.
( రమణ కొంటికర్ల )… రామాయణ కథనాన్ని మరో కోణంలో చూపించిన మణిరత్నం విలన్! నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీ కాంబోలో తెరకెక్కిన రామయణ ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. ఈ సినిమాలో రావణుడి పాత్రను హైలెట్ చేయడంపైనా భిన్నమైన వాదనలూ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో రామాయణ మీంచి దృష్టి కాస్తా మణిరత్నం రావణన్ మీదకు మళ్లుతోంది. ఈ క్రమంలో రామాయణ కథనాన్ని మరోకోణంలో చూపించడం.. ప్రతినాయకుడైన రావణున్ని నాయకుడిలా ఎలివేట్ చేయడంపైనా ఇప్పుడో డిబేట్ మొదలైంది.
రామాయణం అంటే రాముడు కథానాయకుడు.. రావణుడు ప్రతినాయకుడు. మంచి, చెడుల మధ్య యుద్ధంగా ఈ ఇతిహాసాన్ని తరాలుగా చూస్తున్నాం. అయితే రావణుడి కోణంలో రామాయణాన్ని చూస్తే? అతడిని విలన్‌గా కాకుండా హీరోగా చూపిస్తే? ఈ ఆలోచనతోనే ప్రముఖ దర్శకుడు మణిరత్నం 2010లో రావణన్ తెరకెక్కించారు. రామాయణంలోని పాత్రలను, సంఘటనలను ఆధునిక సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ ఒక భిన్నమైన కథనాన్ని తెరపై ఆవిష్కరించారు.
Ads
ఇటీవల విడుదలైన రామాయణ పార్ట్ వన్ సినిమాలో యష్ పోషించిన రావణుడి పాత్రకు లభిస్తున్న ఆదరణ ఒకవైపు, రావణున్ని హీరో కంటే హైలెట్ గా చూపించారంటున్న వాదనలు మరోవైపు చూస్తే.. ఆ పాత్రపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి స్పష్టమవుతోంది. సీతారాములుగా రణబీర్ కపూర్ , సాయిపల్లవికి ఎంత ప్రాధాన్యత ఉందో… రావణుడి నేపథ్యానికీ అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం.. ఇంకొక్కపాలు ఎక్కువే హైలెట్ చేయడంతో రావణుడి పాత్ర మళ్లీ ఫోర్ గ్రౌండ్ లోకొచ్చింది.
నిజానికి రామాయణాన్ని తెరకెక్కించిన అనేక మంది దర్శకులు రావణుడి వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలను విస్మరించలేదు. రావణుడు గొప్ప పండితుడు, పరాక్రమవంతుడు, శివభక్తుడు. అతడి పతనానికి అహంకారమే కారణమనే భావనను రామానంద్ సాగర్ రూపొందించిన ప్రసిద్ధ టీవీ సీరియల్ రామాయణ్ కూడా ప్రస్తావించింది. రావణుడి మరణ ఘట్టంలో అతడి జ్ఞానం, గొప్పతనాన్ని గుర్తుచేస్తూ అతడి అహంకారమే పతనానికి దారితీసిందనే భావన ఆ సీరియల్ లో కూడా మనకు కనిపిస్తుంది.
1993లో వచ్చిన జపాన్- భారత్ సంయుక్త యానిమేషన్ చిత్రం రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామలో రావణుడిని భయంకరమైన రూపంలో చూపించారు. కోరల్లాంటి పళ్లు, తెల్లటి మీసాలతో రాక్షస రూపాన్ని తలపించేలా అతడి పాత్రను తీర్చిదిద్దారు. ఇలా రావణుడి గురించి భిన్నమైన అభిప్రాయాలతో సినిమాలను చూశాం. అయితే మణిరత్నం రావణన్ మాత్రం రావణుడి పాత్రను పూర్తిగా భిన్నంగా ఆవిష్కరించింది.

