First woman who wrote veda ……. వేదం లిఖించిన మొదటి మహిళ… గార్గేయి అంటే ఇదీ… నిజమే, అత్యంత అరుదుగా ఉండే పేరు… ఒకాయన రాశాడు… 2021లో కేవలం 15 మందికి మాత్రమే ఈ పేరు పెట్టారట… అంటే ప్రతి 1.18 లక్షల మంది ఆడశిశువుల్లో ఒకరికి ఈ పేరు… గార్గి లేదా గార్గేయి… హలో మీరా సినిమా చూస్తుంటే, సినిమా మొత్తం ఒకే పాత్రధారి… ఆ ఒక్కతీ ఈమే… పేరు యెల్లాప్రగడ గార్గేయి…
ఇంట్రస్టింగు పేరు, అరుదైన పేరు… అలా అలా గూగుల్ పుటలు తిరగేస్తుంటే ఆమె గురించి, ఆ పేరు గురించి కాసింత సమాచారమే దొరికింది… సరే, ఈ సినిమా ప్రయోగం మీద నాకు పెద్దగా ఆసక్తి ఏమీ లేదు… ఒక పాత్ర లేదా రెండే పాత్రలు అనేవి ఇదివరకు లేవని కాదు… ఈమే అలా నటించిన తొలి ఆర్టిస్టు కూడా ఏమీకాదు… చివరకు ఆ బండ్ల గణేష్ అనబడే కొక్కిరాయి కూడా అదేదో తెలుగుసినిమాలో నటించాడుగా ఈమధ్య… ఒకే పాత్ర…
నిజానికి ఇలాంటి పాత్రలు ఆర్టిస్టుకు పెద్ద కష్టమేమీ కాదు… ఆ కథ చెప్పే దర్శకుడికి కథ, కథనాల మీద పట్టుండాలి… బోర్ రాకుండా, జనం లేచిపోకుండా, మంచి గ్రిప్పింగు టెంపో మెయింటెయిన్ చేయగలగాలి… ఐనా సగటు ప్రేక్షకుడికి బోరే… ప్రేక్షకుడు వివిధ పాత్రల సంఘర్షణను, తద్వారా నవరసాలను ఆశిస్తాడు, ఆస్వాదిస్తాడు… నో, నేను ఒకే పాత్రతో అన్నీ పండిస్తాను అని ఎవరైనా దర్శకుడు సిద్ధపడితే, ఎవరైనా నిర్మాత ముందుకొస్తే… సరే, ఎవరి అభిరుచి, ఎవరి పైత్యం వారిది…
Ads
ఈ సినిమా మాత్రం బాగున్నట్టే ఉంది… సగటు ప్రేక్షకుడి కోణంలో కాదు, సగటు అనలిస్టు లేదా రివ్యూయర్ కోణంలో…! ఈ సినిమా గురించి తరువాత చెప్పుకుందాం గానీ… గంటన్నరసేపు ఒకే అమ్మాయి మొహం, ఫీలింగ్స్ తెరపై చూస్తూ కనెక్ట్ కాగలమా..? కాగలం… ఈ ఫీట్ ఈ అమ్మాయి అసాధారణ ప్రతిభ వల్ల గానీ, దర్శకుడి అమోఘమైన దర్శకత్వ ప్రతిభ వల్ల గానీ చెప్పడం కష్టం… అమ్మాయి హావభావాలు, మొహం, లుక్కు అలా ప్లజెంటుగా ఉన్నాయి కాబట్టి…
అప్పుడెప్పుడో 2019లో ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాలో యాక్ట్ చేసింది… తరువాత నాలుగైదు చిన్నాచితకా పాత్రలు… ఎవడూ పిలుస్తలేడు అనుకుని టీవీల్లో దూరలేదు… ఇప్పుడు ఈ చిత్రం… పర్లేదు, మంచి పేరు తీసుకొస్తుంది… ఎంత మంచి పూలు పూసినా, ఎంత టేస్టీ కాయలు కాచినా, అందంగా కనిపించినా, మన పెరట్లో మొలిచిన మొక్కే అయినా సరే… పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు… అలాగే తెలుగమ్మాయి ఇండస్ట్రీకి పనికిరాదు… ఘర్‌కీ ముర్గీ దాల్ బరాబర్… నటన బేసిక్స్ రాకపోయినా ముంబై, కేరళ అమ్మాయిలే కావాలి కదా మనకు… గార్గేయీ అంతే…
సినిమా విషయానికి వద్దాం… రెండు రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి… తనని ప్రేమించిన అబ్బాయితోనే… విజయవాడలో… చీకటి పడింది … పెళ్లి బట్టలు టైలర్ నుంచి తీసుకొని కారులో ఇంటికి బయల్దేరింది… ఇంతలో పెళ్లి కుమారుడి నుంచి, కాబోయే అత్తగారి నుంచి, అమ్మా నాన్నల నుంచి ఫోన్లు. వాటితో పాటు అనుకోని , వూహించని ఫోన్ కాల్ ఒకటి… అది హైదరాబాద్ రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ నుంచి. సుధీర్ అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నంతో ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు.., ఆత్మహత్య ముందు వ్రాసిన ఉత్తరంలో “మీరా ” అని రాసి ఉందని, ఆ అమ్మాయిని వెంటనే హైదరాబాద్ పోలీసు స్టేషన్ కి రమ్మనమని కబురు…
అమ్మాయికి దిక్కు తోచదు, అయోమయ స్థితిలో హైదరాబాద్ కి ప్రయాణం… పెళ్లి విఘాతానికి మైండ్ బ్లాక్… ఈ గంటన్నర ప్రయాణంలో ఆ NH 4 రోడ్ మీద ఇంకొక మనిషి కనిపించకుండా బ్లూ టూత్ ఫోన్ లో అనేక మంది వ్యక్తులతో మాటలు తప్ప ఇంకేమీ ఉండవు.. అమ్మాయి పెళ్ళి చెడిపోయే పరిస్థితి… కథంతా ఇలాంటి ఉత్కంఠతో నడిపించగలిగాడు దర్శకుడు… సంభాషణలు కూడా కృతకంగా ఉండకుండా నేచురల్‌గా ఉంటాయి… ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోవాలే గానీ దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ (బాపు శిష్యుడు), నటి గార్గేయి తెలుగు సినిమాకు బాగా ఉపయోగపడగల వ్యక్తులు…
Share this Article