ఇన్నాళ్లూ శుక్రమహర్దశ నడిచింది కాబట్టి… అనుకున్నట్టు టైమ్ సహకరించింది కాబట్టి… ఆలోచనల్లో, అడుగుల్లో ఎన్ని లోపాలున్నా సరే నడిచిపోయింది… భజనపరులు చుట్టూ చేరి అపర చాణక్యుడు ఎట్సెట్రా భుజకీర్తులు తగిలించారు కాబట్టి నిజంగానే తను చాణక్యుడికి తాతనేమో అనే భ్రమల్లోకి కేసీయార్ జారిపోయినట్టున్నాడు…
టైమ్ ఇక చాల్లే అన్నాక ఇప్పుడు తన పాలన వైఫల్యాలు, తన అక్రమాలు గట్రా తెర మీదకు వస్తున్నయ్… నిన్న ఎక్కడో అన్నాడు… 20- 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్‌లోకి వచ్చేస్తాను ఎవరో సమాచారం పంపించాడట, ఇప్పుడు వద్దులే, అది ధర్మం కాదు అని సారు గారు వద్దన్నారట… అక్కడికి తనేదో పెద్ద ప్రజాస్వామికవాది అయినట్టు…
నాతో ఇంత మంది టచ్‌లో, అంతమంది టచ్‌లో అనేది నిజంగానే చాణక్యుడి కాలం నాటి పొలిటికల్ మైండ్ గేమ్… దాన్ని ఇప్పుడు గల్లీ లీడర్లు కూడా నమ్మరు… నిజంగానే 25 మంది తనవైపు వచ్చే చాన్స్ ఉంటే తక్షణం చేర్చుకుని రేవంత్‌కు ఎసరు పెట్టేవాడు, కేటీయార్‌కు పట్టం కట్టేసేవాడు… కాంగ్రెస్‌లో కూడా తనవాళ్లు ఉంటారు కదా… అందరూ పార్టీ నుంచి జంపైపోతున్నారు, ఇలాంటి ప్రకటనలతో కేడర్‌లో ధీమాను నింపి, వలసలను నిరోధించాలని అనుకుంటే అవి వేస్ట్ ప్రయత్నం…
Ads
పోనీ, తనేమైనా ఈ వలసలు, జంపింగులు, ప్రలోభాలతో కొనుగోళ్లలో శుద్ధ పూసా..? గత రెండు టరమ్స్‌లో ప్రతిపక్ష పార్టీలను నిలువునా చీల్చేసిన చరిత్రే కదా… ఈరోజుకూ బిడ్డ జైలుపాలైతే పరామర్శించలేదనే విమర్శకు జవాబుగా నిన్న ఓ కామెంట్ విసిరాడు…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయడానికి పోలీసులను పంపించాం కదా అందుకే బీజేపీ కక్షకట్టింది, కవితను ఆ కేసులో ఇరికించింది అని ఆరోపించాడు… ఎమ్మెల్యేల కొనుగోలు అనేదే పెద్ద డ్రామా… పైగా దానికన్నా ముందే కదా కవిత మీద కేసు… అంటే, సంతోష్‌ను కేసీయార్ ఇరికిస్తాడు, సతాయిస్తాడు, మనల్ని వంగదీసే ప్రయత్నాలు చేస్తాడు, ఢిల్లీలో స్థాయిలో గాయిగత్తర చేస్తాడు, నా పదవికే ఎసరు పెడతాడు అని ముందుగానే మోడీకి కలవచ్చి, అందుకే కవిత పేరును కేసులో ఇరికించారా..? హేమిటో… సారు గారి ఫ్రస్ట్రేషన్ లెవల్ ఓ రేంజ్‌లో కనిపిస్తోంది…
పార్టీ వీడి వెళ్లినవాళ్లను మళ్లీ తీసుకోం, కాళ్లు మొక్కినా రానివ్వం, ఉద్యమకాలం నాటి కేసీయార్‌ను మళ్లీ చూస్తారు మీరు, మెరిగలను తయారు చేస్తా అన్నాడు కేసీయార్ తమ అభ్యర్థులకు కర్తవ్యబోధ చేసే ఆ భేటీలో… అసలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకులను కూడా, తెలంగాణ సమాజం ఆకాంక్షలకు వ్యతిరేకంగా నెత్తిన పెట్టుకున్నదే తమరు… సొసైటీ మీద రుద్దిందే తమరు… మళ్లీ వసంతం గనుక పొరపాటున వస్తే ఈ జంపింగ్ కేరక్టర్లను అర్జెంటుగా పార్టీలోకి చేర్చుకోవడం కూడా పక్కా…
ఒకటి మాత్రం పరోక్షంగా అంగీకరించాడు తను… ఉద్యమకాలం నాటి కేసీయార్‌ను చూస్తారు అన్నాడు కదా… ఎస్, అధికారం వచ్చాక ఆ పాత కేసీయార్ ఏనాడో మాయమైపోయాడు… ప్రస్తుతం కేసీయార్ ఉద్యమ కేసీయార్ ఏమాత్రం కాదు… ఫక్తు అవకాశవాద రాజకీయ నాయకుడు… కేసీయారే స్వయంగా అంగీకరించాడు కాబట్టి, ఇందులో తన వ్యాఖ్యల్ని వ్యతిరేకించాల్సిన పనే లేదు… నిక్కమైన నిజం చెప్పావు నాయకా…!! అవునూ, అసెంబ్లీ రద్దు కావచ్చు అంటున్నవ్ కదా, అదెలా…?!
Share this Article