ఇతిహాస పాత్రలకు ఆధునిక రూపం
భారతీయ ఇతిహాసాలు, పురాణాల నుంచి స్ఫూర్తి పొందడం మణిరత్నానికి కొత్తేమీ కాదు. 1991లో వచ్చిన దళపతి సినిమాలో మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధునిక నేపథ్యంలో రజనీకాంత్ ద్వారా చూపించారు. 1992లో వచ్చిన రోజా సినిమాలో సావిత్రి, సత్యవంతుల కథలోని భావోద్వేగాలను కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో ఆవిష్కరించారు. అదే తరహాలో రావణన్ లో రామాయణంలోని రావణుడి పాత్రను ఆధునిక కాలంలోని ఒక తిరుగుబాటుదారుడిగా మలిచారు. పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక విప్లవకారుడి కథగా సినిమాను రూపొందించారు.
రావణన్ సినిమా తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైంది. తమిళంలో రావణన్, హిందీలో రావణ్ పేరుతో విడుదల చేశారు. తెలుగులో విలన్ పేరుతో రిలీజైంది. అన్ని వెర్షన్లలోనూ ఐశ్వర్యారాయ్ బచ్చన్ నటించారు. విక్రమ్ కూడా రెండు చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే తమిళ వెర్షన్లో విక్రమ్ వీర అనే పేరుతో రావణుడి క్యారెక్టర్ లో కనిపిస్తే, హిందీ వెర్షన్లో అభిషేక్ బచ్చన్ రావణుడిగా నటించారు.
తమిళ వెర్షన్లో వీర ఒక పరారీలో ఉన్న విప్లవకారుడు. అతడి స్థావరం అడవులు, జలపాతాలతో కూడిన ప్రాంతం. రాముడి పాత్రకు ప్రతిరూపంగా దేవ్ కనిపిస్తాడు. అతడు పోలీసు ఉన్నతాధికారి. చట్టం, న్యాయం, క్రమశిక్షణకు ప్రతీకగా కనిపించే దేవ్ పాత్రలోనూ కొన్ని లోపాలున్నాయని మణిరత్నం రావణ్ సినిమా ప్రశ్నిస్తుంది.
దేవ్ భార్య రాగిణిని వీర కిడ్నాప్ చేయడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. తన భార్యను విడిపించుకోవడంతో పాటు వీర నడుపుతున్న సమాంతర వ్యవస్థను అంతం చేయాలని దేవ్ ప్రయత్నిస్తాడు.
శూర్పణఖకు జరిగిన అవమానానికి కొత్త అర్థం… తాజా నితేష్ తివారీ సినిమాలోనూ రకుల్ ప్రతీ సింగ్ ధరించిన శూర్పణఖ పాత్రపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలో మణిరత్నం విలన్ లో కూడా శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే వీర.. దేవ్ పై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తాడు. రామాయణంలో శూర్పణఖ ముక్కు కోయడం ఓ ముఖ్యమైన ఘట్టం. కానీ విలన్ లో ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని.. మహిళపై జరిగిన దారుణమైన లైంగిక దాడికి ప్రతీకారంగా మల్చాడు మణిరత్నం
వీర సవతి సోదరి వెన్నెలను దేవ్‌కు నమ్మకస్థుడైన పోలీసు అధికారి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడతాడు. ఆ ఘటనతోనే వీర జీవితం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. తన సోదరికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో పోరాటం ప్రారంభిస్తాడు. అలా రామాయణంలోని శూర్పణఖ అవమానాన్ని ఆధునిక సమాజంలో మహిళలపై జరుగుతున్న హింస, పోలీసుల దౌర్జన్యాలకు అన్వయించిన మణిరత్నం సాహసోపేతమైన ఆలోచన మనకు విలన్ లో కనిపిస్తుంది.
