Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

March 8, 2026 by M S R

.

విప్లవం కోసం కుటుంబం అంతా అర్పణ… చివరకు మిగిలింది ఒంటరి నవత! దండకారణ్య అడవుల నుంచి బయటకు వచ్చిన ఒక విషాదగాథ…

‘‘వందల మంది ఆయుధాలతోసహా లొంగిపోతున్నారు… హిడ్మా ఎన్‌కౌంటర్ బాపతు అవిశ్వాసం నుంచి మిగిలిన మావోయిస్టులందరూ తెలంగాణ ప్రభుత్వమే దిక్కు అని ఇక్కడికొచ్చి లొంగిపోతున్నారు… కణకణమండిన తెలంగాణలో ఇప్పుడు ఒక్క మావోయిస్టు లేడు… చివరకు ఏపీ- ఒడిశా బోర్డర్ మావోయిస్టులు కూడా తెలంగాణ ప్రభుత్వాన్నే నమ్మి ఇక్కడికి వస్తున్నారు… ఆ చంద్రబాబును నమ్మేవాళ్లు లేరు…

Ads

లైట్ మెషిన గన్స్ మాత్రమే కాదు, రకరకాల ఆయుధాలు… అసలు మావోయిస్టు పార్టీకి కీలకమైన పీఎల్జీఏ మొత్తం కనుమరుగు… తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కావచ్చు, ఎస్ఐబీ ఐజీ సుమతి కావచ్చు, మీరేమీ ఈ విజయాలపై రాయలేదు’’ అనడిగాడు ఓ మిత్రుడు… ఉవ్వెత్తున మంటలు ఎగిసినచోటే చప్పున చల్లారిన తెలంగాణ విప్లవం ప్రాధాన్యవార్తే కదానేది తన అభిప్రాయం…

విజయం, విప్లవం, విశ్లేషణ… ఈ మాటలెలా ఉన్నా… లొంగిపోతే అన్నీ ఇస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి… అంటే కేసీయార్ చెప్పినట్టు అందరికీ మూడెకరాల భూమి అని కాదు గానీ, ఓ ఇల్లు, ఆరోగ్య భద్రత, ప్రాణరక్షణ భరోసా ఎట్సెట్రా… సరే, అర్థం చేసుకోవచ్చు… రివార్డుల పెంపుదల కూడా వోకే… కానీ..? ప్రాణరక్షణతో పరుగులు తీస్తున్న వాళ్లకు ఆ ప్రాణాలమీద భరోసా ఇవ్వడమే ఎక్కువ కదా, మరి వాళ్లు అడిగినవన్నీ ఏవో స్వాతంత్ర్య సమరయోధులకు ఇస్తున్నట్టుగా హామీలు దేనికి..? వాళ్లు రాజ్యానికి మిత్రులా, శత్రువులా అనే ఓ మీమాంస ప్రశ్న కూడా వినవస్తోంది, అవన్నీ వదిలేస్తే…

నిన్నటి లొంగుబాట్లలో ఒక మహిళ ఆకర్షించింది… అదీ మహిళా దినోత్సవం రోజున… అసలు అన్నీ వదిలేసి సాయుధ విప్లవంలోకి అడుగుపెట్టి, కొనసాగి, జీవితాన్ని అంకితం చేయడమే ఓ పెద్ద విశేషం… అలాంటి ఓ మహిళ ఎందుకు ఆశ్చర్యపరిచింది, ఎవరామె అనే వివరాల్లోకి వెళ్తే….



తెల్లగా మారిన జుట్టు… హిప్పీ కటింగ్… చదువుకున్న మహిళలా కనిపించే ఆ రూపం అక్కడ లొంగుబాట్ల ప్రోగ్రాంలో ఉన్న వారిని కాసేపు ఆశ్చర్యానికి గురి చేసింది… “ఇవరు ఎవరు?” అని చాలామంది ఆరా తీశారు…

తరువాత తెలిసింది ఓ ఆశ్చర్యపరిచే నిజం, ఆ కుటుంబ జీవితం… అన్నీ వదిలేసిన ఓ త్యాగం… కానీ మరో ఆశ్చర్యం, ఓ డెస్టినీ బేస్డ్ కథ… ముగింపులో చెబుతాను…




ఆమె విరసం నేత Chalasani Prasad కుమార్తె — చలసాని నవత అలియాస్ చంద్ర (61)… దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దండకారణ్య అడవుల్లో గడిపిన ఈ మహిళ… చివరకు ఆయుధాలు వదిలి బయటకు వచ్చింది… ఇది కేవలం ఒక మావోయిస్టు లొంగుబాటు కథ కాదు… ఒక కుటుంబం, ఒక సిద్ధాంతం, ఒక కాలం ముగిసిన కథ…

ఎస్, చలసాని కుటుంబం సాధారణ కుటుంబం కాదు… విప్లవం వారి జీవితంలో ఒక ఆలోచన మాత్రమే కాదు… ఒక జీవన విధానం… నవత తండ్రి చలసాని ప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ కమ్యూనిస్ట్ ఆలోచనాపరుడు. ఆయన Kodavatiganti Kutumba Rao, Sri Sri లాంటి ప్రముఖులతో కలిసి విప్లవ రచయితల సంఘం (విరసం) నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు…

అలాగే ప్రజా కళా ఉద్యమంలో Gaddar, Vangapandu Prasada Rao లాంటి కళాకారులతో కలిసి జననాట్యమండలి నిర్మాణానికి పునాది వేశాడు… అది కేవలం సాహిత్య పోరాటం కాదు. ఆ కుటుంబం నిజంగానే ఆయుధ పోరాటంతో ముడిపడి ఉంది… ఎలా అంటే..?

