.
బీజాపూర్ సిద్ధేశ్వర ఉత్సవాల కోసం.. కర్నాటకలోని విజయపుర జిల్లా అధికార యంత్రాంగం.. జిల్లా కేంద్రం విజయపుర నుంచి బీజాపూర్ వరకు హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులతో సహా, ఆ హెలికాప్టర్ ఎక్కింది సమైరా హుల్లూర్.
హెలికాప్టర్ నడిపే పైలట్ ఆటిట్యూడ్, స్టైల్ ఆమెను ఆకట్టుకున్నాయి. ఇక ఆ పిల్ల ప్రశ్నల వర్షం కురిపించింది. అందుకు ఆ పైలట్ కూడా అంతే సావధానంగా తన పని తాను చేస్తూనే మరింత ముచ్చటగా సమాధానాలు చెబుతున్నాడు.
Ads
ఆ సీన్ మనసులో నాటుకున్న తాను.. జీవితంలో ఐతే గియితే పైలటే కావాలని నిశ్చయించుకుంది. కట్ చేస్తే ఇప్పుడు 18 ఏళ్లకే కమర్షియల్ ఏవియేషన్ లైసెన్స్ పొందిన దేశంలోని మొట్టమొదటి పైలట్.. సమైరా హుల్లూర్!
25 ఏళ్లకే కమర్షియల్ లైసెన్స్ పొందిన కుమార్ అనే పైలట్ తనకు రోల్ మాడల్ అని చెప్పే సమైరా.. ఆరు కఠినమైన పరీక్షలు పాసైంది. ఒక ఏడాదిన్నర కాలంలో 200 గంటలు రేయింబగళ్లు విమానం నడిపి ఏవియేషన్ ట్రైనర్స్ నే ఆశ్చర్యపరిచింది.
విజయపురకు చెందిన సమైరా హుల్లూర్ తండ్రి అమీన్ హుల్లూర్ ఓ ఇంటీరియర్ డిజైనర్. తల్లి టీచర్… ఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో తొలుత శిక్షణ తీసుకున్న సమైరా.. ఆ తర్వాత మహారాష్ట్ర బారామతిలోని కార్వర్ ఏవియేషన్ అకాడమీలో ట్రైనప్ అయింది.
18 ఏళ్లు నిండేకంటే ముందే.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్వహించే ఆరు పరీక్షలకుగాను.. ఐదింటిలో ఉత్తీర్ణురాలైంది. ఒక్క ఎగ్జామ్ మాత్రం ఆమె వయసు సరిపోక నిర్వహించలేకపోయారు..
జస్ట్, అలా 18 టర్న్ అయ్యాయో, లేదో.. రేడియో ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ఎగ్జామ్ కు కూడా అర్హత సాధించింది, ఉత్తీర్ణురాలైంది. ఆ పరీక్ష పాసవ్వడమంటే మాటలు కాదు.. కానీ, సమైరా సంకల్పం.. పైలట్ కావాలన్న దీక్ష ఆమెను ఆకాశాన నిలబెట్టింది… — రమణ కొంటికర్ల
Share this Article