———————
గురువులేని విద్య గుడ్డి విద్య. ఎంతగా తెలివితేటలతో పుట్టినా గురుముఖతః నేర్చుకుంటేనే విద్యకు విలువ. కొన్ని థియరీ, కొన్ని ప్రాక్టికల్స్ పరీక్షలు పాస్ అయితేనే డాక్టరుకయినా కత్తి పెట్టి మనల్ను కోసే అధికారం దక్కుతుంది. డాక్టరు పొడిస్తే వైద్యం; మనం పొడిస్తే హత్యాయత్నం అవుతుంది. అయితే ఇదంతా పాత విద్యావిధానం. ఎప్పుడో నలంద, తక్షశిలనాటి మాడల్.
ఇప్పుడంతా ఆన్ లైన్. టెక్స్ట్, ఆడియో, వీడియో, సందేహాల నివృత్తి, ప్రాక్టికల్స్… సకలం ఆన్ లైన్లోనే. గూగుల్ చెప్పని విషయం ఉండడానికి వీల్లేదు. యూ ట్యూబ్ లో దొరకనిది లేదు. కొంచెం చురుకుతనం, కొంచెం గాడ్జెట్స్ మీద సాంకేతిక అవగాహన ఉంటే చాలు. దొంగ నోట్లు ముద్రించడం ఎలా? అణుబాంబులు తయారు చేయడం ఎలా? విమానాన్ని హైజాక్ చేయడం ఎలా? లాంటి లోకోత్తర విషయాలమీద ప్రపంచ భాషలన్నిట్లో యూ ట్యూబ్ పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
Ads
గుంటూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ తో చదువు ఆపేసిన ఇద్దరు నవయువకులు- బ్యాంకును కొల్లగొట్టడం ఎలా? కొల్లగొట్టి తప్పించుకోవడం ఎలా? అని యూ ట్యూబ్ ను అడిగారు. యూ ట్యూబ్ అనేక వీడియోలతో వారికి అర్థమయ్యేలా చెప్పింది. నేర్చుకున్న చోరవిద్యను ప్రాక్టికల్ గా ఒక శుభ ముహూర్తాన పరీక్షించుకున్నారు. ఒక బ్యాంకుకు కన్నం వేసి దగ్గర దగ్గర 80 లక్షలు దోచుకున్నారు. వాళ్లే అన్ని యూ ట్యూబ్ చోరపాఠాలు చూసి ఉంటే- పోలీసులు ఇంకెన్ని చోర నేర ఛేదన పాఠాలు చూసి ఉంటారు?
సార్!
యూ ట్యూబ్ లో చూసి నా గుండె ఓపెన్ చేశాను. మళ్లీ అతికించడానికి కుట్లు సూదితో వేయాలా? దబ్బనంతో వేయాలా? అని ఒక యూ ట్యూబ్ వైద్య విద్యార్థి అసలు డాక్టర్ కు ఫోన్ చేస్తే- ఆ అసలు డాక్టర్ గుండె నిజంగానే ఓపెన్ అయి ఏడ్చిందని- ఒక డిజిటల్ జోక్.
ఆన్ లైన్ విద్యతో అద్భుతాలు సృష్టిస్తామని బైజూస్ లాంటి డిజిటల్ వేదికలు చెబుతుంటే- ఆన్ లైన్లో దొరికే- హత్య చేసి తప్పించుకోవడం ఎలా? బ్యాంకు రాబరీకి సులభమయిన చిట్కాలు! లాంటి వీడియోలను చూసి ఆచరణలో పెడుతున్న ఆన్ లైన్ నేర విద్యార్థులూ ఉన్నారు!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article