.
ఇంటర్ చదివే ఇద్దరు పిల్లల్ని కూడా ఆత్మహత్యకు ఒప్పించి మరీ ఓ ఐటీ యువతి రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు విడిచిన కథ తెలిసిందే కదా… కారణాలు ఈరోజుకూ అనూహ్యం… రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు గానీ, కుటుంబంలో ఏ కలతలూ లేవని తెలుస్తోంది… మరి ఏం జరిగింది..? మిస్టరీయే… బహుశా అదిక తేలకపోవచ్చు, తెలియకపోవచ్చు…
మరో సాఫ్ట్‌వేర్ యువతి ఆత్మహత్య వార్త వచ్చింది నిన్న… సరే, రెండు కథలూ వేర్వేరు… ఆమెకు ఇద్దరు పిల్లలు… అమ్మ తనతోనే ఉంటుంది… భర్త దుబయ్‌లో జాబ్… ఈమెకు పెళ్లి కాలేదు… పెళ్లే సమస్య… ఈమె కూడా తల్లితోనే ఉంటోంది… నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే, అనారోగ్య పీడితురాలైన తల్లిని ఎవరు చూసుకుంటారనే బాధతో ఆత్మహత్య చేసుకుందని మీడియా రాసుకొచ్చింది… దాదాపు ప్రతి టీవీ, ప్రతి పేపర్‌లోనూ సేమ్ కథనం…
Ads
ఓసారి ఈ వార్త చూద్దాం… ‘‘ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తల్లితో కలిసి కూకట్పల్లిలోని మోతినగర్ ఉంటోంది… తండ్రి చనిపోవడంతో తల్లికి తానే సర్వస్వంగా ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో రూ.లక్ష జీతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది…
తల్లి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను కంటికిరెప్పలా చూసుకునేది… ఈ క్రమంలో బంధువులు విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు… పెళ్లయ్యాక తల్లి సైతం తనతోపాటే ఉంటుందని కండీషన్ పెట్టడంతో ఒక్క సంబంధమూ ఖాయం కావడం లేదు… (తల్లి పట్ల ప్రేమ, తల్లితో అనుబంధం, తన దోవ తాను చూసుకోలేని అభిమానం)…
గత నెల 31న విజయలక్ష్మి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని ట్యాంక్ బండ్ చేరుకుంది… అక్కడ అన్నమయ్య విగ్రహం వద్ద దిగి, ఎవరూ గమనించని టైంలో సాగర్‌లో దూకేసింది… అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు… అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు… హుస్సేన్ సాగర్‌లో ఓ మృతదేహం లభ్యమైందని తెలియడంతో, బంధువుల సాయంతో పరిశీలించగా, అది విజయలక్ష్మిదేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు…
…. ఇదీ వార్త… ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే..? పెళ్లయినా తల్లి తనతోనే ఉంటుందని ఆమె షరతు పెట్టడానికి కారణం, అమ్మను అనాథను చేయొద్దనే ప్రేమ… పెళ్లి సంబంధాలు వస్తున్నాయి గానీ ఆమె షరతును అంగీకరించడం లేదు… సో, ఏవీ కుదరడం లేదు… ఈ స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకుంటే అమ్మకు తను కూడా లేకుండా పోతుంది కదా… ఇదీ బేసిక్ ప్రశ్న…
సో, నిజంగా తల్లి మీద అంత ప్రేమ ఉన్న యువతి, పెళ్లయినా తనతోనే ఉంటుందని షరతు పెట్టే యువతి, హఠాత్తుగా ఆమ్మను కాలానికి వదిలేసి ఈ లోకం విడిచిపెట్టి ఎందుకు వెళ్లిపోయినట్టు..? ఎక్కడో వార్త తేడా కొడుతోంది… లాజిక్ దొరకడం లేదు… బహుశా పోలీసులు చెప్పిన కథనాన్నే అందరూ క్యారీ చేసినట్టున్నారు… ఎస్, బలమైన కారణం లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకోదు, కానీ అదే ఏమిటని..!!

గతంలో క్రైం వార్తల కవరేజీలో జర్నలిస్టులు హ్యూమన్ యాంగిల్ వెతికేవాళ్లు, పట్టుకునేవాళ్లు… ఫాలోఅప్ ఉండేది… అన్నీ మానవాసక్తికర కథనాలే… కానీ టీవీ, డిజిిటల్, సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక తాత్కాలిక సంచలనం కోసం వార్త… తరువాత మరో సంఘటన వైపు మళ్లిపోవడం, ఎక్కువగా పోలీసులు చెప్పిన కథనాలే ఆధారం…
ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు వేర్వేరు స్టోరీల్లో… పిల్లలతోసహా ఆత్మహత్య చేసుకోవడానికీ ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది… ఆమె సూసైడ్ నోట్ కూడా ఏమీ చెప్పలేదు… ఈ సాఫ్ట్‌వేర్ యువతి బలన్మరణం వెనుకా అంతే… కానీ ఏమిటవి..? ప్చ్… ఈమె సూసైడ్ నోట్ ఏమీ దొరికినట్టు లేదు… రెండూ విషాదాలే, రెండూ కారణాలు తెలియని మిస్టరీ బలన్మరణాలే…
Share this Article