గుండు బాస్… అదేలెండి, లలిత జువెలర్స్ యజమాని… టీవీల్లో, డిజిటల్ యాడ్స్‌లో, పత్రికల్లో విపరీతంగా యాడ్స్… వాటిల్లో బంగారం అమ్మకాల్లోని అబద్ధాలు, మోసాల్ని తెలియజెబుతూ… డబ్బులు ఊరకే రావు అని నీతి బోధిస్తూ, ఇతర దుకాణాల్లో ధరలతో పోల్చి చూసుకుని, మా దుకాణాల్లో కొనండి అని ప్రచారం… మరి అదేమిటి..? తనూ ఆ వ్యాపారే కదా, ఆ వ్యాపారంలోని అబద్ధాల్ని అలా చెప్పేస్తున్నాడేమిటి అని కదా పాఠకుల్లో, ప్రజల్లో, వినియోగదారుల్లో ఆశ్చర్యం…
కానీ అది కూడా ఓ మార్కెటింగ్ టెక్నిక్… జనాన్ని ఇట్టే కనెక్ట్ చేయగల ప్రచారమాయ… మేం నిజాల్ని చెబుతాం, నిజాయితీగా ఉంటాం అంటూ వినియోగదార్లను బుట్టలో వేసుకోవడం… నలభై ఏళ్ల క్రితం యండమూరి రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలలో కథానాయకుడు కూడా చీరెల అమ్మకాలు, ధరల తగ్గింపు అసలు మతలబుల గురించి ఇలాగే జనానికి చెప్పాలని ఆలోచిస్తాడు…
ఆ నవలలో కథానాయకుడి ఆలోచనలు ఏమిటో… సాక్షాత్తూ Veerendranath Yandamoori స్వయంగా ఓ పోస్టులో ఇలా చెప్పుకొచ్చారు…
Ads
‘‘రీప్రింట్ కోసం వచ్చిన ఈ పుస్తకం చదువుతూ ఉంటే ‘లలిత జ్యువెలర్స్’ ప్రోప్రైటర్ గుర్తు వచ్చారు. 40 సంవత్సరాల క్రితం రాసిన ఈ పుస్తకంలో పాయింట్లు ఆయన ఇప్పుడు అమలు జరుపుతున్నారు.
షాపుల్లో కొనే ఒక చీర వెనుక చాలా చరిత్ర ఉ౦టు౦ది. పది చీరలు తీయిస్తే, వాటిని తిరిగి మడత బెట్టి లోపల పెట్టటం వల్ల జరిగే రాపిడికి రెండు శాతం చీరలు డెడ్-స్టాక్ అవుతాయనీ, ఆ ఖరీదు కూడా తాము కొనే చీర ధరలోకే వచ్చి చేరుతుందనీ గంటల తరబడి బేరం చేసే వాళ్లకి తెలీదు. తాము ఉచితంగా తాగే కూల్ డ్రింక్ ఖరీదుకి పది రెట్లు తాము చెల్లించే ధరకి కలపబడిందనీ, కేవలం చీర మీద అంటించిన కాగితం ముక్క మీద ఉన్న ధర, FIXED PRICES అని వ్రాసి ఉన్న బోర్డు చూసి తాము మోసపోతున్నామనీ, ఆ ధర ఫ్యాక్టరీ నుంచి వచ్చింది కాదని, ఆ క్రితం రాత్రి సేల్స్ మెన్ అయినా వేసి ఉండవచ్చనీ పట్టుచీర కొనేవారికి తెలీదు.
ఇలా ఆలోచిస్తూ ఉండగా రవితేజకి ఒక ఆలోచన స్ఫురించింది. ఈ విషయాలన్నీ తామే ఎందుకు కస్టమర్ల చెప్పకూడదు? సెక్రటరీని పిలిచాడు. ఆమె పేరు సరస్వతి. ముఫ్ఫై ఏడేళ్ళుంటాయి. తెలివైనది.
“చాలాకాలం క్రితం నేనేం మాట్లాడానో తెలుసా? షోకేసులో ఉన్న చీర ఎప్పుడూ కొనకండి. ఫేడ్ అయిపోయి ఉ౦టు౦ది. అలాటిదే ఇంకొకటి లోపల్నుంచి తీసుకోండి అని ఈ కంపెనీలోకి రాక ముందు శర్మగారితో మొదటి పరిచయంలో చెప్పాను” కూర్చోపెట్టి అకస్మాత్తుగా ఇలా అనేసరికి ఆమెకేమీ అర్థంకాలేదు. రవితేజ నవ్వి అన్నాడు. “…ఇలాంటి సలహాలే మనం ఎందుకు మన వైపునుంచి కస్టమర్లకు ఇవ్వకూడదు?”
