చిరంజీవి కొన్నిసార్లు ఎవరికీ అర్థం కాడు… కొన్ని చాలా లైట్‌గా తీసుకుంటాడు, మరిచిపోతాడు… ఎవరి మీదా పెద్దగా శతృత్వమో, వ్యతిరేక భావనలో కొనసాగించినట్టు కనిపించడు… అది అభినందనీయం… కానీ కొన్ని అంశాలకు తను స్పందించడు, నాగబాబును తెర ముందుకు తోస్తాడు… నాగబాబుకు పాలిష్డ్‌గా మాట్లాడటం తెలియదు… రఫ్ అంట్ టఫ్ కౌంటర్లు వేసేస్తాడు ఎవరిమీదనైనా…
సోషల్ మీడియా పోస్టులు, సెల్ఫ్ వీడియోలు లేదా ఏదైనా బహిరంగ వేదికను ఎంచుకుని… తమ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ఎదురుదాడి స్టార్ట్ చేసేస్తాడు… ఫ్యాన్స్ అందుకుంటారు… మొదట్లో ఒకసారి యండమూరి, తరువాత రామగోపాలవర్మ, ఆ తరువాత గరికపాటి… (ఇవేనా..? ఇంకా ఉన్నాయా..?) గరికపాటి విషయంలో చిరంజీవి కూడా స్వయంగా ఓసారి వెటకారంగా ఏదో అనబోయాడు…
సరే, ఒక ఇండస్ట్రీలో లేదా ఒక రాజకీయ వాతావరణంలో లేదా ఎక్కువ మంది సెలబ్రిటీలు ఉన్న ఒక మెగా కుటుంబానికి సంబంధించి ఇవన్నీ సహజమే అనుకుందాం… ఇవేమీ పెద్ద సీరియస్ వివాదాలు కావు, వాటిని భూతద్దంలో చూడాల్సిన పనీ లేదు… హఠాత్తుగా చిరంజీవి ఏదో ఫంక్షన్‌లో యండమూరిని సన్మానించి, తన ఆత్మకథ రాయబోతున్నది యండమూరే అని చెప్పడం ఒకింత విశేషంగానే అనిపించింది… ఎస్, చిరంజీవి చెప్పినట్టు యండమూరి నవలాచిత్రాల్లో చాలావరకు చిరంజీవి హీరో, చిరంజీవి పాపులారిటీకి కూడా అవి బాగా ఉపయోగపడ్డాయి… లైక్ అభిలాష, రాక్షసుడు ఎట్సెట్రా…
Ads
అదే యండమూరి మీద మెగా క్యాంపు మొత్తం యథాశక్తీ బురద పోసింది ఓసారి… ఎందుకంటే ఆయన రామచరణ్‌ను కించపరిచాడని ఓ ఆరోపణ… రామచరణ్ దవడ బాగా లేకపోతే తల్లి సర్జరీ చేయించిందని ఓసారి యథాలాపంగా యండమూరి ఎక్కడో ఏదో ఫ్లోలో చెప్పాడు… అది మరీ కించపరచడం ఏమీ కాదు, పైగా ఆ కుటుంబంతో యండమూరికి బాగా చనువు… పైగా అది ఏదో కాంటెక్స్ట్‌లో చెప్పుకొచ్చాడు… అవును, మొహాన్ని తెరకు అనుకూలంగా, మరింత అందంగా కనిపించేలా సర్జరీలు, మెడికల్ ప్రొసీజర్లో చేయించుకుంటే అది తప్పు ఎలా అవుతుంది, అదే మాట చెబితే కించపరచడం ఎలా అవుతుంది… అసలు శ్రీదేవి బోలెడుసార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందంటారు…
దాన్ని నాగబాబు రచ్చ చేసి వదిలేశాడు… నిజానికి దాన్నలా వదిలేస్తే పోయేది… ఇప్పుడు అదే చిరంజీవి అదే యండమూరికి తన ఆత్మకథ రాసే పనిని అప్పగించాడనేది అందుకే ఇంట్రస్టింగుగా అనిపించింది… పాతవన్నీ మనసులో పెట్టుకోకుండా చిరంజీవి తన పాత యండమూరిని తన తాజా ఆంతరంగికుడిగా హత్తుకోవడం బాగుంది… ఇప్పుడు అదే నాగబాబు ముఖచిత్రం ఏమిటి..?
ఇక్కడ మరో సందేహం… ఎస్, యండమూరి మంచి ప్రతిభ కలిగిన రైటర్… ఒకప్పుడు తెలుగు పాఠకుల్ని తనతోపాటు పరుగులు తీయించిన ఘనాపాటీయే… కానీ ఒక ఆత్మకథను మరీ చిరంజీవి సినిమాల్లాగే సూపర్ ఎలివేషన్లతో రాయగలడా..? రియలిస్టిక్ పద్ధతిలో గనుక ఆ ఆత్మకథ సాగితే చిరంజీవి ఫ్యాన్లకు నచ్చుతుందా..? అసలు చిరంజీవికి నచ్చుతుందా… అసలు యండమూరి ఈ కొత్త అసైన్‌మెంట్‌ను, ఈ టఫ్ టాస్క్‌ను అంగీకరించాడా..?!
Share this Article