కొంచెం నవ్వొచ్చింది… కాస్త జాలేసింది… అందరూ నిమ్మగడ్డలు కాలేరు… యార్లగడ్డలు స్థిరంగా నిలబడలేరు అనిపించింది… ఈరోజు పత్రికల్లో వచ్చిన అనేకానేక వార్తల్లో ఈ ఒక్క వార్తే విశేషంగా ఆకర్షించింది… అసలు విషయం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచనల్లో పడేసింది… ఇంతకీ ఆ విషయం ఏమిటంటే…
జగన్ బాగా ఆలోచించీ చించీ, అత్యవసరంగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల సౌభాగ్యం కోసం, అత్యున్నత ప్రజాస్వామిక విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి… ఫాఫం, ఆ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీయార్ పేరు కత్తిరించి, వైఎస్ఆర్ పేరు పెట్టాడు తెలుసు కదా… గొప్ప రాజనీతిజ్ఞుడు… ఇంకా దాని మీద జరుగుతున్న చర్చ లోతుల్లోకి ఇక్కడ వెళ్లలేం గానీ… మొత్తానికి తెలుగుదేశం బ్యాచ్ అంతా రుసరుసలాడుతోంది… జగన్‌ను తిట్టిపోస్తోంది… కౌంటర్‌గా జగన్ బ్యాచ్ ఎన్టీయార్ గుణగణాలు, పాత చరిత్రల దాకా వెళ్లిపోయి ఎక్కువ బురదను ఎత్తిపోస్తోంది…
ఎటొచ్చీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఏమిటంటే… అధికార భాషా సంఘం, తెలుగు భాషా సాధికారత సంస్థ, హిందీ అకాడమీ పదవులను నానా కష్టాలూ పడి, రేయింబవళ్లూ వాటినే ఉద్దరిస్తున్న యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అనే పెద్దమనిషికి కోపం వచ్చింది… ఠాట్, నేను ఎన్టీయార్ వీరాభిమానిని, జగన్ నిర్ణయం నచ్చలేదు, ఎహెఫో, నా పదవులన్నింటికీ తీవ్ర దుఖంతో రాజీనామా ఇచ్చేస్తున్నా, ఐనాసరే, ఒంటరిగా తెలుగు భాషను ఉద్దరించే పనిని కొనసాగిస్తాను అంటూ ఏవేవో ధర్మపన్నాలు ప్రవచించాడు…
Ads
జగన్ కోసం నానా ప్రయాసపడ్డ చాలామందికి ఏమీ దక్కడం లేదు గానీ, ఈ హార్డ్ కోర్ ఎన్టీయార్ మనిషికి ఈ మూడు పదవులు ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు… లక్ష్మిపార్వతి పైరవీ చేసి ఇప్పించి ఉంటుందా..? ఎన్టీయార్ పేరును కత్తిరించి పారేస్తే, ఎన్టీయార్ నా దేవుడు, నా దేవుడు అని రోజుకు లక్షసార్లు స్మరించే లక్ష్మిపార్వతి కనీసం స్పందించలేదు, జాడాపత్తా లేదు ఆమె… కానీ యార్లగడ్డ మాత్రం సీరియస్‌గా రియాక్టయ్యాడు… పోనీ, ఆ మాట మీద నిలబడ్డాడా..? లేదు… అంత సీన్ లేదు తనకు…
తాడేపల్లి క్యాంపు నుంచి ఏం సందేశం అందిందో… రఘురామరాజు అనుభవాల్ని ఎవరైనా గుర్తుచేశారో తెలియదు గానీ… వెంటనే యార్లగడ్డ స్వరంలో వణుకు మొదలైంది… వెంటనే తిరుమల వెళ్లి శ్రీవారి ఎదుట సాగిలబడ్డాడు… బయట విలేకరులతో మాట్లాడుతూ… ‘‘నేను మళ్లీ ఎన్టీయార్ పేరు ఎత్తను’’ అని దాదాపు బావురుమన్నంత పనిచేశాడు… రాజీనామా ప్రకటనలపై ఒకరకంగా లెంపలేసుకున్నాడు…
మళ్లీ అవే మాటలు… ‘‘ఎన్టీయార్ అంటే తెలుగు వ్యక్తిత్వానికి, తెలుగుజాతికి నిలువెత్తు నిదర్శనం’’ అంటున్నాడు… ఐనాసరే, మంచో చెడో ఓ నిర్ణయం జరిగిపోయింది, మరేటి సేత్తాం, ఇకపై నేను రాజకీయాలు మాట్లాడను, దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నాను, అసలు రాజకీయాలే ప్రస్తావించను… ఇకపై వాటికి స్వస్తి… ఇక ఇప్పుడు సీరియస్‌గా తెలుగు పాలనభాషగా అమలు మీద దృష్టి పెడతాను… అని చెబుతూ పోయాడు… అంటే, తూచ్, నా రాజీనామా నిర్ణయం వాపస్ అని అంగీకరించినట్టే కదా…
ఇప్పటిదాకా తను ఏవో సీరియస్ రాజకీయాలు చేసినట్టు చెప్పుకుంటున్నాడు… తనేమైనా రాజకీయవేత్తా..? ఇక తెలుగు భాషను పాలనభాషగా అమలు చేయడంపై కాన్సంట్రేట్ చేస్తాను, అదే నా జీవితలక్ష్యం అంటున్నాడు, అంటే ఇన్నాళ్లూ పేరుకు ఆ హోదాల్లో ఉంటూ, పుణ్యానికి జీతభత్యాలు పొందుతున్నట్టుగా అంగీకరిస్తున్నాడా..? ఒక్క మాటలో పరిణతి లేదు, స్థిరత్వం లేదు, వీళ్లు ద్రౌపది వంటి చెత్తరచనలతో తెలుగు జాతిని, భాషను ఉద్దరిస్తుంటారుట… ఇప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో జ్ఞానోదయం అయ్యిందట..!!
కొసమెరుపు :: 1995 లో ఎన్టీఆర్ ను దించడానికి శ్రీ కారం చుట్టిన తొలి అంశం నందమూరి హరికృష్ణ జిల్లాల యాత్ర… హరికృష్ణకు కథ, మాటలు, పర్యవేక్షణ, దర్శకత్వం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ..!!
Share this Article