.
గుట్టపై ఓ గుడి ఉంటుంది… అక్కడి దాకా మెట్లు… ఒకావిడ వేగంగా ప్రతి మెట్టుకూ పసుపు రాసి, బొట్టు పెడుతూ పోతుంది వేగంగా… అసలే అంతంతమాత్రం ఆరోగ్యంతో, బయట నడిస్తేనే ఆయాసపడే ఆమె ఆ ఫీట్ ఎలా సాధించింది..?
.
Ads
సలేశ్వరం జాతర అంటేనే… రాళ్లురప్పల మీద ట్రెక్కింగ్… ఆరోగ్యవంతులకే ఆయాసం, కష్టం… కానీ ముసలోళ్లు, పోలియో వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు సైతం అలవోకగా వేగంగా వెళ్తుంటారు… ఎలా సాధ్యం..? ఆస్త్మా, శ్వాసకోశ సమస్యలున్నవాళ్లు కూడా అమరనాథ్ యాత్రను సులభంగా పూర్తిచేసి వస్తుంటారు… ఎలా..?
భక్తి, నమ్మకం ఆ తాత్కాలిక బలాన్ని ఇస్తాయి… అందుకే కొన్ని లాజిక్కులకు అందవు… హర్షిత అనే అమ్మాయి వార్త చదవగానే గుర్తొచ్చాయి ఆ ఉదాహరణలు… ఎవరు ఆ అమ్మాయి..?
కర్ణాటకలోని హోస్పేటకు చెందిన యువ భరతనాట్య కళాకారిణి ఆర్. హర్షిత,.. ఆమె చిన్ననాటి నుంచే ఆంజనేయుని భక్తురాలు… ఆంజనేయుడికి ప్రీతిపాత్రమైన హనుమ మాల ధారణ సమయంలో, “ప్రతి అడుగులో నా భక్తిని నాట్య రూపంలో సమర్పిస్తాను” అని ఆమె వ్యక్తిగతంగా మొక్కుకుంది…
ఈ మొక్కును నెరవేర్చడానికే ఆమె అంజనాద్రి కొండపైకి మొత్తం 574 మెట్లను, మధ్యలో ఎక్కడా ఆగకుండా, నిరంతరంగా భరతనాట్యం ముద్రలు, నృత్య కదలికలు చేస్తూ అధిరోహించింది… (హనుమాన్ మాల విసర్జన సందర్భంగా అక్కడికి లక్షల మంది భక్తులు వస్తారు, ఆంజనేయుడి జన్మస్థలిగా భక్తుల నమ్మకం)…
అది భక్తితో కూడిన మొక్కు… హర్షిత అంజనాద్రి కొండను భరతనాట్యం చేస్తూ ఎక్కడం కేవలం ఒక శారీరక సామర్థ్యం మాత్రమే కాదు, భక్తి, కళ మేళవించిన ఒక భిన్న అంకితభావం…
కళ, క్రమశిక్షణ, సమయం
అంజనాద్రి మెట్లు ఎత్తు ఎక్కువ ఉంటాయి… మామూలు మనుషులకే ఆ మెట్లు ఓ సవాల్… సాధారణ భక్తులు వాటిని ఎక్కడానికి సుమారు 20 నిమిషాలు తీసుకుంటారు… దానికే ఆయాసపడుతుంటారు… కానీ అలాంటి కఠినమైన మెట్లపై నాట్యం చేస్తూ, లయబద్ధంగా కేవలం 8 నిమిషాల 59 సెకన్లలో ఎక్కడం ఆమె అద్భుతమైన క్రమశిక్షణ, శారీరక ఫిట్‌నెస్, కళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది…

కొండ శిఖరం చేరుకున్న తర్వాత కూడా ఏమాత్రం అలసటను లేకుండా… ఆలయ ప్రాంగణంలో సంక్షిప్త భరతనాట్య ప్రదర్శన ఇచ్చి, ఆంజనేయ స్వామిని దర్శించుకుంది… హర్షిత భక్తి, అంకితభావం, కళాత్మకతను చూసి భక్తులు, ఆలయ అధికారులు ఆశ్చర్యపోయారు… ఆమె చేసిన ఈ అపూర్వ సేవను ఆలయ అధికారులు ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు… పూజలు, ఉపవాసాలు, నోములు, వ్రతాలతోనే కాదు… భక్తిని కళారూపంలో కూడా ఇలా ప్రదర్శించవచ్చు…
Share this Article