మరోవైపు, రాగిణి వీర చెర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ధైర్యం, తెగువ వీరను ఆకర్షిస్తాయి. మొదట్లో వీరను చూసి భయపడే రాగిణి.. అతడితో కొంతకాలం గడిపిన తర్వాత అతడి పోరాటం వెనుక ఉన్న వ్యక్తిగత బాధను, ఆవేదనను అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది.
ప్రేమ, న్యాయం, ధర్మంపై ప్రశ్నలు..? వీరపై రాగిణికి ఏర్పడే సానుభూతి క్రమంగా సంక్లిష్టమైన భావోద్వేగంగా మారుతుంది. తన భర్త దేవ్, అతడి పోలీసు బృందం కూడా తన కష్టాలకు కారణమనే నిజాన్ని ఆమె గుర్తిస్తుంది. వీర, రాగిణి మధ్య జరిగే ఓ సంభాషణ సినిమాలో అత్యంత కీలకం. దేవ్ దేవుడిలాంటి వ్యక్తి అని రాగిణి పొగుడుతుంది. అప్పుడు వీర ఒక ప్రశ్న వేస్తాడు. అతడు నిజంగా దేవుడిలాంటి వాడా? లేక దేవుడేనా? అవతార పురుషుడా? ఆదర్శ మానవుడా? అని నిలదీస్తాడు.
తర్వాత దేవ్ ప్రవర్తన కూడా వీర అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఆ సన్నివేశం ద్వారా ఒక వ్యక్తిని కేవలం అతడి హోదా, ప్రతిష్ఠ ఆధారంగా మంచివాడిగా నిర్ణయించగలమా? అధికారంలో ఉన్నవారే ధర్మానికి ప్రతిరూపాలా? అనే ప్రశ్నలను మణిరత్నం ప్రేక్షకుల ముందుంచాడు.
సినిమాలో రాగిణి, వీర మధ్య వచ్చే ఒక కలల సన్నివేశం కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. వీర నుంచి తప్పించుకోవడానికి రాగిణి ప్రయత్నించడం, అతడు ఆమెను వెంబడించడం నృత్యరూపంలో చిత్రీకరించారు. ప్రముఖ నృత్యకారుడు అస్తాద్ దేబూ నృత్యరీతులను సమకూర్చారు. ఆ కల ఎవరిది? అందులోని భావాలు ఎవరికి సంబంధించినవి? అనే సందిగ్ధతను దర్శకుడు ఉద్దేశపూర్వకంగా కొనసాగించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, పాటలు కూడా వీర పాత్రలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. కేవలం క్రూరమైన తిరుగుబాటుదారుడిగానే కాకుండా ప్రేమించగల, భావోద్వేగాలున్న వ్యక్తిగా రావణుడి ప్రతిరూపమైన వీరను చూపించాడు మణిరత్నం.
హీరోయిన్ అపహరణ వెనుక విలన్ కోణాన్ని ఆవిష్కరించిన రావణన్… రావణన్ లేదా విలన్ సినిమాలో.. మరో ఆసక్తికరమైన అంశం సీతను అపహరించడం వెనుక రావణుడి కోణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. రామాయణంలో శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా రావణుడు సీతను అపహరిస్తాడు. ఆ నిర్ణయమే చివరకు అతడి మరణానికి కారణమవుతుంది. రావణన్ లో కూడా వీర తన సోదరి వెన్నెలకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. కానీ రాగిణిపై అతడికి కలిగిన ప్రేమ, భావోద్వేగాలు అతడి లక్ష్యానికి అడ్డుపడతాయి.
ఒక యోధుడి పతనానికి ఒక మహిళ కారణమవుతుందనే భావనను కూడా సినిమా మరోసారి గుర్తుచేస్తుంది. 2010లో రావణన్ సినిమా విడుదలైనప్పుడు సెన్సార్ బోర్డు అలాంటి ప్రయోగాత్మక కథనానికి అనుమతించడం కూడా గమనించాల్సిన విషయం. రాముడి ధర్మాన్ని ప్రశ్నిస్తూ, రావణుడి క్రూరత్వానికి మరో నేపథ్యాన్ని చూపిస్తూ.. మణిరత్నం సమాజంలోని మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అత్యాచారాలు, అధికార దుర్వినియోగం వంటి ఎన్నో సున్నితమైన అంశాలను ఇతిహాసంతో ముడిపెట్టారు.
