.
“సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం;
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం.”
- భారతీయతకు సంబంధించినంత వరకూ, సనాతనానికి సంబంధించినంత వరకూ ఆదిశంకరాచార్యుల వారే ప్రధాన గురువు. సనాతన గురు పరంపరకు కీలకం శంకరుల వారే.
అద్వైత గురు పరంపర నారాయణుడి నుంచి మొదలై బ్రహ్మ, వసిష్ఠ, శక్తి, పరాశరుడు, వేద వ్యాసుడు, శుకుడు, గౌడపాదులు, గోవిందులు, ఆదిశంకరులు, ఆదిశంకరుల నలుగురు శిష్యులైన పద్మపాద, హస్తామలక, తోటక, సురేశ్వరాచార్య వీళ్లతో సాగుతుంది. ఈ గురువులందరికీ ఆది గురువు సదాశివుడు. అందుకే ‘సదాశివ సమారంభాం’ అన్నారు; ఆదిశంకరులు కీలకం కాబట్టే ‘శంకరాచార్య మధ్యమాం’ అన్నారు.
Ads
అద్వైత తొలి గురువైన నారాయణుణ్ణి ఆ అద్వైతం నుంచి ఎందుకు వేరు చేశారు, ఎందుకు వేరు చేస్తున్నారు ఇవాళ్టి కొందరు వక్ర వైష్ణవులు? (వక్ర వైష్ణవులు అంటున్నప్పుడు నిజ వైష్ణవులు కారేమో అని సూచ్యార్థం) దేశ ప్రధాన, మౌలిక, ముఖ్య గురు పరంపరలో రామానుజాచార్యులు లేరు! ఈ విషయం ఈ వక్ర వైష్ణవులు ఎందుకు గుర్తించలేదు? రామానుజుల వారు స్వయంగా గోవిందులను, శంకరులను ఆరాధించారని ఈ వక్ర వైష్ణవులు ఎందుకు తెలుసుకోలేదు?
గత కొన్ని శతాబ్దులుగా రామానుజల వారి స్ఫూర్తికి విరుద్ధంగా వక్ర వైష్ణవులు సనాతనానికి హాని చేస్తున్నారు! ఆ వరుసలో ఇవాళ తెలుగు నాట చిన్న జీయర్ వైదికం లేదా సనాతనానికి తలనొప్పి అయినట్టు తెలుస్తోంది.
కొంత కాలంగా చిన్న జీయర్ అద్వైతం గురించి, శంకరాచార్యుల గురించి, మహా భారత రామాయణాల గురించి, శివుడి గురించి అసందర్భ, అసమంజస, అర్థ రహిత, అనవసర, అపాయకర పేలాపన చేస్తూండడం మనం గమనిస్తున్నాం. చిన్న జీయర్ కొన్ని గొప్ప పనులు చేశారు; చేస్తున్నారు. అందుకు ఆయనకు శిరసా నమామి.
క్రైస్తవ మత మార్పిడి మాఫిఅ పన్నాగాల్ని భగ్నం చెయ్యడం, కొన్ని వేద శాఖల్ని పునరుద్ధరించడం, సేవా కార్యక్రమాల నిర్వహణ వీటి పరంగా చిన్న జీయర్ గారికి నమస్సులు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ప్రవర్తన, మాటలు హైందవానికి కడు హానికరం.
దేశాన్ని, హైందవ సమాజాన్ని ధ్వంసం చేసెయ్యాలని, కబళించెయ్యాలని విదేశీ మత మాఫిఅలు, మిషనరీలు ముమ్మరంగా, మూకుమ్మడిగా ఉద్ధృతంగా పనిచేస్తున్న ఈ తరుణంలో చిన్న జీయర్ తెలివిడి, విజ్ఞత, ఆలోచన, సంయమనం లేని మాటలు, చేతలు హైందవానికి, దేశానికి అత్యంత అపాయం. చిన్న జీయర్ మాటలు, చేతలు అన్ని సందర్భాల్లోనూ సరైనవి, చదువుకు సంబంధించినవి కావు.
- చిన్న జీయర్ ఎవరు? చిన్న జీయర్ ఇవాళ్టి వైష్ణవంలోని ‘తెన్‌గలై’ సంప్రదాయానికి సంబంధించిన ఒక పీఠాధిపతి. చిన్న జీయర్ పీఠం చారిత్రికమైంది కాదు. అహోబిలం ఒక సాంప్రదాయిక, చారిత్రిక వైష్ణవ పీఠం ఔతుంది కాని చిన్న జీయర్ పీఠం ఏ ప్రాముఖ్యతా ఉన్న పీఠం కాదు! ఇవాళ్టి దక్షిణాది వైష్ణవంలో ‘వడగలై’, ‘తెన్‌గలై’ అన్నవి రెండు ప్రధాన శాఖలు. వాటిల్లో ఒకటైన ‘తెన్‌గలై’ సంప్రదాయానికి సంబంధించిన చిన్న జీయర్ గురువు గారు స్థాపించిన పీఠం అనబడుతున్నదానికి ప్రస్తుత అధిపతి చిన్న జీయర్.
