.
‘‘సాక్షి బురద రాతలు- రోత రాతలు- నీచపు రాతలు- తప్పుడు కూతలు’’ ….. వైఎస్ షర్మిల ఈ విమర్శ చేసింది జగన్మోహన్‌రెడ్డి మీద..! ఇంకా ఘాటుగా ఏమేం అంటున్నదో ముందుగా చదవండి…
‘‘తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? – ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? – ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? – సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ?
Ads
మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? ఇది YCP అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే… సాక్షి తీరు ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి…’’

…… షర్మిల జగన్‌ను తిట్టిపోయడం, నిలదీయడం కొత్తేమీ కాదు… చాలా అంశాల్లో వారి వైరం కనిపిస్తున్నదే… ఏవో ఆస్తుల పంచాయితీలు వేరు, రాజకీయాలు వేరు… వాటిని కలిపేశారు జగన్, షర్మిల… నిజానికి షర్మిల రాజకీయ పంథా ఏమిటో ఆమెకే తెలియదు… ఆమెను ఏకంగా పీసీసీ అధ్యక్షురాలిగా చేసి, తనను తాను ఏం ఉద్దరించదలుచుకున్నదో కాంగ్రెస్ పార్టీకే తెలియదు…
సరే, అది ఆ పార్టీ విషయం… ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం కాబట్టి దాన్ని కాసేపు అలా ఉంచితే… ఈ వార్త విషయంలో మాత్రం ఆమె ఆవేదనలో కొంత అర్థముంది… కాకపోతే ఇక్కడ రెండు కోణాలున్నాయి…
1. సాక్షి రాసిన వార్త చాలా నాసిరకం, చిల్లర రాతే… ఆమె బిడ్డ పెళ్లి కార్డులను పార్టీలకు అతీతంగా నాయకులకు ఇస్తోంది, ఆహ్వానిస్తోంది… తప్పేముంది..? ఆమె ఏపీ రాజకీయాల్లో ఉంది, ఏపీ ముఖ్యమంత్రిని కలిసి పెళ్లికి రమ్మని ఆహ్వానించింది, అందులో దురుద్దేశాలను వెతికి, దానికి రాజకీయం పులిమి… ‘బాబుతో చెట్టపట్టాల్’ అనే శీర్షికతో ఓ పేద్ద వార్త రాయడం దివాలాకోరుతనమే…
పైగా నెటిజన్లు విమర్శిస్తున్నారు అనే కవరింగు దేనికి..? రాసేదేమిటో తనే రాయొచ్చుగా ఏ నాలుగో పేజీలోనో… (అవునూ, సంపాదకీయం పేజీని పూర్తిగా ఎత్తేశారా, అప్పుడప్పుడైనా ప్రచురిస్తున్నారా..? అందులోనే ఈ విమర్శ రాసుకోవచ్చు కదా…) పైగా రాసీ రాయనట్టుగా ఎక్కడో ఓ సింగిల్ కాలమ్ దేనికి..? దాంతో ఏం చెప్పదలుచుకుంది సాక్షి..? మరీ షర్మిల తిడుతున్నట్టు పరుష వ్యాఖ్యలు అవసరం లేదు గానీ ఇది మరీ చిల్లర వార్తే…
2. తండ్రి వయసున్న వ్యక్తికి కార్డు ఇస్తే చెట్టపట్టాల్ అంటారా? సంబంధాలు అంటగడతారా? అని షర్మిల ఆరోపించడం కూడా ఓవర్ రియాక్షన్… ఆ వార్తలో అలాంటి కూతలు ఏమీ లేవు… వైరిగా పరిగణించాల్సిన చంద్రబాబును పెళ్లికి ఆహ్వానించడం మీద ఓ కుళ్లుతనం కనిపిస్తోంది తప్ప మరీ వావివరుసలు తప్పి రాసినంత నైచ్యం ఆ వార్తలో ఏమీ లేదు, అనవసరంగా షర్మిల ఎక్కువ దూరం వెళ్లి అర్థం చేసుకుంటోంది…
3. చంద్రబాబుతో ఆమె సరిగ్గా పోరాడుతున్నదా లేదా… చంద్రబాబుతో తరచూ భేటీలు వేస్తున్నదా..? ఇవి ఎఐసీసీ చూసుకుంటుంది కదా… ఆమె ఎవరితో ఎలా పోరాడాలో కూడా సాక్షే నిర్దేశించాలా..? సో, సాక్షి రాతలు మరీ నేలబారు, దానిపై ఆమె స్పందన ఓవర్ రియాక్షన్…!! ఆ ఆస్తుల గొడవేమిటో తేలిపోతే అసలు ఆమె పాలిటిక్సులోనే ఉండకపోవచ్చు… సాక్షికి ఈ రాతల తలనొప్పులూ, ప్రయాసలూ ఉండకపోవచ్చు..!!
4. సాక్షికి సాక్షాత్తూ ఓ వైసీపీ అధికార ప్రతినిధినే సీఈవోగా నియమించారు ఈమధ్య… మరింత రాజకీయ రంగు దట్టంగా పులిమారు… ఇంకా ఇలాంటి రాతలు ఏమేం చదవాల్సి వస్తుందో ఏపీజనం..!!
Share this Article