‘‘ఉత్తరప్రదేశంలో బీజేపీ గెలవబోతుందనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… ఆరు వారాలుగా నేను యూపీలో తిరుగుతున్నాను, గ్రామీణ వోటర్లతో సంభాషించినప్పుడు నాకు అర్థమైంది కూడా అదే… నిజానికి ఎస్పీ ఈసారి గెలవబోతుందనే హైప్ ఎలా క్రియేటైంది..? 1) కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు బలహీనపడటం 2) అఖిలేష్ సభలకు జనం పోటెత్తడం 3) రైతుల ఆగ్రహ ప్రదర్శనలు 4) యాదవ, ముస్లిం, జాట్ వోటర్లు ఎస్పీకి బలమైన మద్దతుగా నిలవడం 5) ఠాకూర్ యోగి తీరుతో బ్రాహ్మణ సమాజం కోపంగా ఉండటం 6) ప్రజలకు కరోనా కష్టాలు 7) అధిక ధరలు…
ఇన్నిరకాల అంచనాలతో జర్నలిస్టులు, నాయకులు, సెఫాలజిస్టులు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేశారు… అందుకే యోగి ఓడిపోతున్నాడని బోలెడు విశ్లేషణలు, కథనాలు కుమ్మేశారు… ఆమధ్య బీజేపీ హైకమాండ్ ఈ ప్రజావ్యతిరేకతను గమనించే యోగిని వెళ్లగొట్టాలని అనుకుందని కూడా రాశారు… కానీ సామాన్య వోటర్లతో మాట్లాడుతుంటేనే అసలు జనాభిప్రాయం తెలిసొచ్చింది నాకు… ప్రజలు కష్టాలు పడుతున్నారు, కానీ దానికి యోగి కారణమని నిందించడం లేదు… అంటే ప్రభుత్వాన్ని ఎలాగైనా దింపేయాలన్నంత తీవ్ర ఆగ్రహానికి దారితీయలేదు…
Ads
ప్రత్యేకించి ఎక్కడ, ఎవరిని అడిగినా సరే… యోగి బాగానే పనిచేస్తున్నాడు, ప్రత్యేకించి మా పిల్లలు, మా అక్కచెల్లెళ్లు సురక్షితంగా ఉన్నారు అనే అభిప్రాయమే నేను విన్నాను… నిజానికి ఎస్పీ వోట్లు పెరగలేదా..? పెరిగినయ్… కానీ విజయానికి తగినంతగా పెరగలేదు… కాంగ్రెస్, బీఎస్పీ వోటర్లు ఎస్పీ వైపే కాదు, బీజేపీ వైపు కూడా మళ్లారు… ప్రత్యేకించి మహిళల మద్దతు బీజేపీకి బలంగా లాభించింది… అయితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్‌లో చూపించినంత భారీగా ఎస్పీ, బీజేపీ నడుమ తేడా ఉండదని నా అంచనా… ఎస్పీ చాలా తీవ్రమైన పోటీని ఇచ్చింది…’’
….. ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ దిప్రింట్ సైటుకు రాసిన ఓ వ్యాసం ఇలాగే చెబుతోంది… ఆయన నిజానికి యాంటీ బీజేపీయే… కానీ ఇక్కడ ఓ ప్రొఫెషనల్ సెఫాలజిస్టుగా తన అంచనాలు ఏమిటో వెల్లడించాడు… ఆ పెద్ద వ్యాసంలో ఒక వాక్యం బలంగా ఆకర్షించింది… అదే మహిళల మద్దతు అనేది… తమకు ఈ ప్రభుత్వపాలనలో రక్షణ ఉంటుందనే నమ్మకం మహిళల్లో నెలకొన్నప్పుడు మిగతా కష్టాలు, వైఫల్యాలు కొట్టుకుపోతాయన్నమాట… కులాలు, ప్రాంతాలకు అతీతంగా మహిళలు ప్రభుత్వాన్ని కాపాడుకుంటారన్నమాట… గేమ్ ఛేంజర్ సపోర్ట్…
ఇంతకీ మహిళల మద్దతు ఎంత..? ఇండియా టుడే- యాక్సిస్ సర్వేను పరిశీలిస్తే… గత ఎన్నికలకన్నా బీజేపీకి మహిళల మద్దతు 4 శాతం పెరిగింది… ఎస్పీకి ఆ మద్దతుశాతం 8 శాతం పడిపోయింది… ఓవరాల్‌గా బీజేపీకి 48 శాతం మంది, అంటే దాదాపు సగం మంది మహిళలు సపోర్ట్ చేశారన్నమాట… ఎస్పీకన్నా ఇది ఏకంగా 16 శాతం అధికం… ఎస్పీని ఏం దెబ్బకొట్టిందో అర్థమవుతోందిగా… కొంతమేరకు మాయావతి పట్ల మహిళల అభిమానం కనిపించినా, ప్రియాంకగాంధీ అయితే టోటల్ ఫ్లాప్… అయితే యూపీలో ఎన్నికల విధుల్లో తిరిగిన జర్నలిస్టుల్లో అధికులు ఈరోజుకూ ఎస్పీయే గెలుస్తుందని చెబుతున్నారు… పోటీ తీవ్రంగానే సాగింది… ఇక ఫలితాలను చూడాల్సి ఉంది… రేపే కదా…!!
Share this Article