.
Ashok Kumar Vemulapalli ……. బ్లూటిక్కు వోళ్ళ కష్టాలు “ బ్లూ టిక్కు తీసుకుంటే కంటెంట్ మీద రెవెన్యూ షేరింగ్ ఇస్తా అన్నాడు ఎలాన్ మస్కు బాబాయ్ ..
నెలకి వెయ్యిరూపాయలు దొబ్బేసి బ్లూ టిక్కు (ప్రీమియమ్) తీసుకున్నా.. తీరా తీసుకున్నాక 500 మంది ప్రీమియం ఫాలోవర్స్ అంటే బ్లూటిక్కు ఉన్నోళ్ళు కావాలన్నాడు..
Ads
బాబ్బాబు.. నన్ను ఫాలో చేసి నన్ను కోటీశ్వరుడ్ని చేయండని రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్లూటిక్కులోళ్లని బతిమాలుకున్నాను .. ధర్మం చేయండి బాబయ్యా అన్న రీతిలో విజ్ఞప్తి చేసుకున్నా.. కానీ మేము నిన్ను ఫాలో చేస్తే మరి నాకేంటి? అన్నట్టుగా ఈ బ్లూటిక్కులోళ్లు నన్ను పెద్దగా దేకలేదు ..
పైగా .. ఏరా.. అశోగ్గా.. మేమందరం నిన్ను ఫాలో చేస్తే నువ్వు ఫాలోవర్స్ నింపించుకుని మస్కు గాడి దగ్గర డబ్బులు దొబ్బేస్తా ఉంటే మేము నిన్ను చూస్తా కూసోవాలా ? అని బుల్లిరాజు అడిగినట్టు అడిగారు .. పోనీ 500 బ్లూటిక్కులోళ్లని కొనేద్దామా ? అని ట్రై చేస్తే .. ఇట్టాంటివి చేస్తే మాస్క్ బాబాయ్ … తన అల్గారిథంతో నీ ఎకౌంట్ క్లోజ్ చేసేస్తాడు అని తెలిసింది ..
బ్లూటిక్కులోళ్లని పెంచుకోవడం ఎలా అని ట్విట్టర్ వాళ్ళ … Groke పిన్నిని అడిగితే బాగా కంటెంట్ పెడితే బ్లూటిక్కులోళ్లంతా నిన్ను మెచ్చుకుని నిన్ను ఆశీర్వదించి నిన్ను ఫాలో అవుతారని చెప్పింది .. అప్పటి నుంచి పోటీ పడి , ఆయాసపడి, అక్కడా.. ఇక్కడా పోగేసి , సొంత పైత్యం జోడించి వరసగా పోస్టులు పెడుతున్నాను ..
నిజం చెప్పాలంటే మనం పెట్టే కంటెంట్ జనాన్ని రంజింప చేయడం లేదు .. జనానికి అంతా నెగెటివ్ కంటెంట్ కావాలి.. ఎవరో ఒకర్ని కెలికి వాళ్ళని తిట్టి వాళ్ళతో తిట్టించుకుంటే అప్పుడు కంటెంట్ ని జనాలు చూస్తారు..
లేదా .. ఏదో ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని ఇంకో పార్టీని తిడితే ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు లేదా ఆ పార్టీ కార్యకర్తలు మనల్ని అమ్మనా బూతులు తిడుతూ ట్రోల్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు .. అంటే టోటల్ గా నెగిటివ్ పబ్లిసిటీ కావాలి .. అలా కూడా ట్రై చేసి రెండు మూడు పొలిటికల్ కామెంట్స్ చేస్తే అవతలి వాళ్ళు తిట్టిన తిట్లకు నాలుగు రోజులు ఆకలి కూడా వేయలేదు .
పోనీ వెనక జిన్ను.. కొనకజిన్ను.. ఛీ ఛీ ఛీ అని లేదా .. కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అని పాటలు పాడి, రీల్స్ చేద్దామా.. అంటే మన మగ, పురుష , మేల్, జెంట్ ముఖాల్ని సోషల్ మీడియాలో ఎవడు దేకుతాడు.. అందులోనూ ఆ రీల్స్ కి మన ఫేస్ సెట్ అవదు .. ముఖం మీద హావభావాలు పలికి చావవు..
బాబోయ్ .. ఈ గోలంతా మనకెందుకులే అని వదిలేస్తే .. నెలనెలా ట్విట్టరోడికి .. ఆ బ్లూ టిక్కు కోసం కడుతున్న వెయ్యిరూపాయలే పొద్దున్నే నిద్ర లేవగానే గుర్తొస్తున్నాయి .. నా డబ్బులు దొబ్బేసిన ఎలాన్ మస్కు గాడి .. స్పేస్ ఎక్స్ .. రాకెట్ లో పెద్ద మోటార్ చెడిపోవాలని .. వాడి టెస్లా కారు మీద కాకి రెట్టేయాలని తిట్టుకుంటూ కాలం గడిపేస్తున్న దశలో…
ఒక తెల్లారుజామున వాకింగ్ చేసి అలసిపోయి నిద్దర గన్నేరు చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తా ఉంటే ఒక ఐడియా వచ్చింది .. బ్లూ టిక్కు ఉన్నోళ్లందరినీ నన్ను ఫాలో అవమని నేను బతిమాలడం కంటే .. వాళ్ళని నేన ఫాలో అయితే తిరిగి వాళ్ళ ఫాలో బ్యాక్ చేస్తారు కదా అనే ఆలోచన తట్టగానే .. భారతదేశంతో పాటు ఫిన్లాండ్ , ఐర్లాండు, స్విజ్జర్లాండు, ఫిన్లాండ్ , నెదర్లాండ్స్ ఇలా అన్ని ఖండాల్లోని అన్ని ల్యాండోళ్లని ఫాలో అయిపోతున్నాను .. కొంతమంది తిరిగి ఫాలో కొడుతున్నారు .. ఇంకొంతమంది ఎవడ్రా … నువ్వు అని .. మెసేజ్ పెడుతున్నారు ..
ఈ ప్లాన్ వర్కవుట్ అయి .. 500 మంది బ్లూటిక్కు ఫాలోవర్స్ తొందరగా రావాలని కోరుకుంటున్న దశలో ఇంకో డౌట్ వచ్చింది .. ఇలా మొదట మనం ఫాలో కొట్టి తిరిగి మనల్ని వాళ్ళు ఫాలో చేసిన బ్లూటిక్కు వాళ్ళని అసలు ట్విట్టరోడు.. అదే మన ఎక్స్.. ఎలాన్ మస్కు బాబాయ్ .. యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని …! సో, మస్క్‌తో ఏదీ అంత వీజీ కాదు…
Share this Article