Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాగంటి..! గుహలో దేవుడు.., గుడి గోపురమొక్కటి లేదు తప్ప…!!

February 7, 2025 by M S R

.

ఎక్కడో అమెరికాలో గ్రాండ్ కెన్యాన్ రాతి కొండలు, లోయలు; స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ మంచు కొండలు తిరిగాం…మన పక్కనున్న బెలుం గుహలు, గండికోటలకు వెళ్ళకపోతే ఎలా? అన్న మా అబ్బాయి ప్రశ్నకు సమాధానంగా హైదరాబాద్ నుండి ఒకరోజు పొద్దున్నే బయలుదేరాము-

నంద్యాలలో ఉంటూ రెండు మూడు రోజులపాటు బెలుం గుహలతో పాటు చుట్టుపక్కల వీలైనన్ని చూడదగ్గ ప్రాంతాలు తిరగాలన్న సంకల్పంతో. ఒక లాడ్జ్ లో దిగి… మధ్యాహ్నం భోజనం చేసి యాగంటి వెళ్ళాము. నేనిదివరకు రెండు మూడు సార్లు వెళ్లినా ఎప్పుడో దశాబ్దాల క్రితమది.

Ads

విజయనగర స్థాపనలో కీలకమైన హరిహర బుక్కరాయలు నిర్మించిన ఉమామహేశ్వర ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. “కలియుగాంతమున యాగంటి బసవన్న లేచి రంకె వేసేను…” అని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన పెద్ద బసవడు ఉమామహేశ్వరులకు ఎదురుగా ఉంటాడు. ఇక్కడ బసవడు అంతకంతకూ పెరుగుతూ ఉంటాడని అనాదిగా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

హరిహరబుక్కరాయలు ఆలయం కట్టించడానికంటే ముందే ఇక్కడ అగస్త్యుడు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పెద్ద ఆలయం కట్టించాలని సంకల్పించాడు. అయితే విగ్రహం చెక్కిస్తున్నప్పుడు కాలి బొటనవేలు పగిలిపోవడంతో పూజార్హం కాదని దాన్ని అలాగే వదిలేశాడు.

తిరుపతి వెంకన్నకంటే ముందు విగ్రహమిదని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం. దాంతో ఏదో క్రియా లోపముందని అగస్త్యుడు పక్కనే గుహలో తపస్సు చేస్తే…స్ఫురించిన విషయం- అప్పటికే అక్కడ ఉమామహేశ్వరులు స్వయంభువులుగా వెలసి ఉన్నారు కాబట్టి…వెంకన్న ఆలయం కట్టడం కుదరలేదని. అగస్త్యుడు తపస్సు మొదలుపెట్టగానే కాకులు కావుకావుమని అరుస్తూ తపోభంగం చేశాయి. “ఈ ప్రాంతంలో కాకులకు ప్రవేశం లేకుండుగాక” అని అగస్త్యుడు శపించడం వల్లే ఇప్పటిదాకా ఇక్కడ కాకులు రాలేదని ప్రచారంలో ఉన్న కథనం.

యాగంటి అంటే యజ్ఞం చేసిన చోటు అని అర్థం. ఉమామహేశ్వరులకోసం, వెంకన్న కోసం యజ్ఞం చేసిన చోటు అని అనుకోవచ్చు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కూడా ఇక్కడ ఒక గుహలో చాలాకాలం తపస్సు చేశాడు. కొన్ని కాలజ్ఞానాలు ఇక్కడ కూర్చునే రాశాడు.

కొండ రాతి గుహలో తను ప్రతిష్ఠించబోయిన వెంకన్నను ఉమామహేశ్వరుడిలోనే చూసుకుంటూ అగస్త్యుడు నిత్యపూజలు చేసేవాడు. అయితే అనంతరకాలంలో ఆ వెంకన్నకు కూడా పూజాదికాలు మొదలయ్యాయి. గుడి గోపురమొక్కటే తక్కువకానీ… భక్తుల తాకిడికి తక్కువలేదు.

ఆ వెంకన్నకు తొలిపూజ చేసి;
అగస్త్యుడు తపస్సు చేసిన చోటులో అగస్త్యుడికి, ఆయన పూజ చేసుకున్న శివ లింగానికి మొక్కుకుని;
కిందికి దిగి ఉమామహేశ్వరుల స్పర్శ పూజ చేసి;
యాగంటి బసవడికి ప్రదక్షిణ చేసి… మరో క్షేత్రానికి బయలుదేరాము.

అగస్త్యుడు పదహారణాల తెలుగువాడేనని శ్రీనాథుడి మొదలు సిరివెన్నెల దాకా పండితులు, పరిశోధకుల నమ్మకం. లేపాక్షి గర్భాలయం గుహలో కూడా అగస్త్యుడు తపస్సు చేసినట్లు పౌరాణిక ఆధారాలున్నాయి. అగస్త్యుడు తమిళభాష నేర్చుకుని ఆ తమిళంలో శివుడి మీద స్తోత్రకావ్యం కూడా రచించినట్లు చెబుతారు. అదో పెద్ద కథ. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం.

ఫిబ్రవరి మొదటి వారం ఎండలకే ఇక్కడి గుహల్లో ఏటవాలు రాతిమెట్లు నిప్పుల్లా కాలుతున్నాయి. కర్ణాటక నుండి ఒళ్ళో నెలల పసికందును పెట్టుకుని…ఆగి…ఆగి… పట్టుజారితే ప్రమాదంగా ఉన్న అంతటి మెట్లెక్కుంటుండడం చూసి…

ఆమె శ్రద్ధాభక్తుల ముందు మేమేపాటి? అనుకుంటూ కాళ్ళు కాలుతున్నా అలాగే అన్ని గుహలు ఎక్కి దిగాము. ఎండ వేడిమిని తగ్గించే కూల్ వైట్ రంగు వేగించడానికి, మెట్లకు బట్ట బిగించడానికి సాంకేతికంగా కుదిరేలాకూడా లేదు. కుదిరి ఉంటే చేసి ఉండేవారు. అయినా భక్తిలో ఒళ్ళు వంచడం, శరీరాన్ని కష్టపెట్టుకోవడం కూడా ఒక భాగం. పరీక్ష. ఆ పరీక్ష నెగ్గితేనే దర్శనం.

దారిలో అటు ఇటు-
ఎర్రగ పండిన మిరపచేలు;
పచ్చగా విచ్చుకున్న పొగాకు పంటలు;
జొన్న కంకుల మీద వాలే పక్షులు;
పడమర కొండల్లో పొద్దు వాలుతూ వరిమళ్ళ అద్దంలో తనను తాను చూసుకుంటూ భూమ్యాకాశాలకు సంజె కెంజాయ రంగులు పులుముతున్న సూరీడు;

“ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచు పోలిక…” అని బమ్మెర పోతన అన్నట్లు ఒక్కో వరి మడినీటిలో ఒక్కో సూర్యుడు వెంట వస్తుంటే…
గోధూళి వేళకు ఇళ్ళకు చేరే ఆవుల మందలు;
కొమ్మల్లో వాలే కొంగలను చూస్తూ… నందవరం చేరాము.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions