తెలుగు భాషా దినోత్సవం పూట కొన్ని యూట్యూబ్ ఘనవార్తల థంబ్ నెయిళ్లు దురదృష్టంకొద్దీ చూడబడ్డాను… వామ్మో, వరుసగా అవి పైపైన చదువుతూ వెళ్తుంటే… ఎన్నో బూతులు… అంటే తప్పులు… తప్పుల కారణంగా పుట్టుకొచ్చే బూతులు…
చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏర్పాటులాగా… యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి భూతపిశాచాల్ని గుర్తించి, కేసులు పెడితే, కనీసం యూట్యూబ్‌లో వాటి ప్రసారాల్ని బ్యాన్ చేయిస్తే… తెలుగు రక్షింపబడుతుందేమో అనిపించింది… పాత్రికేయం వంటి పెద్ద పదాలు వద్దులెండి ఇక్కడ…
ఇది రాస్తూ, ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే, హఠాత్తుగా మిత్రుడు విశీ రాసిన తాజా పోస్టు కనిపించింది… చదవండి, యథాతథంగా… ఇదీ ఆప్ట్ అనిపించింది…
Ads
తెలుగుతో గేమ్స్ వద్దు.. శాల్తీలు లేచిపోతాయ్!
* మహిళా ఎమ్మెలే- “నా పెదవి ప్రజలకంకితం..”
క్షమించాలి.. “నా పదవి ప్రజలకంకితం”
* సభలో ముఖ్యఅతిథి – “ఈయనో పెద్ద విధ్వంసుడు”
తప్పు.. తప్పు.. “ఈయనో పెద్ద విద్వాంసుడు”
* అద్దె ఇంట్లో గృహస్తు – “ఇంటి పైకప్పులో ఉచ్చలు తేలాయి”
అయ్యో.. “ఉచ్చలు కాదు.. ఊచలు”
* మంత్రి గారు – “విద్యార్థులకు సరైన సతులను అందించాలి”
రామ రామ.. “సరైన వసతులను అందించాలి”
* ఊరి పంచాయతీలో – “ఊరందరికీ ఆయన పెద్ద దుక్క”
నా మొహం.. ‘దుక్క’ కాదు.. ‘దిక్కు’
* స్నేహితుడు అందరితో – “నా మిత్రుడు కళాపిశాచి”
ఒరేయ్.. అది ‘కళాపిపాసి'(వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో?)
* పేపర్లో వ్యాసం – ‘స్త్రీలు తమ ఇంటి పనివారితో కలిసి పండుకుంటున్నారు’
సవరణ – ‘స్త్రీలు తమ ఇంటి పనివారితో కలిసి వండుకుంటున్నారు’
* అదే పేపర్లో మరో వ్యాసం – ‘మగవాళ్లు స్త్రీలలో పాలు వెతుకుతారు’
క్షమించాలి.. స్పేస్ మిస్టేక్ – ‘మగవాళ్లు స్త్రీల లోపాలు వెతుకుతారు’
* ఫ్లెక్సీపై అక్షరాలు – ‘బీర్ రామారావు గారికి ఆహ్వానం’
అయ్యా.. ఆయన పేరు ‘బి.ఆర్.రామారావు’
* ఫేస్‌బుక్‌లో ప్రేమికుడి వ్యాఖ్య – ‘ఆమె నాతో గుడిపిన క్షణాలు..’
సారీ.. సారీ.. ‘గడిపిన క్షణాలు’
* కవిత్వ పుస్తకంలో అచ్చు తప్పు – ‘పిర్రగాలికి ఆ తీటంతా చిమచిమలాడింది’
అయ్యో! హతవిధీ! ‘పిల్లగాలికి ఆ తోటంతా ఘుమఘుమలాడింది’
* యూట్యూబ్ థంబ్‌నెయిల్ – ‘ఆవు పాడెలో ఇన్ని విషయాలా?’
అదే.. ‘ఆవు పేడలో’
* పుస్తకంలో అచ్చుతప్పు – ‘దానమ్మ తోటలోకి వెళ్లి రావాలి’
సవరణ – ‘దానిమ్మ తోటలోకి వెళ్లి రావాలి’
* అనగనగా ఓ పుస్తకంలో – ‘నీయవ్వ నా వీణ వినిపిస్తే ఆని దమ్మే’
బాబోయ్..’నీ యవ్వనవీణ వినిపిస్తే ఆనందమే’
* * *
పీఎస్: తెలుగులో ఒక్క అక్షరం మారితే ఇన్ని బూతులు, ఇబ్బందులు.. ‘కుంతలం జలపాతం’, ‘చల్లగాలేస్తుంది’ డైలాగ్ తెలుసు కదా! దానికి ఇది కొనసాగింపు. తెలుగుతో గేమ్స్ వద్దు.. శాల్తీలు లేచిపోతాయ్! – విశీ (వి.సాయివంశీ)
Share this Article