ప్రధానంగా, ప్రగాఢంగా వైష్ణవం అంటే దక్షిణాది వైష్ణవమే. ఆళ్ష్వారుల నుంచి దక్షిణాదిలో వైష్ణవానికి ప్రస్తావనన ఉంది అని అనుకోవచ్చు. ఆళ్ష్వారుల వైష్ణవం ఇవాళ్టి వైష్ణవానికి ఆది లేదా మూలం కాదు. ఆళ్ష్వారుల వైష్ణవం పూర్తిగా విష్ణు భక్తి మాత్రమే! ఇవాళ మనకు తెలిసిన దక్షిణ భారత ప్రదేశ వైష్ణవంలో రామానుజులు ప్రధానం లేదా కీలకం. రామానుజుల వారికి ముందు, తరువాత అని దక్షిణాది వైష్ణవం పరిగణించబడుతుంది.
- ఇస్కాన్ వంటి ఉత్తరాది కృష్ణ ప్రేమికుల్లో రామానుజుచార్యుల వారికి చోటు లేదు; రాదు. రామానంద అనే ఒకరు కబీర్ గురువు. దక్షిణాది రామానుజాచార్యులకు ఉత్తరాదిలో ఆ రామానంద సమానమైనటువంటి వారు. రామానుజులకు ఆ రామానంద సమకాలికులు కారు.
రామానుజులు జన్మతః వైష్ణవుడు కాదు! వారు జన్మతః స్మార్తుడు (తెలుగులో వైదికుడు). స్మార్తులను తమిళ్ష్‌లో అయ్యర్ అంటారు. రామానుజుల తిరుమల వాసం కాలంలో వారిని ‘ఆర్య గారు’ అనడమే అయ్యగారు అయింది. అదే తమిళ్ష్‌లో ‘అయ్యంగార్’ అయింది. (అయ్యంగార్ తమిళ్ష్ పదం కాదు)
తమిళ్ష్‌నాడు, మదురాన్దగమ్లో ఉన్న కోదండరామ ఆలయంలో రామానుజుల వారికి వారి గురువు పెరియనమ్బి శంఖు చక్రాల్ని వేసి సాంప్రదాయికంగా వైష్ణవంలోకి నడిపించారు. ఈ పెరియనమ్బి బ్రాహ్మణుడు కాదు! ‘అబ్రాహ్మణ’ గురువువల్ల వైష్ణవుడయ్యారు రామానుజులు! ఇలాంటి సత్యాలు మన కళ్లను మన బుద్ధిని తెఱిపించి మనల్ని బాగు చెయ్యాలి.
జన్మతః స్మార్తుడైన రామానుజులు వైష్ణవ సంప్రదాయ పంచ సంస్కార దీక్షను తీసుకుని వైష్ణవుడు అయ్యారు. రామానుజుల గురువు పెరియనమ్బికి పూర్వం ముక్కాల్ నమ్బి, ఆళవన్దార్ వంటి వారి మీదుగా వైష్ణవ గురు పరంపర శ్రీమత్ నాదమునిగళ్ వఱకూ వెళుతుంది. ఈ నాదమునిగళ్ గారిని ఈనాటి వైష్ణవానికి ఆదిగా తీసుకోవచ్చు.
రామానుజుల తరువాత ఈనాటి వైష్ణవ సంప్రదాయాలకు ఊపు వచ్చింది. రామానుజుల తరువాత వైష్ణవంలో వేదాంత దేశికులు ప్రధానమైన, మహోన్నతమైన గురువు. అటు తరువాత మనవాళ మామునిగళ్ కాలంలో వడగలై అంటే దేశిక సంప్రదాయమూ, తెన్‌గలై అంటే తెన్ ఆచార్య సంప్రదాయమూ వేరుపడి స్థిరపడ్డాయి.
ఇవాళ్టి వైష్ణవ సంప్రదాయాలు రామానుజుల కాలానికి లేవు. ఆళ్ష్వారులు ఇవాళ్టి వైష్ణవ విధానానికి చెందిన వారు కాదు. రామానుజుల తరువాత 200 యేళ్లకు వేదాంత దేశికుల కాలానికి సౌష్టవ వైష్ణవానికి తొలి దశ లేదా ప్రధాన దశ రూపొందింది.
- వడగలై, తెన్‌గలై సంప్రదాయాల్లో నుదుటిపై పెట్టుకునే నామాలలో తేడాలున్నాయి. వడగలై నామం U. ఈ Uకి కింద గీత పెడితే తెన్‌గలై నామం అవుతుంది. మాధవా, కేశవా అంటూ నామాలు చెప్పుకుంటూ గీతలు గీసుకోవడంవల్ల ఈ ముద్రలకు నామాలు అని అనడం వచ్చింది.
ఇవాళున్న ఈ వైష్ణవ నామాలు రామానుజుల కాలంలో లేవు. రామానుజులు ఈ నామాల్ని పెట్టుకున్నట్టు లేదు. వారు శ్రీ చందనంతో ఊర్ధ్వ పుండరాన్ని పెట్టుకున్నారని తెలియవస్తోంది. వడగలై నామం వేదాంత దేశికర్తోనూ, తెన్‌గలై నామం మనవాళ మామునిగళ్తోనూ మొదలయ్యాయి. ఉత్తరాది వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చందనంతో ఊర్ధ్వ పుండరమే ఉంది. ఇస్కాన్ వాళ్లు కూడా ఈ నామాన్నే తీసుకున్నారు.
ఇవాళ రామానుజుల విగ్రహాలకు, చిత్రాలకు ‘తెన్‌గలై నామం’ కనిపిస్తోంది. అది విపరీతమైన దోషం. చిన్న జీయర్ రామానుజులకు తెన్‌గలై నామాన్నే పెట్టారు. ఇది విపరీత దోషం! రామానుజులకు చిన్న జీయర్ చేసిన పెను ద్రోహం. ఏవో పేలాపనలు చేస్తున్న చిన్న జీయర్ అత్యవసరంగా తన దోషాల్ని సరిచేసుకోవాలి.
తమిళ్ష్‌నాడు, కర్ణాటక వైష్ణవులు రామానుజులకు ఆపాదించిన తెన్‌గలై నామాన్ని హర్షించడం లేదు. అహోబిలం జీయర్ వంటి వారు కూడా అంగీకరించ లేదు. చిన్న జీయర్ తాను పెట్టుకుంటున్న నామం తెన్‌గలై నామమే. అది రామానుజల ఆచరణ కానే కాదు.
‘వైష్ణవుల్లో తెన్‌గలై వాళ్లకన్నా వడగలై వాళ్లు శ్రేష్ఠం!’ ఇవాళ్టికీ ఇది స్థిరం. వడగలై వైష్ణవులు తెన్‌గలై వాళ్లను అన్ని రకాలుగానూ నాసిరకంగానే పరిగణిస్తారు. తెన్‌గలై వాళ్లకు వడగలై వాళ్లు పిల్లను ఇవ్వరు, తీసుకోరు ఇవాళ్టికీ. ‘తెన్‌గలై వాళ్లలో పలువురు అసలు బ్రాహ్మణులే కారు’ అన్న అధ్యయనం ప్రబలంగా ఉంది.
తెన్‌గలై శాఖకు మూలమైన మనవాళ మామునిగళ్ గారి బ్రాహ్మణత్వంలోనే సందిగ్ధత ఉంది. మనవాళ మునిగళ్ గారిని ‘ఏరి ఇఱఙ్గుమ్ (ఇరంగుం) తిరుమేని’ అని కొందరు పరిశీలకులు చెబుతారు. ఏరి ఇఱఙ్గుమ్ తిరుమేని అంటే చెట్లు ఎక్కీ దిగే (ఈడిగ) వైష్ణవుడు అని అర్థం. మనవాళ మామునిగళ్ బ్రాహ్మణుడే అని కొందరు చెబుతారు.
- మనవాళ మునిగళ్ పలువురు శూద్రులకు ఉపనయనం చేసి, సమాశ్రయం ఇచ్చి వాళ్లను బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని చేసేశారు. ఆ వైష్ణవులే తెన్‌గలై వైష్ణవుల్లో అత్యధికంగా కలిసిపోయారు. అందువల్లే వడగలై వైష్ణవులు తెన్‌గలై వైష్ణవుల్ని నాసిరకంగా పరిగణిస్తారు. చిన్న జీయర్ తెన్‌గలై వైష్ణవుడు! కాబట్టి చిన్న జీయర్ బ్రాహ్మణుడు కాకపోయే అవకాశం ఉంది! చిన్న జీయర్ బ్రాహ్మణుడేనా?
మనవాళ మామునిగళ్ కాలంలో అప్పటి శూద్రులను బ్రాహ్మణ వైష్ణవుల్ని చేసే క్రమంలో సమాశ్రయం ఇస్తున్న ఆచార్యుల గోత్రాలు ఆ శూద్రులకు ఇవ్వబ్డడాయి. కాబట్టి అప్పట్లో బ్రాహ్మణ వైష్ణవులైన శూద్రులకు బ్రాహ్మణ గోత్రాలు వచ్చాయి. చిన్న జీయర్, కొందరు తెన్‌గలై వైష్ణవులు గోత్రం ఆధారంగా తమ బ్రాహ్మణ్యాన్ని నిరూపించుకోలేకపోవచ్చు.
