.
ఇదే తేడా… బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి దేశ భద్రతకు సంబంధించి మమత హయాంలో జరిగిన తప్పిదాలను దిద్దుతూ… కంచె కోసం భూమి అప్పగింత, చికెన్ నెక్ భూమి ధారాదత్తం వంటి కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు… మరి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్.,.?
అడగడకపోయినా తనకు మద్దతునిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన తండ్రి రాజీవ్ గాంధీని హతమార్చిన సంస్థ ఎల్‌టీటీఈ… దాని మృత అధినేత ప్రభాకరన్‌ను నివాళి అర్పించాడు… ఈ దేశం రాజీవ్ హత్య తరువాత ఆ సంస్థను నిషేధించింది, వెంటాడింది… మూలాలు పెరికేసింది… టైగర్లకు అన్నిరకాల మద్దతు పలికే డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసింది…
Ads
అలాంటి ప్రభాకరన్‌కు విజయ్ నివాళి..! ముల్లివైకల్ తీర ప్రాంతంలో జరిగిన ఆఖరి యుద్ధ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విజయ్ ఎక్స్‌లో ఇలా రాశాడు… (అనువాదం)…
- “ముల్లివైకల్ జ్ఞాపకాలను మేము మా హృదయాలలో మోస్తాము! సముద్ర అవతలి ఒడ్డున నివసిస్తున్న మా తమిళ బంధువుల హక్కుల కోసం మేము ఎల్లప్పుడూ సంఘీభావంగా నిలబడతాము!”
2009 మే 18న శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన చివరి దశలో ముల్లివైకల్ గ్రామంలో వేలాది మంది తమిళ పౌరులు ప్రాణాలు కోల్పోయారు… అదే రోజున ఎల్‌టీటీఈ (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ కూడా శ్రీలంక సైన్యం చేతిలో మరణించాడు… గ్లోబల్ శ్రీలంక తమిళులు ఈ రోజును ‘తమిళ జీనోసైడ్ రిమెంబరెన్స్ డే’గా జరుపుకుంటారు…
సెప్టెంబర్ 2025లో నాగపట్నం పర్యటనలో విజయ్ మాట్లాడుతూ.. “ఈలం తమిళులు ఒక తల్లి లాంటి ప్రేమను చూపించిన నాయకుడిని (ప్రభాకరన్) కోల్పోయి బాధపడుతున్నారు… వారి కోసం గొంతు విప్పడం మన బాధ్యత” అని వ్యాఖ్యానించాడు… తన రాజకీయ ప్రచారంలోనూ ప్రభాకరన్‌ను శ్రీలంక తమిళుల ‘తల్లి’ లాంటి వ్యక్తిగా అభివర్ణించి గతంలో వివాదాలకు తెరలేపాడు…
రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకరన్‌కు, భారతదేశంలో నిషేధించబడిన ఎల్‌టీటీఈ (LTTE) కి అనుకూలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం ఎలా సమర్థనీయం..? స్టాలిన్ అయితే ఈ ప్రభుత్వం చాన్నాళ్లు ఉండదు, మధ్యంతర ఎన్నికలకు సిద్దం కావాలని కేడర్‌కు పిలుపునిస్తున్నాడు…
ఇదే డీఎంకే కూడా టైగర్ల మద్దతుదారే… అంతెందుకు..? విజయ్‌కు మద్దతునిస్తున్న వీసీకే బలమైన టైగర్ల మద్దతుదారు… కేంద్రంలోని కాంగ్రెస్ ఎవరి ప్రభుత్వాన్నయితే రాజీవ్ హత్యను చూపి రద్దు చేసిందో, అదే డీఎంకేతో చాలా ఏళ్లుగా కాంగ్రెస్ దోస్తీ..! సరే, అది అనైతికమో, నైతికమో, రాజకీయాల్లో సహజమేనేమో… ఇప్పుడు విజయ్ కూడా అదే బాట…
మరి తన తండ్రిని చంపిన హంతకుడికి విజయ్ నివాళి అర్పించడాన్ని రాహుల్ ఎలా స్వీకరిస్తాడు.? ఎలా స్వీకరించాలి..? గతం గతః … హంతకులను ఆయన తల్లే క్షమించింది కదా, ఇంకా ఎందుకు ఉండాలి కక్ష, కోపం అనుకోవాలా..?! రాజకీయ అవసరమా..? భావోద్వేగాలకు రాజకీయాల్లో స్థానం లేదా..? ఉండకూడదా..?
[రాజీవ్ గాంధీ హత్య] ──> [డీఎంకే ప్రభుత్వం రద్దు (1991)]
│
▼
[యుపిఎ కూటమిలో భాగస్వామ్యం (2004 – 2014)] ──> (కాంగ్రెస్ + డీఎంకే దోస్తీ)
│
▼
[ప్రస్తుత సమీకరణం (2026)] ──> (ప్రభాకరన్‌ను ఆరాధించే విజయ్ + వీసీకే కూటమికి కాంగ్రెస్ మద్దతు)
Share this Article