బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కొన్నాళ్లుగా నలుగుతున్న చర్చ… కలవడం గ్యారంటీ అంటాడు రేవంతుడు… ఠాట్, మాకేం ఖర్మ, నువ్వే బీజేపీలో కలుస్తావు, మేం చూడకపోం అంటాడు కేటీయార్… బీఆర్ఎస్‌ను మేమెందుకు రానిస్తాం అంటాడు బండి సంజయుడు… అవునవును, చర్చలైతే నిజమే సుమీ అంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు…
అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో… బీజేపీ ఏం అడిగిందో, బీఆర్ఎస్ ఎంతకు సిద్ధపడిందో… నాకు తెలిసి తెలంగాణ బీజేపీ ముఖ్యనాయకులకు కూడా సమాచారం ఉండి ఉండదు… రాష్ట్ర నాయకుల సలహాలు సంప్రదింపులతో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోదు… కొన్నాళ్లు ఈ చర్చ, ఈ మైండ్ గేమ్, ఇవేవో ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి… కేసీయార్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు కాబట్టి ఈ వార్తలు కొంతైనా నమ్మశక్యంగా అనిపిస్తాయి…
కానీ జగన్ తన పార్టీని బీజేపీలో ఎందుకు విలీనం చేస్తాడు..? ఇది మరో ప్రశ్న… నిజానికి నిన్నామొన్నటిదాకా అసలు ఎవరి ఊహకూ అందలేదు ఇది… కానీ ఏపీ బీజేపీ ముఖ్య నాయకుడు విష్ణుకుమారరాజు ఈ చర్చకు తెరతీశాడు… నో, నో, బీజేపీలో వైసీపీ విలీనాన్ని అంగీకరించేది లేదు, వ్యతిరేకిస్తాం అని ఓ ప్రకటన జారీ చేశాడు… హఠాత్తుగా ఈ చర్చ ఎందుకు తెర మీదకు తీసుకొచ్చినట్టు..?
Ads
తను కూడా కేసీయార్‌లాగే తీవ్ర ఒత్తిడిలో ఉన్నమాట నిజం… చంద్రబాబు ప్రభుత్వం గతంలోలాగా కాదు, జగన్‌ను ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నిస్తుంది… జగన్ మొన్నటిదాకా తమను ఎన్నిరకాల అవస్థలకు గురిచేశాడో వాళ్లెందుకు మరిచిపోతారు..? అసలు టీడీపీ పార్టీయే లేకుండా చేయడానికి ప్రయత్నించాడు కదా… మరి ఎంతోకొంత రక్షణ కావాలి ఎలా..?
బీజేపీయేమో చంద్రబాబు కూటమిలో ఉంది… బీజేపీ కేంద్ర అధికారం కూడా చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది… చంద్రబాబు ఊరికే నవీన్ పట్నాయక్‌లాగా ఊరుకునే రకమేమీ కాదు… అప్పుడప్పుడూ మోడీని గోకే ప్రయత్నం చేస్తాడు… ఈ స్థితిలో జగన్ ఏం చేయాలి..? కాంగ్రెస్ పార్టీలోకి అస్సలు వెళ్లే సీన్ లేదు… పైగా అందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, ప్రస్తుతం తన ప్రత్యర్థిగా మారిన తన సొంత సోదరి షర్మిల… పైగా అదే కాంగ్రెస్ జగన్‌ను నానా అవస్థలపాలు చేసిందాయె…
మరి బీజేపీలోకి వెళ్తాడా..? నెవ్వర్… అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అలా ఆలోచించలేదు, అధికారంలో ఉన్నప్పుడు అవసరమే రాలేదు… కనీసం పొత్తుకు, అవగాహనకు కూడా తను సిద్ధపడలేదు ఎప్పుడూ… అలా చేస్తే తన వెంట ఉన్న మైనారిటీలు దూరమవుతారని, రాజకీయంగా దెబ్బతింటానని తన భయసందేహమేమో… ఇప్పుడు అసలే వెళ్లలేడు… బీజేపీ చంద్రబాబు కూటమిలో ఉంది… ఒకవేళ బీజేపీలో విలీనం చేయాలని జగన్ పొరపాటున అనుకున్నా సరే, చంద్రబాబు రానిస్తాడా..? చంద్రబాబు – పవన్ కల్యాణ్ కూటమిలోకి జగన్ వెళ్తాడా..? ఊహించగలమా..?
మరి విష్ణుకుమారరాజుకు ఉన్న సమాచారం ఏమిటో తెలియదు… హఠాత్తుగా ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడో తెలియదు… జగన్‌కు ఇంకా చాలా సుదీర్ఘమైన కెరీర్ ఉంది పొలిటికల్‌గా… సాధనసంపత్తి ఉంది… పార్టీ కేడర్ ఉంది, వోట్లున్నాయి… మొన్నటి ఫలితం తాత్కాలిక సెట్ బ్యాక్… అలాంటివి అన్ని పార్టీలకూ వస్తాయి, రాజకీయాల్లో సహజం… పోనీ, రక్షణ కోసం బీజేపీలో నిమజ్జనం చేస్తాడు అనుకుంటే, తన దోస్త్ చంద్రబాబును కాదని జగన్‌ను విలీనం చేసుకుంటుందా బీజేపీ..? పోనీ, ఇప్పటికిప్పుడు జగన్ పార్టీని విలీనం చేసుకుంటే ఏపీలో బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమిటి..?
Share this Article