టీవీలు చూసేవాళ్లలో సీరియల్స్ ప్రేక్షకులు లిమిటెడ్ అండ్ కమిటెడ్… కానీ కామెడీ షోలు చూసేవాళ్లలో అన్ని వయస్సులవాళ్లూ ఉంటారు… ప్రజలకు ఇప్పుడు ఏకైక వినోదం టీవీయే కాబట్టి, అందులో వచ్చే కామెడీ షోలను జనం చూస్తూనే ఉంటారు… తిట్టుకుంటూనే చూడబడే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి… ఉదాహరణ జబర్దస్త్… దాని క్వాలిటీ ఘోరంగా పడిపోయినా సరే, జనానికి వేరే ఆల్టర్నేట్ లేదుగా… ఆ దిక్కుమాలిన జీతెలుగు వాడో, స్టార్ మావాడో పోటీ ఇస్తారనుకుంటే తుస్సుమనిపించారు… జీవాడయితే అట్టర్ ఫ్లాప్, అడ్డమైన సీరియళ్ల మీద ఉన్న దృష్టి ఇతరత్రా నాన్-ఫిక్షన్ కేటగిరీ మీద లేదు వాడికి… చేతకాదు వాడికి… అప్పట్లో నాగబాబు ఏదో ఉద్దరిస్తాడు అనుకుంటే అదిరింది వంటి కామెడీ షో అడ్డంగా ఫ్లాప్… మాటీవీ వాడు చేసేది కామెడీ స్టార్స్… అదీ అవినాష్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నారు… నానాటికీ తీసికట్టు అన్నట్టుగా అదీ పూర్ రేటింగ్స్‌తో కుంటుతోంది…
ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈటీవీ వాడికి ఆస్థాన కళాకారులు ఉంటారు… జబర్దస్త్ అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా, పండుగల స్పెషల్ షోలు అయినా వాళ్లే కనిపిస్తుంటారు… కంఫర్ట్, పేమెంట్, రిలేషన్ వంటివి ప్రధాన కారణం… జీవాడికి గతంలో సద్దాం, యాదమ్మరాజు, చమ్మక్ చంద్ర తదితరులు ఉండేవాళ్లు… కానీ ఇప్పుడు ఆ టీవీలో కమెడియన్లకు స్కోప్ లేదు… స్టార్ మావాడి తప్పేమిటంటే… ఎంతసేపూ ఆ బిగ్‌బాస్ టీం మీదే ఆధారపడటం… వాళ్లలో చాలామంది జబర్దస్త్ తరహా ప్రొఫెషనల్ కమెడియన్లు, యాంకర్లు కారు… పైగా అవినాష్ ప్లస్ కామెడీ స్టార్స్ టీం క్రియేటివిటీ పెద్ద ఇంప్రెసివ్‌గా ఉండదు… దాంతో మాటీవీ వాడు సీరియళ్లలో తోపు కావచ్చు, కానీ నాన్-ఫిక్షన్ కేటగిరిలో ఉత్త తోక పటాక అయిపోయాడు…
Ads
స్పెషల్ షోలు గానీ, రెగ్యులర్ షోలు గానీ యాంకర్స్ కీలకం… అది మాటీవీ వాడికి అర్థం కావడం లేదు… ఉదాహరణకు, ఈటీవీలో ప్రదీప్, సుధీర్, రష్మి, అనసూయ తదితరులు… షోలకు వాళ్లే సగం బలం… స్పాంటేనిటీ వాళ్ల బలం… స్పాంటేనియస్‌గా పంచులు వేసి, ప్రోగ్రాం రక్తి కట్టించడంలో ప్రదీప్, హైపర్ ఆది సిద్ధహస్తులు… ఆది కాస్త అతి చేస్తాడేమో గానీ, ప్రదీప్ గుడ్ యాంకర్… వీళ్లు మామూలు షోలను కూడా రక్తికట్టించగలరు… కానీ నిన్న స్టార్ మా పరివార్ అవార్డుల కార్యక్రమంలో అవినాష్ పాత్ర చూస్తుంటే జాలేసింది…రిలీఫ్ కోసం సుమకు తోడుగా వచ్చిన తన పర్‌ఫామెన్స్ నవ్వించలేదు సరికదా పలుచోట్ల చిరాకెత్తించింది… తను స్పాంటేనియస్‌గా బలమైన పంచులు వేయడంలో వీక్… సుమ తన అనుభవంతో ఎక్కడికక్కడ కవర్ చేస్తూ వచ్చింది… (సద్దాం ఇంకాస్త బెటర్ గా చేసేవాడేమో)… సరే, పరివార్ అవార్డులదేముంది..? జీతెలుగులో కూడా అలవాటే కదా, వాళ్లలో వాళ్లు అవార్డులు ఇచ్చేసుకోవడం… ఇప్పుడు మాటీవీ వాడు చేస్తున్నాడు… కాకపోతే ప్రేక్షకులకు కాస్త ఆసక్తి ఉంటుంది, చూస్తారు… కాకపోతే షో రక్తికట్టించే హోస్టులు, యాంకర్, కో-యాంకర్స్ అవసరం… మొన్న దసరా దోస్తీ స్పెషల్ షో ను శ్రీముఖి బాగానే హ్యాండిల్ చేసింది, తను చాలా సీనియర్ అండ్ ఎఫిసియంట్… సో, నాన్-ఫిక్షన్ కేటగిరీలో ఈటీవీ బలమేమిటో, తమ బలహీనతలు ఏమిటో జీవాడికి, మావాడికి ఇప్పటికైనా అర్థమవుతున్నదో లేదో అర్థం కాదు మనకు..!!
Share this Article