.
రాజకీయాల్లో విధేయతలు అటూ ఇటూ మారుతూనే ఉంటాయి… సిద్ధాంతాలు రాద్దాంతాలు జాన్తా నై… జంపింగులు సర్వసాధారణం… ఎదుటి పార్టీ నుంచి రాగానే మంత్రి పదవులు కూడా ఇచ్చి నెత్తిన పెట్టుకునే సందర్భాలూ బోలెడు…
ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు… దేశమంతా ఇదే పోకడ, పార్టీలన్నీ ఇదే తంతు… విలువలు, ప్రమాణాలు అని ఎవడైనా కూస్తే పిచ్చోళ్లలా చూసే రోజులివి… అలాంటప్పుడు ఒక పార్టీకి విధేయులుగా ఉన్న రాజకీయేతరులు మరో పార్టీకి విధేయులుగా మారకూడదని ఏముంది..? వాళ్ల అవసరాలను బట్టి..!!
Ads
కానీ ఏపీ పాలిటిక్స్ అలా కాదు… ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు… ఎక్కడి కాకి అక్కడే గప్‌చుప్ అన్నట్టుగా ఉండిపోవాలి… లేకపోతే పార్టీల సోషల్ మీడియాలు ఊరుకోవు… రాళ్లతో కొడతాయి… సింగర్ మంగ్లీ విషయం అదే కదా…
ఆమె ఎస్వీబీసీ సలహాదారు, జగన్ ప్రచారకురాలు, వైసీపీ పాటగత్తె… తెలుగుదేశం, చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడింది… ఐతేనేం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ కుటుంబసభ్యురాలిగా అమిత ప్రాధాన్యం ఇచ్చి మరీ నెత్తికి ఎక్కించుకున్నాడు… తెలుగుదేశం సోషల్ మీడియా కుతకుతలాడిపోయింది… అదింకా సద్దుమణగనే లేదు…
తాజాగా నాగార్జున… అక్కినేని మీద యార్లగడ్డ రాసిన ఓ పుస్తకాన్ని ఏకంగా ప్రధాని మోడీకి సమర్పించి వచ్చింది అక్కినేని కుటుంబం… ఆ సందర్భంగా టీడీపీ లావు కృష్ణదేవరాయలు అక్కడే ఉన్నాడు… ఆయన ఇంట్లోనే అక్కినేని కుటుంబం భోజనం చేసిందట… తెలుగుదేశం పార్లమెంటరీ ఆఫీసులో దర్శనమిచ్చాడు నాగార్జున…
అప్పట్లో తెలుగు మత్స్యకారుల్ని పాకిస్థాన్ జైళ్ల నుంచి సుష్మా స్వరాజ్ విడిపించిన సీన్లను తన కొడుకు నటించిన తండేల్ సినిమాలో హైలైట్ చేశామనీ నాగార్జున మోడీకి చెప్పుకున్నాడు… అంతా బాగానే ఉంది… మోడీ ధోరణి వేరు… అప్పుడే పవన్ కల్యాణ్ సన్నిహితుడు అవుతాడు, అప్పుడే మంచు మోహన్‌బాబు ఫ్యామిలీకి టైమిస్తాడు… జూనియర్‌కు గాలం వేయిస్తాడు… ఇప్పుడు నాగార్జున… అంతే…
అసలే రేవంత్ రెడ్డి సర్కారు మీద నాగార్జునకు కోపం రగులుతోంది… తన కన్వెన్షన్ హాల్ కూల్చేయడం, మంత్రి సురేఖ తమను మరీ కించపరిచే వ్యాఖ్యలు చేయడం గట్రా తనను అభద్రతలోకి నెట్టేస్తున్నాయి… తను అత్యంత సన్నిహితంగా మెదిలే జగన్ ఏమీ చేయలేని దురవస్థ… బీఆర్ఎస్ పరిస్థితే బాగాలేదు… సో, తనకు మోడీ సపోర్ట్ కావాలి, టీడీపీ సపోర్ట్ కావాలి…
బహుశా అదే మోడీ వద్దకు తీసుకుపోయిందేమో వివిధ మార్గాలు, ప్రయత్నాలతో..! ఇది తెలుగుదేశం కూటమికి అస్సలు నచ్చడం లేదు… మొన్నటిదాకా మంగ్లీపై విమర్శలతో దాడిచేసిన బ్యాచ్ ఇప్పుడు నాగార్జునను టార్గెట్ చేస్తోంది… టీడీపీ వ్యతిరేకితో ఢిల్లీ టీడీపీ ముఖ్యులు అంత రాసుకుని పూసుకుని తిరుగుతూ నాగార్జునను ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారని ఆ విమర్శల సారాంశం…
మేమేమో జగన్ వేధింపులకు గురై, నానా అవస్థలూ పడి తెలుగుదేశం జెండాలు మోసి, కేసుల పాలై, తిరిగి అధికారంలోకి తీసుకొస్తే… పార్టీయేమో మంగ్లీలకు, నాగార్జునలకూ దాసోహం అంటోందని వారి కోపం… అదంతే… ముందే చెప్పుకున్నాం కదా… అటు కాకి ఇటు రాకూడదు… అంతే..!!
Share this Article