.
యువరాజు అని అప్పట్లో అక్కినేని హీరోగా దాసరి తీసిన ఓ సినిమా వచ్చింది, దాని గురించి పొద్దున ముచ్చటించుకున్నాం కదా… అందులో కృష్ణా- కావేరి నడిబొడ్డున వంటి అర్థరహిత చరణాలు బోలెడు… అవున్నిజమే… తెలుగు సినిమా పాటలు అసలు సాహిత్యం కేటగిరీలోకి వస్తాయా..?
ఏవో అప్పటికప్పుడు నాలుగు తెలుగు పదాల్ని కూర్చి, బాణీల్లో పేర్చి, ప్రేక్షకులు ఎడ్డోళ్లు, వాళ్లకేం తెలుసు అనే ధోరణితో వెళ్లేవాళ్లు అప్పుడూ, ఇప్పుడూ… ఎప్పుడూ… ఇంకా ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యలో పడ్డట్టు… ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అదేదో పిచ్చి సినిమాలో…
Ads
‘‘జామ చెట్టుకు కాస్తాయి జామ కాయలు, మామిడి చెట్టుకు కాస్తాయి మామిడి కాయలు, భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి (ఏదైనా బూతు స్పురించేలా మస్తు చాకచక్యంగా రాశారో తెలియదు, అదీ చేతకాలేదు పాపం…) వంటి వాక్యాలతో కంపు చేసి వదిలేశారు… ఇక డబ్బింగ్ పాటల దరిద్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…
అపరిచితుడు కావచ్చు బహుశా… రండక రండక, కొండాకాకీ కొండేదానా, గుండిగలాంటి గుండేదానా, అయ్యార్యెట్టు పళ్లదానా, మట్టగిడస కళ్లదానా, పూలతో బాణం వేసే పూలన్ దేవీ…… ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంత ఘోరంగా ప్రియురాలిని వర్ణించినవాడు లేడు… (దీన్ని రాసినది ఆస్కారుడు చంద్రబోసుడు ప్లస్ భువనచంద్ర అని ఆపాట వీడియో చెబుతోంది…)
మిత్రుడు శివప్రసాద్ గుర్తుచేశాడు… సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి.. అవి నువ్వు రాసావా.. నేను రాశానా? నాకు నువ్ రాశావా.. నీకు నేను రాశానా వంటి పాటల నవ్వొచ్చే వాక్యాల గురించి… సేమ్, నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిల్లి నీవు… ఇలా కోకొల్లలు… రాసేవాడికి సినిమా చూసేవాడు లోకువ…
సరే, ఈ దాసరి మార్క్ కృష్ణా – కావేరి నడిబొడ్డున అనే పాట విషయానికి వస్తే… అందులో బోలెడు పిచ్చి భావనల్ని పేర్చాడు పాటగాడు… వీటిపై ఓసారి వేటూరి ఏమన్నాడో మిత్రుడు Vasudha B Rao ఓ కామెంట్‌గా వివరించింది ఇలా…
‘‘ఇలాంటి ఆస్పష్ట భావాలు, పొంతన లేని వాక్యాలు తెలుగు పాటల్లో ఇప్పుడే కాదు.. ఎప్పటినుంచో ఇమిడిపోయాయి… వేటూరి వారే ఒకసారి ఇదే విషయమై ఇలా అన్నారు… ” ఒక్కోసారి సరిఅయిన పదాలు పాదాలు దొరకనప్పుడు అప్పటికప్పుడు ఆ tune లో కలిసే పదాల కూర్పును దూర్చేస్తాం. అన్నిటికీ అర్థాలు చూసుకోకూడదు.. వెతుక్కోకూడదు.
ఆలోచించి సరయిన పదం వేయటానికి అంత టైం ఇవ్వడం లేదు.. సినిమా పూర్తవడానికి ఎన్నేళ్ళు తీసుకున్నా ఎవరూ అడగరు.. పాట మాత్రం రాత్రి చెబితే ఉదయానికివ్వాలి. నించుని కూర్చునే టైం ఇవ్వడం లేదు. ఏదో ఒకటి వేసేయండీ మేం మ్యూజిక్ తో కవర్ చేసుకుంటాం లెండి ! అంటున్నారు.
వాళ్ళు కవర్ చేయడం లేదు, భాషను సాహిత్యాన్ని కబ్జా చేస్తున్నారు..అంతా అలాగే ఉన్నారని అనడం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు అలా వున్నారు.. పాటంటే వాళ్ళ దృష్టిలో మూసలో మట్టి కూరి వినాయకుడి బొమ్మ చేసినంత సులువు.. పదాలు, ప్రయోగాలు వాళ్లకు తెలీవు.. అవసరం లేదు కూడా.
ఇలా వాళ్ళు బిగించిన చట్రంలో, వేసిన సంకెళ్ళలో ఇరుక్కుని, పదాలను ఇరికించి పాటల్ని, ఇవాళ నాతో సహా అందరూ ఇవ్వాల్సి వస్తోంది. లేదంటే దూరంగా ఉండాల్సి ఉంటుంది. మహానుభావుడు గురువు గారు ఆత్రేయ ఒక్కరు మాత్రం ఈ చట్రంలో ఇమిడిపోకుండా, ఇరుక్కోకుండా తనకు నచ్చినప్పుడూ, థాట్ వచ్చినప్పుడు రాసి ఇచ్చేవారు. అది ఆయనకే చెల్లింది. ఆయన ప్రవర్తన వల్ల ఆయనేమీ నష్టపోలేదు..
ఆయన పాటలు ఆయనే రాసేవారు. ఆయన కోసమే వేచి చూసేవారు… ” … నిజమే కదా! స్వేచ్ఛ లేకుండా, టైమ్ ఇవ్వకుండా ఒత్తిడి చేస్తే… ఆ ఒత్తిళ్ల మధ్యన రాసిన పాటయినా చేసిన వంటయినా ఫలితం ఇలానే ఉంటుంది….
Share this Article