నవత మామ వాసుదేవరావు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు… నవత సోదరుడు రవి శ్రీకాకుళం ఉద్యమ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు… అంటే ఒక కుటుంబం… తరం తరంగా విప్లవానికి అంకితం అయింది… ప్రాణాలు వదిలింది…

విశాఖపట్నం హెచ్‌బీ కాలనీలో పెరిగిన నవత చదువంతా అక్కడే సాగింది… విద్యావంతురాలిగా పెరిగిన ఆమె… 1990ల చివర్లో లేదా 2000 ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమంలో చేరినట్లు సమాచారం… ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది…

అడవులు…
గెరిల్లా జీవితం…
ఎప్పుడూ ప్రమాదం మధ్య జీవనం…

ఇదే ఆమె ప్రపంచం అయింది… కాలక్రమంలో ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయికి ఎదిగింది… అంటే ఉద్యమంలో ఒక కీలక నాయకురాలు… దాదాపు మూడు దశాబ్దాలు ఆమె అడవుల్లోనే గడిపింది…

తిరిగి చూసుకున్నప్పుడు… కాలం మారిపోయింది… ఒకప్పుడు దేశవ్యాప్తంగా సలసల మరిగిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు క్రమంగా క్షీణిస్తోంది… అడవుల్లో మిగిలిన నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు… అలా బయటకు వచ్చిన వారిలో ఇప్పుడు నవత కూడా ఉంది…

సరే, మావోయిస్టు పోరాట వైఫల్యాలు, కథాకమామిషు కాసేపు పక్కన పెడదాం… అదో పెద్ద చర్చ… ఆమె వెనక్కి చూసుకుంటే — ఒక పెద్ద శూన్యం కనిపించక మానదు…

పోరాటం కోసం ప్రాణాలు ఇచ్చిన మామ లేడు, ఎన్‌కౌంటర్‌లో మరణించిన అన్న లేడు, విప్లవ రచయితగా నిలిచిన తండ్రి లేడు, ఒకప్పుడు కుటుంబం మొత్తం అంకితమైన ఉద్యమం కూడా ఇప్పుడు లేదు… ఒక ఒంటరి పక్షి.. యవ్వనంలో “విప్లవం” అనే కల కోసం అడవుల్లోకి వెళ్లిన నవత… ఇప్పుడు 60 ఏళ్ల వయసులో తిరిగి సమాజంలోకి అడుగుపెడుతోంది… ఓ వైఫల్య గాథగా…

ఆమె చేతిలో ఇప్పుడు తుపాకీ లేదు. అడవుల్లో సహచరులు కూడా లేరు. మిగిలింది ఒక పొడవైన జ్ఞాపకాల ప్రయాణం మాత్రమే. ఒక కుటుంబం మొత్తం విప్లవానికి అంకితం అయింది. చివరకు ఆ కుటుంబం నుంచి మిగిలిన చివరి వారసురాలు… రాజ్యం ఎదుట లొంగిపోయింది…

ఇప్పుడు ఆమె కథను చూస్తే ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది — దశాబ్దాల పోరాటం… అనేక త్యాగాలు… ఎన్నో ప్రాణాలు… చివరకు మిగిలింది ఏమిటి..? ఇక్కడే ఓ చిన్న సంగతి చెప్పుకుని ముగిద్దాం…. ది గ్రేట్ మావోయిస్టు గణపతి, దశాబ్దాలుగా విప్లవం పేరిట వేలాది మంది ఆత్మార్పణకు కారకుడి కొడుకు ఎక్కడున్నాడో తెలుసా..? అమెరికాలో..!! ఓ కంట్రాస్టు దృశ్యం చెప్పడం కోసం..!!

చివరగా.... ఆమె ఎంచుకున్న పంథా తప్పు అని కాలం తేల్చేయవచ్చుగాక... కానీ కలలుగన్న ఓ కొత్త సమాజం కోసం ఆమె నిబద్ధతను ఎలా తప్పుపట్టగలం..? కుటుంబమంతా ఆ కొత్త సమాజ ఆశల్లో హతమారిపోయిన ఆ త్యాగాన్ని ఎలా తప్పుపట్టగలం..?

.

విశాఖపట్నం ఆంధ్ర జ్యోతి లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు … మొదటి ప్రేమ వివాహం విఫలమైన తర్వాత న్యాయవాది బాలకృష్ణను పెళ్లి చేసుకున్నారు.. ఆయన విశాఖ కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ఎన్ ఐ ఏ ఆయనను కూడా ప్రశ్నించింది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!
  • ఈ వీరుడు తలుచుకుంటే… అసలు భారతం లేదు… కురుక్షేత్రమూ లేదు…
  • రామాయణం చీరలు… అపచారమా..? కళాత్మక భక్తి వ్యక్తీకరణా..?
  • సీన్ కట్ చేస్తే… ఆ పోలీస్ భార్య ఏకంగా కలెక్టర్ అయిపోతుంది…
  • సంస్కారం తప్పిన సాయి మాధవుడు… రైట్ రాయల్ వరలక్ష్మి వివరణ…
  • ప్లీజ్ నమ్మండయ్యా… నాకస్సలు సంబంధం లేదు… నాకేమీ తెలియదు…
  • ఈ వెలుగుమట్ల విధ్వంసం వెనుక చీకటి కథలెన్నో… చెప్పుకోవల్సిందే…
  • మమత నా చెల్లెలు- ఎందుకిలా చేసింది..? హర్టయిన రాష్ట్రపతి ముర్ము..!!
  • రై రై రా రా… పెద్ది శ్రీరామ్‌కు యుద్ధ విధ్వంసాభివందనాలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions