.
బహుశా తెలుగు జనాన్ని అత్యంత ఎమోషన్‌కు గురిచేసిన వార్త ఇదే అనుకుంటా… నిన్నా ఈరోజు… నిజంగా చదువుతుంటే కలుక్కుమనేలా ఉంది…
ఆమె… విజయారెడ్డి… మంచి ఐటీ ఉద్యోగం… ఇద్దరు పిల్లలు… బిడ్డ చేతన రెడ్డి, కొడుకు విశాల్‌రెడ్డి… ఎక్కడో హాస్టల్‌లో ఉండి ఇంటర్ చదువుతున్నారు… సొంతిల్లు… చెంగిచర్ల ఏరియాలో… అమ్మ పుష్పలత కూడా ఆమెతోనే ఉంటోంది…
Ads
మొగుడు ఎక్కడో సౌదీలో కొలువు చేస్తున్నాడు… భర్త పేరు సురేందర్ రెడ్డి… నెల్లూరు సొంతూరు… 4 నెలలక్రితం వచ్చాడు, పిల్లలతో గడిపాడు, వెళ్లిపోయాడు… పెద్దగా కుటుంబకలహాల గురించీ ఎవరికీ తెలియదు… కానీ హఠాత్తుగా ఆమె అవాంఛనీయమైన నిర్ణయం తీసుకుంది…
పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చింది… రాత్రికిరాత్రి రైలు పట్టాల మీదుగా నడుస్తూ వెళ్లి, గూడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకుంది… ఇద్దరు పిల్లల్ని దగ్గరకు హత్తుకుని, తనతోపాటు వేరే లోకాలకు తీసుకుపోయింది… ఇదీ విషాదం…

కారణం..? తెలియదు… ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో కూడా వివరాలేమీ లేవు… భర్త మీద కూడా ఫిర్యాదు లేదు, తన ప్రస్తావనే లేదు… అమ్మను క్షమించమని రాసి… బతకలేకపోతున్నా, పిల్లలను కూడా తీసుకుని పోతున్నా అని రాసింది, అంతే…
కానీ, ఏదో బలమైన కారణం లేకపోతే అంత అఘాయిత్యానికి పాల్పడదు… చదువుకున్నది, టీమ్ లీడర్‌గా మంచి ఉద్యోగంలో ఉంది… భర్తతో విభేదాలా..? విడాకులు తీసుకోవచ్చు, విడిపోయి బతకొచ్చు… ఇంకేమైనా సమస్యలా..? మిస్టరీ..!
ఎవరైనా కొలీగ్స్‌తో తన విషాదాన్ని, తన ఆందోళనను పంచుకుందో లేదో తెలియదు… కానీ ఇంటర్ చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకుపోవడం మరో విషాదం… ఆ పిల్లలు కూడా తల్లి వాదనతో కన్విన్స్ కావడమే ఆశ్చర్యం… ఆమె పిల్లల్ని బలవంతంగా పట్టుకుని రైలుకు ఎదురువెళ్లడానికి చిన్న పిల్లలేమీ కాదు… ఇంటర్ చదువుతున్నారు… అంటే ఆమె ఆత్మహత్యకు పిల్లల్ని కూడా కన్విన్స్ చేసింది…
సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు, పోస్టులు, సంతాపాలు… ఈరోజంతా ఇదే వైరల్ విషాదం… కారణాలు ఏమై ఉంటాయాని అంచనాలు, ఊహాగానాలు… తిరిగి రారు, మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి… ముద్దుగా ఉన్నారు పిల్లలు కూడా… పోయేది ఆమె పోవచ్చు కదా, పిల్లల్ని బలి పెట్టడం దేనికనేదే చాలామంది అడిగిన ప్రశ్న…
వినడానికి వాళ్లు లేరు, జవాబూ దొరకదు… అది ఆ దుర్బల క్షణంలో తీసుకున్న నిర్ణయం… భర్తతో విభేదాలకన్నా ఇంకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది.., భర్త మామధ్య కలతలు, కలహాలు లేవంటున్నాడు… ఆమె తల్లి అదే చెబుతోంది, ఆమె అన్న అదే అంటున్నాడు… మరేమిటి..?
ఎంత బలమైన కారణమైనా సరే, బతికి, పరిస్థితులతో పోరాడితేనే బాగుండేది... చావే సమస్యలకు పరిష్కారమైతే, అసలు ఈ లోకంలో ఒక్క మనిషి కూడా మిగలడు కదా..!!
Share this Article