ఆమె దిగ్భ్రాంతితో చూసింది. రవితేజ చెప్పుకుపోతున్నాడు. “ప్రతీ చీరకీ మనం ఒక ధర ఫిక్సు చేస్తాం. ఆ పట్టికని మనమే కొనేవాళ్లకి అందజేస్తాం. లోకల్ టాక్సెస్ ఎకస్ట్రా అన్నది ఎలాగూ ఉ౦టు౦ది. కొనుగోలుదార్లకి విశ్వాసం ఏర్పడుతుంది. వ్యాపారంలో మొదటి మెట్టు విశ్వాసం. చిన్న పుస్తకం కూడా ఉచితంగా ఇద్దామనుకున్నాం గుర్తుంది కదా! ఆ పుస్తకంలో- “మీరు కస్టమరయితే ఏజాగ్రత్తలు తీసుకోవాలి” అనే ఈ సలహాలు కూడా చేరుద్దాం.
ఏ చీరయినా మీకు నచ్చితే దాన్ని వెంటనే కొనెయ్యాలన్న ఆతృతని దుకాణదారుని ముందు ప్రదర్శించకండి.
ఏ చీర మీదయినా మీ దృష్టి రెండు సెకన్లు ఎక్కువ నిలబడితే వెంటనే దుకాణందారు “ఇది లేటెస్ట్ డిజైనమ్మా, చాలా ఫాస్టు కలరు. మొన్నే వచ్చింది మార్కెట్లోకి…” అంటాడు. నమ్మకండి. మీ దృష్టి దాని మీద కొద్దిగా ఎక్కువ సేపు ఆగటంతో మీరు దానిపట్ల కొద్దిగా ఆకర్షితులయ్యారనీ, అటూ ఇటూ వూగుతున్నారనీ అతడు గ్రహించాడు. మిమ్మల్ని కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం మీకు నచ్చితేనే తీసుకోండి. అతడి మాటలవల్ల కాదు.
చీరలు కొనేటప్పుడు పొడవు వెడల్పు కొలవమని అడగటంలో మొహమాట పడకండి. అలాగే ఫాస్ట్ కలర్ అన్న ముద్ర ఉన్న చీరలు బెటరు.
అయిదు మీటర్ల కన్నా పొడవైన చీరలు వంటికి అందాన్నిస్తాయి.
కళ్ళు చెదిరే రంగుల్తో పెద్ద ప్రింటులున్న చీరల్ని భారీకాయం ఉన్నవాళ్లు కట్టుకుంటే ఎత్తైన ముఖ ద్వారానికి బరువుగా వేలాడే కర్టెన్లలా ఉంటారు. అలాగే, పొట్టివాళ్ళు ఎక్కువ నగలేసుకుంటే భూమిలో సగం వరకూ పాతి పెట్టిన మొక్కజొన్న పొత్తులా ఉంటారు.
సరస్వతి వ్రాయటం ఆపి, కాస్త తటపటాయించి, “ఈ చివరి సలహా తీసేద్దాం సార్. కొనుగోలుకీ దానికీ సంబంధంలేదు” అంది. ఆమె ఆలా చెప్పటంతో అతడు కాస్త ఆలోచించి, ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ, “అవును తీసెయ్యండి” అన్నాడు.
“గొప్ప తగ్గింపు ధరలు-” అన్న బోర్డు చూసి ఎప్పుడూ మోసపోకండి. ‘అసలు ఎవరైనా ధర ఎందుకు తగ్గించాలి?’ అని ఒక క్షణం ఆలోచించండి. కేవలం చీర కంటించిన కాగితం మీద, ‘తన కలం’ తో వ్రాసిన ధరలోనే తగ్గింపు ఇస్తున్నాడన్న విషయం మర్చిపోకండి. లేకపోతే మిగిలిపోయిన సరుకంతా వదుల్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించండి. ఏ విధంగానైనా మీకే నష్టం.
రవితేజ వారి ధరల లిస్టు దుకాణదారు దగ్గిర ఉచితంగా పొందండి. మీరు కొనే చీర ధర, దానితో పోల్చి సరిచూసుకోండి. చీర ధరలను కరెక్టుగా కొనుగోలుదార్లకి చెప్పే సంస్థ- రవితేజ టెక్స్‌టైల్స్ ఒకటే.
“నేను మీ వాడిని” అని అనే కాన్సెప్టు ఇది. సమాంతర ఆలోచన.
భాష, పదాలు, పొరపాట్ల గురించి మనకు తెలిసిన విషయాల్ని అంతటి యండమూరికి చెప్పినా తప్పులేదు కదా… తన పోస్టుల్లో పలుసార్లు సున్నాకు, మ్ అనే పొల్లుకూ తేడా గ్రహించక టైప్ చేస్తున్నట్టుంది… ఉదాహరణకు ఉంటుంది అనే పదంలో ఉ తరువాత సున్నా కొట్టడం తప్పు… అలాగే వ్రాయకండి సార్, రాయండి…
Share this Article