అయితే సినిమా కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం.. వీరను రావణుడితో పోల్చే ప్రయత్నం మరీ ఎక్కువ కావడం వంటి లోపాలూ జనానికి పట్టుకోలేదు. హిందీ వెర్షన్లో అభిషేక్ బచ్చన్ నటనతో పోలిస్తే తమిళ వెర్షన్లో విక్రమ్ నటన ఎంతో ప్రభావవంతంగా నిలిచింది. అడవి నేపథ్యం, కథలోని భావోద్వేగాలు కూడా తమిళ వెర్షన్‌కు మరింత సహజంగా సరిపోయాయి. తమిళ మాతృకనే తెలుగులోకీ డబ్ చేశారు. అయితే, తమిళనాడులో మాత్రం రావణ్ సినిమాకు ఆదరణ దక్కింది. కానీ, హిందీలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
మణిరత్నం చూపించిన రామాయణంలోని ప్రధాన కోణాలేంటి..? మణిరత్నం రావణన్ కేవలం రామాయణ కథను ఆధునికీకరించిన సినిమా మాత్రమే కాదు. మంచి, చెడుల మధ్య ఉండే సరిహద్దులు ఎంత సంక్లిష్టమైనవో ప్రశ్నించిన ఓ గొప్ప ప్రయత్నం.
ఎవరు హీరో? ఎవరు విలన్? అధికారంలో ఉన్నవారే ధర్మాత్ములా? తిరుగుబాటు చేసేవారంతా దుష్టులేనా? న్యాయం కోసం పోరాడేవారు అనుసరించే మార్గాలు కూడా న్యాయబద్ధంగా ఉండాలా? ఇలాంటి ప్రశ్నలను సినిమా ప్రేక్షకుల ముందుంచుతుంది.
అంతర్జాతీయ స్థాయిలోనూ రామాయణ ఘట్టాలను ఉపయోగించుకుంటున్న దర్శకులెందరినో మనం చూస్తూనే ఉన్నాం. ఇండోనేషియా దర్శకుడు గారిన్ నుగ్రోహో రూపొందించిన ఒపెరా జావా వంటి చిత్రాలు కూడా రామాయణంలోని కీలక ఘట్టాలను ప్రత్యామ్నాయ దృక్కోణాల్లో ఆవిష్కరించాయి. రామాయణం వంటి మహత్తర ఇతిహాసం భిన్నమైన వ్యాఖ్యానాలను తట్టుకోగలిగేంత విస్తృతమైందని రావణన్ తో సహా.. ఎన్నో సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి.
రాముడి గొప్పతనాన్ని తగ్గించడం లేదా రావణుడిని పూర్తిగా సమర్థించడమే సినిమాల ఉద్దేశం కాదు. ఒక కథను వేర్వేరు కోణాల్లో చూడటం.. సమకాలీన సమాజానికి తగ్గట్టుగా అన్వయించడం.. కొత్త ప్రశ్నలు, అర్థాలతో ప్రేక్షకుల మెదళ్లకు మేత పెట్టడం ఇవన్నీ ఆధునిక రామాణాల వెనుకున్న ఆంతర్యాలు.
రావణుడి పాత్రపై ఆసక్తి నేటికీ కొనసాగుతోంది. తాజా రామాయణ చిత్రంలోనూ యష్ పాత్రకు లభిస్తున్న ప్రాధాన్యం అందుకు నిదర్శనం. దశాబ్దాలుగా రామాయణాన్ని ఎన్నో రూపాల్లో చూసినా.. రావణుడి కోణం మాత్రం ప్రేక్షకుల ఊహాశక్తిని ఇంకా వెంటాడుతూనే ఉంది.
Share this Article