం మిడిల్ ఈస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఈజీప్ట్ ఇజ్రాయేల్ మీద దాడి మొదలుపెడితే మిగతా ముస్లిం దేశాలు తలా ఒక చెయ్యి వేస్తాయి. ఇజ్రాయేల్ బ్రతికి బట్ట కట్టడం అసాధ్యం.
ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు వెంటనే అమెరికా సహాయం కోరాడు.
ఈజీప్ట్ బలం ఏమిటీ?
ఆర్మీ: 4,50,000. రిజర్వ్ లో మరో 4,50,000 మంది ఉండగా మొత్తం 9,00,000 బలం ఉంది.
ఎయిర్ ఫోర్స్: Mig-29, రాఫెల్, F-16, లతో బలంగా ఉంది.
నావీ: రెండు హెలికాప్టర్ క్యారియర్స్ తో పాటు మరో రెండు ఫ్రిగేట్స్ ఉన్నాయి.
ఎయిర్ డిఫెన్స్: మూడు లేయర్ల ఎయిర్ డిఫెన్స్ ఉంది. కొద్ది నెలల క్రితం చైనాకి చెందిన ఎయిర్ డిఫెన్స్ HQ-9B లని కొన్నది. HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యన్ S-400 కి దగ్గరగా ఉంటుంది. పాకిస్తాన్ చైనా నుండి కొన్నది HQ-9A మోడల్, ఇవి అంతగా ప్రభావం చూపలేదు ఆపరేషన్ సిందూర్ సమయంలో. HQ-9A అనేది సోవియట్ S-300 తో పోల్చవచ్చు.
ఈజీప్ట్ దగ్గర ప్రధాన యుద్ధ టాంక్స్ అమెరికన్ A1 అబ్రామ్స్, సోవియట్ T60, రష్యన్ T90 లు ఉన్నాయి. A1M1 అబ్రామ్స్ టాంక్స్ ని ఈజీప్ట్ లోనే అసెంబుల్ చేస్తారు.
మొత్తంగా చూస్తే ఈజీప్ట్ మిలిటరీ పవర్ అరబ్, పశ్చిమ ఆఫ్రికా దేశాలలో మొదటి స్థానంలో ఉంది.
ఒకవేళ ఈజీప్ట్ కనుక అమెరికా మాట వినకుండా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనట్లు భావించాల్సి ఉంటుంది.
ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపిరి కట్టెది ఒక దారి అన్నట్లుగా సౌదీ అరేబియాకి ఒక్క UAE ని మినహాయిస్తే మిగతా ముస్లిం దేశాలను పట్టించుకోదు. అందుకే తన దారి తాను చూసుకున్నది! Contd…part 4
Share this Article