.
జీబ్రా… సత్యదేవ్ నటించిన సినిమా… దీంట్లో సునీల్ పాత్ర ఉంది… ఎలాంటివాడు ఇలా అయిపోయాడేమిటి అనిపిస్తుంది… కనీసం ఓ రేంజ్ వరకూ ఎదిగి, మళ్లీ కిందకు దిగి, డిఫరెంట్ కేరక్టర్లు వేసుకుంటున్న తను ఈ పాత్రకు, ఈ డైలాగులకు ఎలా అంగీకరించాడు..?
తన టైమింగ్‌ను మెచ్చుకునే ప్రేక్షకులు బోలెడు మంది… కానీ ఈ సినిమాలో తనకు పెట్టిన బూతు డైలాగులు పదే పదే బీప్‌లు వేస్తున్నా సరే… ప్రేక్షకులు ఏవగించుకునేట్టుగానే ఉన్నాయి… ఇలాంటి నాలుగు పాత్రలు వేస్తే సరి… సునీల్‌ను మరిచిపోవాల్సిందే…
Ads
ఇదేనా..? షీలా పేరుతో కనిపించే ఓ పాత్రకు (జెన్నిఫర్..?) కూడా ఇంగ్లిషు యాసలో తెలుగు డైలాగులు పెట్టారు… అవీ వెగటుగానే ధ్వనిస్తుంటాయి… ఇదా కామెడీ..? పోనీ, పాటలు..? హోప్ లెస్…!
డైలాగ్ రచయిత ఎవరో గానీ మీకు దండాలు స్వామీ… ఈటీవీ జబర్దస్త్ కాదు స్వామీ సినిమాను రక్తికట్టించడం అంటే..? పోనీ, ఏదైనా కొత్త కథాంశం తీసుకున్నారా అంటే..? హీరో ఫ్రాడ్లు చేయడమే కథ… బ్యాంకును దోపిడీ చేయడమే కథ… లక్షసార్లు చూడబడిన కథ సినిమా తెరపై…
పోనీ, దాన్నయినా కొత్తతరహాలో ప్రజెంట్ చేశారా..? అదీ లేదు… తీసేవాడికి చూసేవాడు అలుసు అన్నట్టుగా కథ ఎటెటో తిరుగుతూ ఉంటుంది… ప్రేక్షకుడి మది గిర్రున తిరిగిపోయేట్టు… తెలుగు సినిమా కాబట్టి ప్రియా భవానీశంకర్‌ను పట్టుకొచ్చి పిడికెడంత లవ్వు కూడా కథకు యాడ్ చేశారు…
ఏదో వీళ్లు అడిగారు, డబ్బు తీసుకున్నాను, నటించాను, వెళ్లిపోయాను అన్నట్టుగా ఉంది ఆమె… ఇక్కడ హీరో గురించీ చెప్పాలి… మనకున్న దమ్మున్న నటుల్లో సత్యదేవ్ ఒకడు… ఎంత ఇంటెన్స్ ఉన్న పాత్రనైనా చేయగలడు… సినిమాను ఒంటి చేత్తో మోయగలడు… ఎటొచ్చీ కథలో దమ్ముండాలి… కథను భిన్నంగా చెప్పగల సత్తా దర్శకుడిలో ఉండాలి…
అది లేనప్పుడు సత్యదేవ్ అయినా ఏం చేయగలడు..? ఏదో ఓ సినిమా చాన్స్ వచ్చింది, చేశాను, బస్, ఖేల్ ఖతం అన్నట్టుగా అలవోకగా చేస్తూ వెళ్లాడు… ఎందుకో గానీ సత్యదేవ్‌కు మంచి సినిమాలు పడటం లేదు… తన అప్రోచ్, తన యాటిట్యూడ్ లోపమా..? గ్రహచారదోషమా తెలియదు గానీ… తన కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడని సినిమా ఇది… పైగా మైనస్ కూడా…
బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి… దానికి కాస్త ఎమోషన్ యాడ్ కావాలి… భిన్నమైన ప్రజెంటేషన్ శృతి కుదరాలి… లక్కీ భాస్కర్ కూడా బ్యాంకుల్ని వాడేసుకోవడం… సగటు ప్రేక్షకుడికి ఆ బ్యాంకింగ్, ఆ ఫ్రాడ్స్ సరిగ్గా అర్థం గాకపోయినా సరే, మిగతా కథను ఎంజాయ్ చేయగలిగాడు… హీరో కథ చెప్పి ఒక ఎమోషన్ బిల్డ్ చేయగలిగాడు దర్శకుడు అక్కడ…
కానీ ఈ జీబ్రా అందులో ఫెయిలైంది… బీజీఎం పూర్, పాటల గురించి చెప్పడానికేమీ లేదు… క్రీస్తుపూర్వం నాటి సినిమాల్లో ఉన్నట్టు ఐటమ్ సాంగ్… ప్చ్, అర్థమయ్యీ అవని జీబ్రా గీతలు… ఏవేవో అంకెలు… వెరసి ఈ బ్యాంకు దోపిడీల బాధితుడు ప్రేక్షకుడు..!
Share this Article