Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లైఫ్ పీర్..! మన శనిగరం ఉదయ్ నాగరాజు కొత్త హోదా కథేమిటి..?!

February 13, 2026 by M S R

.

మొన్న సిద్దిపేట జిల్లా, శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (46) లైఫ్ పీర్‌గా బ్రిటన్ ఎగువ సభలోకి అడుగుపెట్టాడనీ, భగవద్డీత మీద ప్రమాణం చేశాడనే వార్త అందరూ ఇచ్చారు… అసలు ఏమిటి ఆ పదవి..? ఎవరు అర్హులు..? ఏమిటి అధికారాలు..? ఎవరు నియమిస్తారు..? ఎందుకు ఈ హోదా..?

బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో ‘లైఫ్ పీర్’ (Life Peer) అనేది చాలా గౌరవప్రదమైన, కీలకమైన పదవి… యూకే ఎగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ (House of Lords)లో జీవితకాలం సభ్యత్వం… మనకు ఉన్నట్టుగా లోకసభ, రాజ్యసభలాగా… బ్రిటన్ పార్లమెంటులో రెండు సభలు ఉంటాయి: 1. హౌస్ ఆఫ్ కామన్స్ (ప్రజలు ఎన్నుకునేది), 2. హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)…

Ads

‘లైఫ్ పీర్’ అంటే జీవితాంతం హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యుడిగా ఉండే అవకాశం కల్పించే హోదా… ఈ పదవి పొందిన వారికి ‘లార్డ్’ (Lord) లేదా ‘బారోనెస్’ (Baroness) అనే బిరుదు లభిస్తుంది… మరీ సింపుల్‌గా చెప్పాలంటే మన దేశంలో రాజ్యసభకు నామినేట్ చేస్తుంటారు కదా కొందరిని… ఇదీ అలాగే… కాకపోతే మన రాజ్యసభలో ఆరేళ్లు… అక్కడ జీవితాంతం…

గతంలో ఈ పదవులు తండ్రి తర్వాత కొడుక్కి వచ్చేవి (Hereditary)… కానీ ‘లైఫ్ పీర్’ అనేది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం… వారి పిల్లలకు ఈ హోదా సంక్రమించదు… ఒకసారి నియమితులైతే, వారు మరణించే వరకు లేదా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసే వరకు సభ్యులుగా కొనసాగుతారు… వీరిని బ్రిటన్ రాజు/రాణి నియమిస్తారు. అయితే, దీనికి ప్రధాన మంత్రి సిఫార్సు తప్పనిసరి…

ఎవరు అర్హులు? సాధారణంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారిని ఈ పదవికి ఎంపిక చేస్తారు… సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్నవారు… సైన్స్, కళలు, వ్యాపారం, చట్టం, విద్య లేదా సామాజిక సేవలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వారు…. రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు లేదా సైనిక అధికారులు… కనీసం 21 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి, కామన్వెల్త్ లేదా ఐర్లాండ్ పౌరుడై ఉండాలి…

అధికారాలు ఏమిటి? హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా వీరికి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి… హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ) చేసే చట్టాలను వీరు క్షుణ్ణంగా పరిశీలించి, సవరణలు సూచిస్తారు… ప్రభుత్వ నిర్ణయాలను, పాలసీలను నిలదీసే అధికారం వీరికి ఉంటుంది… దేశ విదేశీ సమస్యలపై చర్చల్లో పాల్గొని తమ మేధోపరమైన సలహాలను అందిస్తారు… సభలో ప్రవేశపెట్టే బిల్లులపై ఓటు వేసే హక్కు ఉంటుంది…

ఎందుకు ఈ హోదా ఇస్తారు? బ్రిటన్ ప్రజాస్వామ్యంలో హౌస్ ఆఫ్ లార్డ్స్‌ను ఒక ‘అడ్వైజరీ బాడీ’గా పరిగణిస్తారు… రాజకీయాలకు అతీతంగా, అనుభవం ఉన్న మేధావుల సలహాలు చట్టసభకు అవసరమని బ్రిటన్ భావిస్తుంది… అందుకే సమాజంలోని విభిన్న రంగాల నిపుణులను ఏరికోరి ఈ సభకు పంపిస్తారు…

నాగరాజు విశేషాలు… 25 ఏళ్ల క్రితం లండన్ వెళ్లిన నాగరాజు అక్కడే ఉన్నత విద్య కూడా చదివి, సామాజిక- రాజకీయరంగాల్లో కృషి చేస్తున్నాడు… రెండేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ నియోజకవర్గం నుంచి లేబర్‌ పార్టీ తరఫున పోటీ చేశాడు… ఆ ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీకి చేసిన సర్వీస్ పరిగణనలోకి తీసుకుని బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఆయన పేరును ఎగువ సభకు సిఫార్సు చేశాడు… ఇదీ నేపథ్యం…

ఉదయ్ నాగరాజు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు… యువతలో నైతిక నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ‘మహాత్మాగాంధీ ఫ్యూచర్‌ లీడర్స్‌ ప్రోగామ్‌’ను స్థాపించాడు… గాంధేయ సిద్ధాంతాలను, సామాజిక న్యాయాన్ని ప్రచారం చేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు… అదే సమయంలో భవిష్యత్తు సాంకేతికత అయిన కృత్రిమ మేధపై కూడా ఆయనకు అపారమైన పట్టు ఉంది… ‘ఏఐ పాలసీ ల్యాబ్స్‌’ సంస్థ ద్వారా కృత్రిమ మేధ, గ్లోబల్ గవర్నెన్స్ వంటి అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆయన తన గళాన్ని వినిపిస్తున్నాడు… ఇదీ లైఫ్ పీర్ రాజు అలియాస్ శనిగరం నాగరాజు కథ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బో… ఈ ప్రముఖ గ్రంథ ‘సాంగు’డి కథలో ఈ కోణాలూ ఉన్నాయా..?
  • D-Dad …! చిన్నారులకు డిజిటల్ చెర నుంచి విముక్తి… గుడ్ ప్రోగ్రామ్..!!
  • లైఫ్ పీర్..! మన శనిగరం ఉదయ్ నాగరాజు కొత్త హోదా కథేమిటి..?!
  • గాంధీ సరోవర్ ప్రాజెక్టు- గేట్ వే ఆఫ్ హైదరాబాద్… ఏమిటివి..? ఎక్కడ..?
  • దేవుళ్లు ఎవరి గుప్పిట్లో ఉన్నారు..? అసలు విముక్తికి ఏమిటీ మార్గం..?!
  • కౌంటర్ నెరేటివ్స్..! ఆ లడ్డూ నెయ్యికీ, ఈ పెరుగుకూ లింకేమిటి..?
  • బెడిసికొట్టిన పాము కుబుసం ప్లాన్… టీవీ సీరియళ్లు తెగ చూసేదేమో…
  • సమాజ హిత కథనమే… కానీ పెద్దగా పదును లేని కృష్ణ ఆయుధం …
  • మార్పేమీ లేదు… భద్రతామండలి సభ్యత్వంపై ఇప్పటికీ చైనా మోకాలడ్డు..!!
  • అవిశ్వాసం, ఆ పుస్తకం… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు తప్పు ఎవరిది..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions