.
Subramanyam Dogiparthi … జయప్రద అభిమానులకు బాగా నచ్చే సినిమా ఈ జస్టిస్ రుద్రమదేవి . ఆమె జడ్జి సీట్లో కూర్చున్నా మనకు అడవిరాముడు , యమగోల , సాగరసంగమం వంటి సినిమాల్లో జయప్రదే గుర్తుకొస్తూ ఉంటుంది . అంత గట్టి గ్లామర్ కదా ఆమెది ! మహిళా జడ్జీలుగా శారద , శ్రీవిద్య వంటి వారు బాగానే సెట్టయ్యారు .
నటుడు , రచయిత ఓంకార్ ఈ సినిమాకు చాలా బాధ్యతలు వహించాడు . కధ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , నటన , చాలా చేసాడు . కుర్రా పాండురంగారావు దర్శకుడు . నిర్మాత బలరాం . రాజ్ కోటి సంగీత దర్శకుడు . పాటలు హిట్ కాలేదు కానీ బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది .
Ads
టూకీగా కధ ఏంటంటే : మామూలు కధే . ఓ ఊళ్ళో చాలా ఊళ్ళల్లో లాగానే ఓ స్ట్రీట్ రౌడీ యంపి అవుతాడు . యంపి అయ్యాక ఊరక కూర్చోడు కదా ! ఇష్టారాజ్యంగా మర్డర్లు , మానభంగాలు చేస్తుంటాడు . ఆ వరుసలో జడ్జి గారు కూడా బాధితురాలే .
ఆయనకో నమ్మిన బంటు (అ)న్యాయవాది ఉంటాడు . రౌడీ యంపి చేసే దుర్మార్గాల నుండి యంపిని రక్షిస్తూ ఉంటాడు . జడ్జి గారి తమ్ముడు నరేష్ కోట కూతురి శాంతిప్రియని ప్రేమిస్తాడు . జడ్జి గారి చెల్లెలు శ్రీలత ఓ కార్ డ్రైవింగ్ స్కూల్ ఓనర్ ఆహుతి ప్రసాదుని ప్రేమిస్తుంది .
రౌడీ యంపి బాధితులందరూ ఒకటై అతన్ని చట్టానికి అప్పచెప్పాలని చూస్తారు . యంపి గారా మజాకా ! అన్ని సినిమాలలో లాగానే సత్వర న్యాయసూత్రాల ప్రకారం ఒక బాధితుడు యంపిని చంపేస్తాడు . పోతూపోతూ యంపి జడ్జి గారిని చంపి సినిమాను దుఃఖాంతం చేస్తాడు . జయప్రదని చంపటం ఏంటి ? అన్యాయం . ఇదండీ స్టోరీ .
జడ్జిగా జయప్రద , ఆమె తమ్ముడిగా నరేష్ , చెల్లెలుగా శ్రీలత , తల్లిగా అన్నపూర్ణమ్మ , ప్రియుడిగా శరత్ బాబు నటించారు . రౌడీ యంపిగా చలపతిరావుని బదులు కోట శ్రీనివాసరావుని పెట్టుకుని ; లాయరుగా చలపతిరావుని పెట్టుకుని ఉంటే బాగుండేదేమో !
నరేష్ ప్రేయసిగా శాంతిప్రియ , డ్రైవింగ్ స్కూల్ ఓనరుగా ఆహుతి ప్రసాద్ , ఇతర పాత్రల్లో ఓంకార్ , జగ్గారావు , పి జె శర్మ , వరలక్ష్మి , రావి కొండలరావు , మాస్టర్ రాజేష్ ప్రభృతులు నటించారు .
ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకో ధర్మ సందేహం వచ్చింది . Not before me అని జడ్జీలు చాలా విస్తృతంగా అంటుంటారు కదా ! ఈ సినిమాలో వాళ్ళ కుటుంబ సభ్యుల కేసులన్నీ ఆమె ముందుకే ఏల రావలె !? వచ్చెనుపో ఆమె ఏల తీర్పులను ఇవ్వవలె ! వాళ్ళ డబ్బులు వాళ్ళిష్టం .
సినిమా యూట్యూబులో ఉంది . జయప్రద అందాభిమానులు ట్రై చేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article