Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నమ్మకాలు – అమ్మకాలు… అసలు ఎవరు ఈ జగ్గీ వాసుదేవుడు…

February 20, 2026 by M S R

.

జగ్గీ వాసుదేవ్‌గా పిలవబడే… స్వీయ ప్రకటిత గురువు తన పాదం ఫోటోను నెట్‌లో 3200 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మకానికి పెట్టిన ఫోటోపై విపరీతమైన విమర్శలు వినిపిస్తున్నాయి నెట్‌లో, సోషల్ మీడియాలో…

ఈషా ఫౌండేషన్ వెబ్‌సైట్ చెక్ చేస్తే, ప్రస్తుతం ఈ ఫోటోలు స్టాక్ లేవనీ, వచ్చాక నోటిఫై చేస్తామని కనిపించింది… నిజంగానే జనం ఎగబడి లక్షల్లో కొని స్టాక్ అయిపోయాయో, జాతీయ స్థాయిలో ట్రోలింగ్ ఎక్కువయ్యేసరికి కావాలనే తాత్కాలికంగా అమ్మకాలు నిలిపేశారో తెలియదు…

Ads

నిరాడంబరంగా, ధర్మప్రచారం చేస్తూ, నిజ సాధువుల్లా బతికిన గురువుల సమాధులను కూడా పూజిస్తాం మన సంప్రదాయ ఆరాధన పద్దతుల్లో… పాదుకలనూ పూజిస్తాం… వాళ్లు బతికిన తీరు పట్ల మన గౌరవం అది… వాళ్లు నడయాడిన చోట్ల ఏదో మనకు తెలియని పాజిటివ్ వైబ్స్ ఉంటాయని మన నమ్మకం… కానీ ఈ జగ్గీ వాసుదేవ్‌కు అంత ఆదర్శనీయ చరిత్ర ఉందా..?

ఇలా మాట్లాడితే ఆయన శిష్యులకు కోపం రావచ్చు… పరమ ఆస్తికులైనా సరే…! ఒకటి మాత్రం నిజం, దేవుడు దేవుడే… మనిషి మనిషే… ఆయనేమీ మహోన్నతుడు కాదు, మహితాత్ముడు, మహిమాన్వితుడు కాదు… ఒక వివాదాస్పద చరిత్ర, వెతికితే నెట్‌లో కూడా బోలెడు కళంకాలు కనిపిస్తాయి… జగదీష్ వాసుదేవ రెడ్డి అలియాస్ జగ్గీ వాసుదేవ్… జన్మస్థలం కడప, దేవునిగడప… కర్మస్థలం కోయంబత్తూరు…

పాదం

సద్గురు జీవితంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఆయన భార్య విజ్జి (విజయకుమారి) మరణం… 1997లో ఆమె “మహాసమాధి” (యోగా ప్రక్రియ ద్వారా ప్రాణాలు వదిలేయడం) చెందినట్టు ఈషా ఫౌండేషన్ ప్రకటించింది… అయితే, అది సహజ మరణం కాదని, ఆమెను హతమార్చారని విజ్జి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు… పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపినప్పటికీ, ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు కొట్టివేయబడింది….

కోయంబత్తూరులోని వెల్లింగిరి పర్వతాల అడుగున ఉన్న ఈషా యోగా కేంద్రం నిర్మాణంపై పర్యావరణ వేత్తలు అనేక ఫిర్యాదులు చేశారు… ఆశ్రమ నిర్మాణం ఏనుగుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తోందని, అటవీ భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారని ఆరోపణలు వచ్చాయి…. కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అవేర్‌నెస్ సంస్థ ఈషా కేంద్రంపై కోర్టులో కేసులు కూడా వేసింది… అయితే, ఈ ఆరోపణలను ఈషా ఫౌండేషన్ ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది…

నదుల పరిరక్షణ కోసం చేపట్టిన ‘కావేరి కాలింగ్’ (Cauvery Calling) ప్రాజెక్టుపై కూడా విమర్శలు వచ్చాయి… పర్యావరణ నిపుణులు ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వాదించారు… ప్రైవేట్ భూముల్లో చెట్లు నాటడానికి ప్రభుత్వం నుండి నిధులు సేకరించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది…

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను సద్గురు ‘బ్రెయిన్ వాష్’ చేసి ఆశ్రమంలో బంధిస్తున్నారని ఆరోపించారు… ఉదాహరణకు, గతంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ తన ఇద్దరు కుమార్తెల విషయంలో ఇలాగే ఆరోపించాడు… కానీ ఆ యువతులు తాము స్వచ్ఛందంగానే అక్కడ ఉంటున్నామని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు…

తను చెప్పేవి కూడా కొన్నిసార్లు అశాస్త్రీయంగా నవ్వు పుట్టిస్తుంటాయి, ఉదాహరణకు నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది వంటివి… ఈషా ఫౌండేషన్ లాభాపేక్ష లేని సంస్థ (Non-profit organization) గా నమోదైనప్పటికీ, దాని ఆర్థిక విస్తృతి, ఆస్తుల విలువ చాలా పెద్దది… ఫౌండేషన్ ద్వారా జరిగే టర్నోవర్, ఆస్తుల విలువ గణనీయంగా ఉంటుంది…

అమెరికాలోని టేనస్సీలో ఉన్న ‘ఈషా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్’ ఇతర విభాగాల నివేదికల ప్రకారం, 2024 నాటికి ఈషా ఫౌండేషన్ అమెరికా విభాగానికి సుమారు $191 మిలియన్ల (దాదాపు ₹1,600 కోట్లు) విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది…

