.
Shankar G … తెలుగు సినిమాకు అచ్చిరాని అగ్ని… అగ్ని పేరుతో వచ్చిన తెలుగు సినిమాలు దాదాపుగా అన్నీ ఫెయిల్ మూవీసే అని చెప్పొచ్చు.
తొలిసారిగా 1951 లో అగ్నిపరీక్ష అనే మూవీ k. భాస్కర్ రావు నిర్మించారు. ఈయన k. రాఘవేంద్రరావు బాబాయ్ అవుతారు. లక్ష్మీరాజ్యం, రఘురామయ్య, సియస్సార్ నటించిన ఈ చిత్రం విజయం సాధించలేదు.
1970 లో అదేపేరుతో కృష్ణ తొలిసారిగా తన సొంత బ్యానర్ పై అగ్నిపరీక్ష నిర్మించారు. ప్లాఫ్ అయ్యింది.
Ads
1980 లో అగ్ని సంస్కారం పేరుతో అప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్నచిరంజీవి హీరోగా ఒక చిత్రం వచ్చింది. ఇది ఆడలేదు. అభిమానులకు తప్ప ఈ సినిమా ఉన్నట్టు తెలియదు.
ఇక యద్దనపూడి ప్రసిద్ధ నవల అగ్నిపూలు అదే పేరుతో 1982 లో రామానాయుడు కృష్ణంరాజు, జయప్రద, జయసుధలతో బాపయ్య డైరెక్షన్ లో నిర్మించాడు. సినిమా బాగున్నా ఎందుకో పరాజయం పొందింది.
1985లో కృష్ణ హీరోగా అగ్నిపర్వతం వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చినా అప్పటి ఎన్నికల్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ ప్రచారం చేయటం వల్ల సినిమా ఆశించిన ఘన విజయం సాధించలేదు.
చిరంజీవిని ప్రాణం ఖరీదుతో సినీ పరిశ్రమకు పరిచయం చేసిన క్రాంతికుమార్ అయనతోనే న్యాయం కావాలి, కిరాయి రౌడీలు తర్వాత అగ్నిగుండం సినిమాను 1984 లో భారీగా తీసాడు. కానీ సినిమా ఘోర పరాజయం పొంది క్రాంతికుమార్ కు భారీ నష్టాన్ని మిగిల్చింది.
1987 లో కృష్ణ, భానుప్రియ జంటగా వచ్చిన అగ్నికెరటాలు కూడా ఫ్లాప్ జాబితాలో చేరింది. అదే సంవత్సరం అన్నపూర్ణ బ్యానర్ పై రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని, నాగార్జునలతో నిర్మించిన మరో అగ్ని చిత్రం బెడిసికొట్టింది. భారీ ప్లాఫ్ గా నిలిచింది.. పైగా నాగేశ్వరరావు నటన విమర్శలకు తావిచ్చింది. నాగార్జున అప్పటికి lkg లోనే ఉన్నాడు కాబట్టి నటన గురించి ఏం చెప్పలేం.
1989లో k రాఘవేంద్రరావు తన rk బ్యానర్ పై నాగార్జునతో అగ్ని అనే భారీ మూవీ తీసాడు. సినిమాలో విషయం లేక చతికిల పడింది.
1990 లో అగ్నిసాక్షి అనే సినిమా వచ్చింది. మురళీమోహన్, విజయనిర్మల నటించిన ఈ సినిమా ఒకటి ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు.( వికీపిడియా వాడికి తప్ప )
1990 లోనే ప్రముఖరచయిత యండమూరి తన అగ్నిప్రవేశం నవలను అదే పేరుతో రమ్యకృష్ణ, యమున ప్రధాన పాత్రలుగా తొలిసారిగా దర్శకత్వం చేశాడు. సినిమా జనాలకు నచ్చక ఆటకెక్కింది. ఈ సినిమా ప్లాఫ్ తర్వాత అగ్ని అనే పేరుతోనే అగ్నియుద్ధం తీసి హిట్టు కొడతానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. కానీ చిరంజీవితో తీసిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ భారీ ప్లాఫ్ అందుకుని డైరెక్షన్ కు దండం పెట్టేసాడు.
అగ్ని పేరు అచ్చిరాలేదు, కానీ అగ్గి పేరుతో వచ్చిన జానపద సినిమాలు హిట్ అయ్యాయి. అగ్గిరాముడు, అగ్గిపిడుగు, అగ్గిబరాట, అగ్గిదొర, అగ్గిమీద గుగ్గిలం లాంటి సినిమాలు హిట్ కాగా అగ్గివీరుడు మాత్రం ప్లాఫ్ అయ్యింది…. అదండి తెలుగు సినిమాలకు అచ్చిరాని అగ్ని టైటిల్…
Share this Article