Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వహ్ తాజ్ అనాలని ఆ ఉస్తాద్ ఎందుకన్నాడు..! వహ్ యాసీన్..!!

December 18, 2024 by M S R

.

 ( యాసీన్ ఫేస్‌బుక్ వాల్ నుంచి స్వీకరణ ) ….  వహ్‌_ఉస్తాద్‌_అని_పిల్లాడంటే… వహ్‌_తాజ్‌_అనమని_ఉస్తాద్‌_ఎందుకన్నాడు?

ఇద్దరూ పోటాపోటీగా తబలా వాయిస్తూ ఉంటారు. అద్భుత వాద్యసంవాదం చివర్న చిన్నపిల్లాడు ‘వహ్‌ ఉస్తాద్‌’ అనగానే… ‘వహ్‌ తాజ్‌’ అనమంటూ ఉస్తాద్‌గారు సరిదిద్దే యాడ్‌ అది.

Ads

‘చాయ్‌’ కప్పును కాస్త పక్కకు పెట్టేయండి…
‘వహ్‌ ఉస్తాద్‌’ అని పిల్లాడంటే ‘వహ్‌ తాజ్‌’ అనమని జాకిర్‌ హుసేన్‌ ఎందుకన్నాడంటారూ?
* * * * *

అవి అమాయకమైన మా చిన్నప్పటి రోజులు.
దూరదర్శన్‌ అనే ఒకే ఒక ఛానెల్‌ మాత్రమే ఉండే అపురూప రోజులు.

అందులో మాత్రమే కని(విని)పించే ‘హమార బజాజ్‌’ ఆలాపాల్లోని లయాత్మకతా; ‘అవి కట్టాం… ఇవి నిర్మించా’మంటూ దేశ పునర్నిర్మాణాపు కట్టడాల గొప్పలన్నీ చెప్పి… చివర్న ‘మేం స్టీల్‌ కూడా తయారు చేస్తాం’ అనే టాటా వాళ్ల హంబుల్‌ యాడ్‌తో పాటు అందరి మనసుకూ హత్తుకుపోయిన యాడ్‌ మరోటుంది.
అదే ఉస్తాద్‌ జాకీర్‌ హుసేన్‌ గారూ, ఆ చిన్నపిల్లాడూ తబలా ప్లే చేసేది.

అందులో… ‘వహ్‌ ఉస్తాద్‌’ అని పిల్లాడు ప్రశంసిస్తుంటే… ‘వహ్‌ తాజ్‌’ అనమని జాకీర్‌ హుసేన్‌ ఎందుకన్నాడంటారూ?
* * * * *

‘నలుగురు కలిసే మందు పార్టీలూ, ప్రైవేటు మీటింగుల్లో…
ఇద్దరికి మూడేసి, పలువురు కలుస్తుండే షాదీ ఫంక్షన్లలో…
ఎవరికి వారు మద్యం తాగుతూ వాళ్ల లోకంలో తూగుతుంటే
పక్క నుంచి గాల్లోకి సంగీతం వృథాగా కలిసిపోతుండే
సమావేశాల్లో నేనెప్పటికీ తబలా వాయించను’ అన్నాడాయన.

‘మరి… ఎక్కడ ప్లే చేస్తానూ?
కేవలం సంగీతాన్ని ఆస్వాదించేందుకే అందరూ ఆసీనులైన చోట
కేవలం సంగీత సాధనలూ, జుగల్బందీలూ, వాద్యవిన్యాసాలూ
వంటివి ప్రదర్శిస్తూ… వాటిని ఎంజాయ్‌ చేసేవారున్న చోటే నేను తబలా ప్లే చేస్తా’…
అంటారు ఉస్తాద్‌ జాకిర్‌ హుసేన్‌.