కోయంబత్తూరులోని ప్రధాన ఆశ్రమం, ఆదియోగి విగ్రహం, చిక్కబళ్లాపూర్ ఆశ్రమం, ఇతర భూములు కలిపి వేల కోట్ల విలువ కలిగి ఉంటాయి… ఈషా ఫౌండేషన్ ఆదాయం ప్రధానంగా విరాళాలు, యోగా ప్రోగ్రామ్ ఫీజులు , ‘ఈషా లైఫ్’ ఉత్పత్తుల విక్రయాల ద్వారా వస్తుంది… ఈషా ఫౌండేషన్ (USA) 2024 నాటికి వార్షిక ఆదాయం సుమారు $48.7 మిలియన్లు…

ఈషా లైఫ్ (Isha Life)… యోగా దుస్తులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఇతర వస్తువులను విక్రయించే ‘ఈషా లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్’ 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు అంచనా…



ఆదాయ వనరులు (Major Revenue Streams) 

  • యోగా ప్రోగ్రామ్స్: ఇన్నర్ ఇంజనీరింగ్ వంటి పెయిడ్ కోర్సులు. అడ్డగోలు ప్యాకేజీలు.

  • ఈషా లైఫ్: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు.

  • ఈవెంట్స్: మహాశివరాత్రి వంటి భారీ వేడుకల ద్వారా వచ్చే విరాళాలు, స్పాన్సర్‌షిప్‌లు.

  • సోషల్ మీడియా: సద్గురు యూట్యూబ్ ఛానెల్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా ఉంటుంది…



యూనివర్శిటీలో చదువు పూర్తయ్యాక, ఆయన ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా ఎదిగాడు… ఒక చిన్న షెడ్డుతో మొదలుపెట్టి పెద్ద పౌల్ట్రీ ఫామ్‌ను నడిపాడు… సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా నడిపేవాడు… గ్రానైట్ వ్యాపారం కూడా..! మెల్లిగా మైసూరుకు వ్యాపారాన్ని విస్తరించాడు…

సెప్టెంబర్ 23, 1982న మైసూర్‌లోని చాముండి హిల్స్ మీద ఒక రాయిపై కూర్చుని ఉన్నప్పుడు ఏదో జ్ఞానసిద్ది కలిగినట్టు చెప్పుకుంటాడు… 1983లో మొదటి ఫ్రీ యోగా క్లాసు ప్రారంభించినా, 1992 లో కోయంబత్తూరులోని వెల్లింగిరి పర్వతాల వద్ద ఈషా యోగా కేంద్రాన్ని స్టార్ట్ చేసి, ‘సద్గురు’ పేరుతో ఇక తన ఆధ్యాత్మిక, ఆర్థిక సామ్రాజ్యాన్ని పెంచుతూ పోయాడు…



ఆయన భార్య మొదట్లో బ్యాంకు ఉద్యోగి… ఈయనకు ఒక కూతురు, పేరు రాధే… పైకి అందరికీ నిరాడంబరత, సన్యాసం మాటలు చెబుతూ… తన కూతురి పెళ్లి మాత్రం ఇదే ఫౌండేషన్ ఈషా ఆశ్రమంలోనే అత్యంత ఘనంంగా జరిపించాడు… ఆమె భరతనాట్యం కళాకారిణి, భర్త కర్నాటక సంగీత విద్వాంసుడు… ఆ దంపతులు పెద్దగా ఈషా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు… వాళ్ల బతుకులు వాళ్లవి…

ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… ఆయన ఓ ఆధ్యాత్మిక వ్యాపారి… కస్టమర్లు, అనగా శిష్యులు, నమ్మేవాళ్లు లక్షల్లో ఉన్నారు… కానీ ఏకంగా తననే దైవసమానుడిని చేయడం, కాదు, దైవాన్నే చేయడం, మరీ తన పాదాల్ని భక్తిమార్గాలుగా ప్రచారం చేయడం, ఆ నమ్మకాల్ని అమ్మడం ఎందుకోగానీ… నచ్చడం లేదు..!!



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేదాంత దేశికులు… చిన జియ్యరుడికి అసలు తెలుసో లేదో…
  • కుదరదు..! ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఇప్పుడైతే అసాధ్యం..!!
  • నమ్మకాలు – అమ్మకాలు… అసలు ఎవరు ఈ జగ్గీ వాసుదేవుడు…
  • గుడ్ గోయింగ్… హైకమాండ్ సర్టిఫికెట్… రేవంత్ రెడ్డికి ఓ బూస్టప్…
  • హేమిటో… ఆ వయస్సులో వైవిజయతో స్టెప్పులు- రమ్యకృష్ణతో రొమాన్స్…
  • తెలంగాణ పోలీసులు భేష్… కానీ ఈ దరిద్ర అన్వేషుడి కథ ముగియలేదు…
  • చెత్తా ప్రచారాల్ని నమ్మకండి… ఏ బియ్యం బెటరో అర్థం చేసుకొండి…
  • పదేళ్లు వెనక్కి పోతారట… నమ్మితే పదేళ్లు ముందుకు వెళ్లిపోతారు…
  • అయ్యో భగవంతుడా… ఆ ముగ్గురినీ పెంచి పోషించేదెలా మాస్టారూ…
  • సర్వపిండి..! చివరకు దీన్ని కూడా భ్రష్టుపట్టించేస్తున్నారు… నిజం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions