.
శాసనమండలి కొనసాగింపు వంటి పలు విషయాల్లోలాగే జగన్ పార్టీ మరో బిగ్ యూటర్న్ తీసుకుందా..? మొన్నటి 11 సీట్ల అత్యంత దారుణ వోటమి తీవ్రమైన విధాన గందరగోళంలోకి నెట్టేస్తోందా..? ఇది ఆత్మమథనమా..? లెంపలేసుకుని సవరించుకునే పాత రాజకీయ విధానమా..? సమయానుకూల పరివర్తనా..? లేక ఎటు వెళ్లాలో తెలియని గందరగోళమా..?
ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోనివాడు పొలిటిషియన్ ఎలా అవుతాడు..? అచ్చం మన చంద్రబాబులాగే… గంటకో పాలసీ మాట్లాడగలిగేవాడే పొలిటిషియన్… మరీ ఈరోజుల్లో… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా… దాన్నే జగన్ కూడా అందిపుచ్చుకున్నాడా..?
Ads
లేకపోతే మరేమిటి…? అప్పట్లో అమరావతికి జై అన్నాడు తను కూడా… అక్కడెక్కడో రాజధాని బెటర్ అని అదేదో కమిటీ సిఫారసు చేసినా సరే… చంద్రబాబుకు అస్మదీయుల అడ్డా అమరావతియే బెటర్ అనిపించింది… జగన్ కూడా ఎస్ అన్నాడు…
నేను హైదరాబాద్ కట్టాను, సైబరాబాద్ కట్టాను, ఇంకేదో కట్టాను అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో మాహిష్మతి మార్క్ గ్రాఫిక్స్ తప్ప రాజధాని నిర్మాణం చేతకాలేదు… కాదు కూడా… ఈరోజుకూ… పాక్షిక రాజధానిని మూడేళ్లలో కంప్లీట్ చేసి, మోడీని రప్పిస్తాడట మళ్లీ… అదో బాగోతం… దాన్నే బాబోతం అంటారు… సీన్ కట్ చేస్తే…
జగన్ మరో భారీ యూటర్న్ అట… ఈ ఆంధ్రజ్యోతి వార్త చూడండి…
జగన్ మరో నాటకం… పాత రోజుల్లో చెప్పినట్టే అమరావతిపై బూటకం, జగన్నాటకం, కొత్త పాట మొదలుపెట్టాడు, బహుపరాక్, అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరొకలా… గంటకోపాట పాడుతున్నాడు జాగ్రత్త, నమ్మేస్తే మళ్లీ మనకు అధోగతే అని ఫస్ట్ పేజీలో కుమ్మేసింది ఆ పత్రిక…
సరే, ఆ పత్రికది తెలుగుదేశం పొలిటికల్ లైన్… ఆ రాతలు అలాగే ఉంటాయి… కానీ ఈ వార్త ఏమిటి, ఎందుకు అంటే..? ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, జెడ్పీటీసీ, సర్పంచ్… ఎక్కడా ఎప్పుడూ ఏదీ లేని వైసీపీ నంబర్ టూ అని పిలవబడే సజ్జల రామకృష్ణారెడ్డి వేటున్యూస్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ… అధికారం మళ్లీ వచ్చాక ఇక జగన్ వైజాగ్ వెళ్లడు, అమరావతి నుంచే పాలిస్తాడు అని చెప్పుకొచ్చాడు…
మరి రుషికొండను తొలిచి ఆ ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నట్టు..? మూడు రాజధానుల పేరిట, అమరావతి గొంతు పిసికేసే కుట్ర ఎందుకు చేసినట్టు..? అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరొకలా పాలసీలు ఉంటాయా..? నీ మూడు రాజధానుల ముచ్చట మాకొద్దు పోవోయ్ అని మొన్నటి ఎన్నికల్లో జనం తీర్పు చెప్పారనే వైసీసీ నిర్ధారణా..?
ఏపీలో రాజకీయాల్ని, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించడంలో ఏ పార్టీ కూడా తక్కువ కాదు… ఎవరికివారే పోటీ… పాలసీల యూటర్నుల్లో కూడా… ప్రత్యేక హోదా నుంచి రాజధాని విషయం దాకా అన్నీ అంతే… పది భవనాలు కట్టినంతమాత్రాన రాజధాని సమకూరదు, వేలాది ఎకరాలు సమీకరించి, రాజధానిని ఓ పేద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా చూసినా కుదరదు… సరే, ఆ చర్చ వేరు…
కానీ సజ్జల చెబుతున్న యూటర్న్ ఒకలా ఉంటే… ఇప్పటికీ జగన్ ఏమంటున్నాడు..? వేల ఎకరాలు, లక్షల కోట్లకన్నా విజయవాడ, గుంటూరు నడుమ పాలన భవనాలు కట్టేస్తే సరి, ట్రైసిటీస్ చాలు రాజధానిగా డెవలప్ కావడానికి… సో, పార్టీ దృక్కోణంలోనే గందరగోళం, అస్పష్టత కనిపిస్తోంది… పీచే ముఢ్ విధానాలు సరే, కానీ ఎందుకో సరైన కారణాలు చెప్పుకునే విజ్ఞత, సమర్థత కూడా లోపిస్తున్నాయా..?
పోనీ, పాలసీ మార్చుకున్నదే నిజమైతే… స్ట్రెయిటుగా ఇక మూడు రాజధానుల ముచ్చట లేదు, అమరావతే ఏపీ రాజధాని అని జగనే విధాన ప్రకటన చేయొచ్చుగా… అదీ లేదు…
(నిన్న సజ్జల కామెంట్లపై సాక్షి రాసుకున్న వార్త కూడా అటూఇటూ గాకుండా ఉంది… ఆ పార్టీ పాలసీలాగే)… జగన్ గత కార్యాచరణలు, ఆలోచనలను బట్టి చూస్తే… ఇప్పుడు జగన్ మళ్లీ కుర్చీ ఎక్కితే వైజాగ్ ప్యాలెస్ ఎవరికి ఇవ్వబడినా సరే, మళ్లీ సీఎం క్యాంప్ ఆఫీసు చేస్తాడు… అమరావతిని తిరిగి పడుకోబెడతాడు..!!
Share this Article