మరి మనకా సంగీతపు లోతుపాతులేమీ తెలీనే తెలియవు.
మ్యూజిక్‌ మార్మిక లోకాల మర్మాలేమీ అంతుపట్టనే బట్టవు.
తెలిసిన సంగీత స్రష్టలకు అన్ని లోతులూ ఎలాగూ తెలుస్తాయి. కానీ.. సంగీతపు ఓనమాలు తెలియని నాలాంటివాళ్ల కోసం అప్పట్లో ఆయనేదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టు గుర్తు.

అందులో నాలాంటి పామరుల కోసం ఇంటికప్పు మీద కురిసే చినుకుల చిటపట… చూరు నుంచి జోరున జారే వర్షపు చటచట… చివరి వానబొట్టు తటాల్న నేల మీద పడేటప్పటి తటతటలను తబలా మీద ప్లే చేసి చూపినట్టు గుర్తు.

లీలగా గుర్తుండి బాగా మాసిపోయిన ఆ జ్ఞాపకంతో పాటూ… ఇంకా తెలిసిందల్లా
ఆ వేలి చివర్ల చటచటా చకచకా కదలికల చప్పుళ్లు.
ఉస్తాద్‌ జుత్తు చివర్ల మెలికల తాలూకు నుదుటి మీది కదలికలు.
మరి తబలా మీద ఆ చప్పుళ్లూ,
జుత్తు కదలికల వేగాల్ని వదిలేసి…
జస్ట్‌ ‘వహ్‌ తాజ్‌’ అంటూ మాత్రమే పలకాలని
ఉస్తాద్‌ జాకీర్‌ హుసేన్‌ ఎందుకన్నాడంటారూ?

* * * * *
బహుశా ఎందుకంటే…
తాజ్‌లోని పై గుంబజ్‌ను తిరగేస్తే వచ్చిన ఆకృతితో
తబలా తాలూకు ఎడమ చేతి వైపు వాద్యాన్ని రూపొందించారనిపించినందుకూ…
మినారెట్‌లోని ఓ ముక్క మట్టుకు తుంచుకుని కుడి చేతి వాద్యాన్ని తయారుచేశారేమో అనిపించినందుకూ…
అమీర్‌ ఖుస్రూ రూపొందించిన ఆ వాద్యంలోని బాయా, దాయాలలో…
తాజ్‌ గుంబజ్‌లూ, మినారెట్లే మిరిమిట్లు గొలుపుతూ కనిపించినందుకూ…
బహుశా అందుకేనేమో!?

సంపన్న సంతృప్త సంగీతానికి వదిలేసి,
కేవలం జుట్టు కదలికల్నే ఆస్వాదించలిగేంతటి
అప్పటి నా చిన్ననాటి కొద్ది బుద్ధికి,
ఇప్పటికీ అలరించి కలవరించే ఆనాటి
అప్పటి అపురూప జ్ఞాపకాలున్న ఈ చిన్న బుద్ధికీ
ఇంతకంటే గొప్పగా ఏం తోస్తుందీ…
ఇంతకు మించి ఏం స్ఫురిస్తుంది?

చిన్ననాటి ఆ వయసప్పట్నుంచీ…
ఆ యాడ్‌ను ఎప్పుడు చూసినా వినిపించే ఆ సంగీతం కంటే
కనిపించే ఆ జుట్టు కదలికలతోనే నన్నెప్పుడూ ఆకర్షించీ అలరించీ…
నాలో అనేకానేక అపురూప బాల్యజ్ఞాపకాల్ని నింపిన జాకీర్‌ హుసేన్‌కు…

మొన్న 15–12–2024న వీడిపోయిన వేళ…
ఆయన వద్దువద్దన్న కొద్దీ మనసులో వేనవేల సార్లు
‘వహ్‌ ఉస్తాద్‌’… ‘వహ్‌ ఉస్తాద్‌’ అంటూ అనుకుంటూ…
ఆ తబలా ఉస్తాద్‌కు
ఈ వినమ్ర నివాళి…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions