ఎల్లమ్మకు పెట్టుకునుడు
~~~~~~~~~~~~~~~~~
జాగరణ ఉన్నవాళ్లు శివరాత్రి ముందు
Ads
ఇగ మిగిలిన అందరూ ఉగాదికి ముందట
ఏదో ఒక మంగళవారం నాడు ఎల్లమ్మకు పెట్టుకుంటరు.
పొద్దు నడినెత్తిమీదికెల్లి పడుమటి దిక్కుకు దిగినంక
పట్టపగటీలి రెండు ఝాముల ఘడియలల్ల చేసే పండుగ.
అప్పటిదాక ఇంటియిల్లాలు నిష్టగ ఒక్క పొద్దుతో చేసే వంతన.
దసర ఎల్లమ్మ, సంకురాత్రి ఎల్లమ్మ, మాఘమాసపు ఎల్లమ్మ
ఇట్లా ఎల్లమ్మకు పెట్టుకునే పద్ధతులు వేరువేరుగ ఉంటయి.
గ్రామదేవతల పూజల్లో శాకాహార, మాంసాహార రెండుంటయి.
అమ్మవార్లకు జేసే శుద్ధ శాకాహార పూజను పాలపూజ అంటరు.
మా ఊర్ల ఒక వడ్లవాళ్లింటి ఎల్లమ్మ కొలుపు కొంత ప్రత్యేకం.
వాళ్లది బరిడత్తల ఎల్లమ్మ. అంటే దిగంబర పూజావిధానం.
చీకటి అర్రల ఈ కొలుపు దిగంబరంగా, మౌనంగా జరుగుద్ది.
చీకట్ల పూజాపునస్కారాలు చేసుడు ఇంటి ఆడమనిషి పని.
ఎల్లమ్మకు చేసే వంటలు అరుదైనవి, ప్రత్యేకమైనవి.
ఉలువలు అనుములు కలగలిపివేసే చప్పటి గుడాలు,
చప్పటి కుడుములు, తడి నువ్వులపిండితో చేసే పిండికూర,
తెల్లటి అన్నం, పచ్చటి కలెగూర, వంకాయ, పచ్చిపులుసు,
గడ్డపెరుగు, బెల్లపు సాక… ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి.
ఇందులో.. చప్పటి గుడాలు, నువ్వుల పిండికూరల రుచి
ఏడాదికోసారి ఎల్లమ్మకు పోసినప్పుడు మాత్రమే దొరుకుతది.
చప్పటి కుడుములకు అంచుకు పిండికూర అద్దుకోని తిన్నా
నల్లటి జమిలి గుడాలకు తెల్లటి పిండికూర కలుపుకోని తిన్నా
యాడాదంతా గుర్తుండే కమ్మకమ్మని రుచి ఈ పండుగకు సంతం !
~•~•~•~•~•~
శివునికి శిన్నబిడ్డా ౼ శివునెల్లిమాత
గౌతముని కోడలూ – గంభీర వాణి
మాదుగులాడిబిడ్డా – మావురాల ఎల్లు
గౌండ్లాడిబిడ్డా – ఘన్నసరి ఎల్లు
అమ్మా నీకు పదివేల దండమే…
మా యమ్మా ఎల్లమ్మా..! మావురాల ఎల్లమ్మా..!
~ ఒగ్గుకథలో ఒక ప్రసిద్ధమైన పంక్తి
రేణుకఎల్లమ్మ కొలుపు.. మా దగ్గర అనాదిగా వస్తున్నది.
కాకతమ్మకు సైదోడు ఏకవీర అని చరిత్రలో నమోదైనది.
పంబాలవాళ్లు ఏదీ తప్పియ్యకుంట ఉన్నది ఉన్నట్టుగ
ఎల్లమ్మ కథ చెప్పాల్నంటె ఏడు రాత్రులు సరిపోవట మరి..!
ఎల్లమ్మ కథ వింటె ఎంతరుచో.. నైవేద్యాలు తింటే అంతేరుచి !!
Share this Article