.
వార్త చూడగానే కలిగిన ఆశ్చర్యసందేహాందోళనలు ఏమిటనగా… ఈ దేశ అత్యున్నత సివిల్ సర్వీసుల్లో ఉన్నవాళ్లకు ఈమాత్రం సోయి లేదా..? హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరమని తెలియదా..? అలా ఎలా చేసేసుకున్నారు పెళ్లిళ్లు అని..!! చట్టానికి దొరక్కుండా మతం మారారా..?
కాదట… నడుమ విడాకులు, అధికారిక వీడ్కోళ్లు అయ్యాకే ఈ మూడు పెళ్లిళ్లు జరిగాయట… విషయం ఏమిటంటే..? సాధారణంగా ఒకే ఇంట్లో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటేనే అది పెద్ద వార్త… అంతెందుకు ఒక ఊరి నుంచి ఒక ఐఏఎస్ వస్తే కూడా విశేషమే… ఆ ఊరు కాలరెగరేస్తుంది కదా…
Ads
అలాంటిది ఒక ఐఏఎస్ అధికారి వరుసగా ముగ్గురు ఐఏఎస్ అధికారులనే పెళ్లి చేసుకోవడం, అది కూడా ఒకే రాష్ట్ర క్యాడర్‌లో ఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది… మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ తాజాగా మూడో వివాహం చేసుకున్నాడు… ఆ ముగ్గురు భార్యల్లో ఇద్దరు ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు…
కూనో నేషనల్ పార్క్‌లో వేడుక ఫిబ్రవరి 11, 2026న మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ కూనో నేషనల్ పార్క్ పరిసరాల్లో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది… 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకితా ధాక్రే మెడలో అవి ప్రసాద్ మూడు ముళ్లు వేశాడు… అత్యంత సన్నిహితులు, కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక నిరాడంబరంగా సాగింది…. ఇదీ వార్త…
వరుసగా ముగ్గురు ఐఏఎస్ భార్యలు.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అవి ప్రసాద్ గతంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను వివాహం చేసుకున్నాడు… వారిద్దరితో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే ఈ మూడో పెళ్లి చేసుకున్నాడు… విశేషమేమిటంటే, ఆయన మాజీ భార్యలిద్దరూ ప్రస్తుతం అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్లుగా కీలక బాధ్యతల్లో ఉన్నారు…
-
రిజు బాఫ్నా (మొదటి భార్య)…: 2014 బ్యాచ్ ఐఏఎస్…. యూపీఎస్సీ ప్రిపరేషన్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి వివాహానికి దారితీసింది… ప్రస్తుతం ఆమె షాజాపూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోంది…
-
మిషా సింగ్ (రెండవ భార్య)…: 2016 బ్యాచ్ ఐఏఎస్… ఈమెకూ మన తెలుగు రాష్ట్రాలకూ సంబంధం ఉందండోయ్… ఆమెది మొదట ఆంధ్రప్రదేశ్ క్యాడర్ … వివాహం తర్వాత మధ్యప్రదేశ్ క్యాడర్‌కు బదిలీ అయ్యింది, భర్త కేడర్ చూపించి..! నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ విడిపోయారు… ప్రస్తుతం ఈమె రత్లాం జిల్లా కలెక్టర్…
-
అంకితా ధాక్రే (మూడవ భార్య)…: 2017 బ్యాచ్ ఐఏఎస్…. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ…

ఎవరీ అవి ప్రసాద్?
లేడీ ఐఏఎస్ అధికారులకు ఈయన ఎందుకంత ‘ఉత్తమ పురుష్..? అదీ ఆసక్తికరం… ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన అవి ప్రసాద్‌కు బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది… ఆయన తాతగారు తాంబేశ్వర్ ప్రసాద్ మాజీ మంత్రి…. అవి ప్రసాద్ మొదట 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు.., కానీ ఐఏఎస్ లక్ష్యంతో మళ్ళీ రాసి 2014లో ఆలిండియా 13వ ర్యాంకు సాధించాడు… ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ సీఈఓ…
ఒకే క్యాడర్‌లో తన ఇద్దరు మాజీ భార్యలు కలెక్టర్లుగా ఉండగా, మరో సహోద్యోగినిని ఆయన వివాహం చేసుకోవడం అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్… అన్నింటికీ మించి అసలు ఆయనలో ఏముందని అంతగా లేడీ ఐఏఎస్‌లు ఎగబడుతున్నారనేది అసలు చర్చ…!
Share this Article