.
ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా యూట్యూబ్ వీడియోలు… జనంలో కూడా వీడియోలు చూడటంపైనే ఆసక్తి… దాంతో వీడియో క్రియేషన్ ఓ పెద్ద దందాలా మారింది… మరీ తెలుగులో ఒకటీరెండు కంపెనీలు చెత్త చెత్త థంబ్ నెయిళ్లు, సొసైటీకి నష్టం చేకూర్చే తిక్క వీడియోలతో చెలరేగిపోతున్నాయి…
వీటికి ప్రభుత్వపరమైన నియంత్రణ లేదు… జనం మెదళ్లలో యూట్యూబ్ వీడియోలు ఎక్కిస్తున్న అజ్జానం, విషం అంతా ఇంతా కాదు… పైగా యూట్యూబ్ రెవిన్యూ ఎక్కువగా వస్తుండేసరికి ఎక్కడాలేని అపసవ్య విధానాలతో యూట్యూబునే బురిడీ కొట్టిస్తూ కొందరు దండుకుంటున్నారు…
Ads
- అంటే ఒకే వీడియోను కాస్త అటూఇటూ మార్చి, పలు చానెళ్లలో అప్‌లోడ్ చేయడం, దిక్కుమాలిన కంటెంటుతో వీడియోలు వదలడం… కాపీ కంటెంటుతో, కాస్త వాయిస్ ఓవర్ మార్చేసి డబ్బు కొట్టేసేవాళ్లకూ కొదువ లేదు… ఎట్టకేలకు ఈ నాసిరకం కంటెంట్ క్రియేషన్‌పై యూట్యూబ్ కళ్లు తెరుచుకున్నట్టున్నాయి…
ఈనెల 15 నుంచి కొత్త రూల్స్ అమలు చేయబోతోంది… కాపీ కంటెంటు, నాసిరకం కంటెంటును గుర్తించే పనిలో పడుతోంది… ఆ కంటెంటుకు మానిటైజేషన్ (డబ్బు) ఉండదు… సీరియస్ వయోలేషన్స్ గుర్తిస్తే మొత్తం ఖాతానే రద్దు చేస్తుందట… కానీ ఏది ఒరిజినలో, ఏది కాపీయో గుర్తించేందుకు అది ఏ టెక్నాలజీ వాడుతుందో ఆసక్తికరం…
ఎందుకంటే… ఎఐ టెక్నాలజీ సాయంతో అలా నిర్ధారణగా కాపీ కంటెంటును గుర్తించడం కష్టం… చివరకు ఇదీ ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ వంటి భ్రమపదార్థమే అవుతుందేమో… యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాం (వైపీపీ) లో భాగంగా చెత్తా, కాపీ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్, క్లిక్ బైట్ ఇకపై అస్సలు సహించేది లేదని చెబుతోంది యూట్యూబ్… నిజానికి అది అత్యవసరమే…
- ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లే బాగుపడేలా యూట్యూబ్ మానిటైజేషన్ పద్ధతులు ఉండాలి… ఇన్నాళ్లూ అది లేదు… కాపీ కంటెంటు, ఎడిటెడ్ రీయూజ్డ్ అని సరిగ్గా నిర్ధారిస్తే రూపాయి కూడా ఆ కంటెంటుకు చెల్లించకుండా కఠినమైన, శాస్త్రీయమైన వడబోత విధానం అవసరం…
ఇవేకాదు, ఇకపై కొత్త యూట్యూబ్ చానెళ్లకూ మానిటైజేషన్ కష్టమే… కనీసం 1000 మంది సబ్‌స్క్రయిబర్లు, ఏడాదిలో 4000 వాచ్ అవర్లు… (వీక్షణ గంటలు – Watch Hours) ఉండాలట… షార్ట్స్ అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలట… సచ్చింది గొర్రె..!! సో, యూట్యూబ్ వీడియోల దందాలో కూడా ఇకపై బిగ్ ప్లేయర్లదే హవా కాబోతున్నదన్నమాట..!!
అవునూ, ఇవన్నీ సరేగానీ... కాపీ కంటెంటు వడబోస్తారు సరే, కానీ కంటెంటు ప్రమాణాల్ని ఎలా లెక్కిస్తారో..!!
Share this Article