తమిళ్ష్‌నాడు, కర్ణాటక సాంప్రదాయిక వైష్ణవుల్లో చిన్న జీయర్‌కు ఏ మాత్రమూ, ఎంత మాత్రమూ పరిగణన లేదు! (వైష్ణవం అంటేనే తమిళ్ష్ మూలంగా, ఆధారంగా కలిగినది అనే.) ఆ చిన్న జీయర్ అద్వైతంపై, మహాశివుడిపై, శైవంపై, స్మార్తంపై అవాకులు చవాకులు పేలడం గర్హనీయం. ‘శివ దూషణ, శంకరుల దూషణ చెయ్యకూడదు’ అని ప్రామాణిక వైష్ణవ పీఠాల, పీఠాధిపతుల ఉవాచ. ఆ మాటను చిన్న జీయర్ ఎందుకు పాటించడం లేదు? అంటే చిన్న జీయర్ ప్రామాణిక వైష్ణవుడు కాదనేనా?
భారతీయ సనాతనంలో అధిక భాగం, అత్యంత ప్రధాన భాగం శాక్తమే! శైవమే! శాక్తం, శైవం రెండూ విడదీయలేని ద్వయం; ఒకే నాణానికి రెండు పార్శ్వాలు. ఈ వైష్ణవం మధ్యలో వచ్చింది. 11- 12 శతాబ్దుల్లో రామానుజులతో, రామానుజుల తరువాత వచ్చిందే ప్రస్తుత వైష్ణవం.
అంతకు ముందు భారతావని శాక్తం, శైవం మయమే. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి నుంచి పైకి పోతూంటే మన సనాతన దైవిక, ఆధ్యాత్మిక మహాపురుషులందరూ శాక్తం, శైవం వారే! భారత ప్రదేశ తంత్రం పూర్తిగా శాక్తం, శైవం, భైరవం, రుద్రం మయమే. సుదర్శన శతకం వంటి వైష్ణవ రచనలు పిదప కాలంలో వచ్చిన రచనలు.
‘మహాభారతంలో ద్రౌపది నారాయణ మంత్రాన్ని ఆశ్రయించింది’ అని లోగడ తన ‘కృతక వైష్ణవం’తో పల్లదనాన్ని ప్రదర్శించిన చిన్న జీయర్ (చిన్న జీయర్ నిజ వైష్ణవుడు అని తమిళ్ష్‌నాడు
వైష్ణవులు సమ్మతించరు) ఆ మహాభారతంలోని శాంతి పర్వంలో శివ సహస్రనామాలు ఉద్ఘాటించబడ్డాయి అనీ, ఆ మహాభారతంలోనే కిరాతార్జునీయం (కిరాతుడు= శివుడు) కూడా ఉంది అనీ చూడలేని తన అంధత్వాన్ని తనే వ్యక్తపఱుచుకున్నారు.
వాస్తవానికి చిన్న జీయర్ వైష్ణవ అవగాహన ఏ మాత్రం? ఆణ్డాళ్ ‘తిరుప్పావై’ను తెలుగులో చిన్న జీయర్ మాటల్లో విన్నాను. 1953 (పరవస్తు వేంకట రంగాచార్యులు చేసిన తొలి అనువాదం) నుంచీ
తెలుగులో వస్తున్న దోష తిరుప్పావైనే మఱింత దోషంతో కలిపి చిన్న జీయర్ చెప్పారు. ఒక సామాన్యుణ్ణి, పామరుణ్ణి అయిన నేను ఆ తిరుప్పావైను నిజ భక్తితో, సరైన వైష్ణవంతో తెలుగులోకి తెచ్చాను. నేను కృతక వైష్ణవుణ్ణి కాకపోవడం వల్ల చిన్న జీయర్ కన్నా నేను తిరుప్పావైను సరిగ్గా తెలుగులోకి తీసుకురాగలిగానేమో?
చిన్న జీయర్ పదేపదే శంకరాచార్యులు, స్మార్తులు, అద్వైతులు అంటూ తన పల్లదనాన్ని బహిరంగ వేదికలపై వెళ్లగక్కుతూండడం తెలిసిందే. ఆ క్రమంలో ఆదిశంకరాచార్య స్థాపించిన చతురామ్నాయ శంకర మఠాలు శంకరులు స్థాపించినవి కావనీ ఎవడో, ఇంకెవడో (చిన్న జీయర్ దుష్ప్రభావంతో ఈ ఎవడో, ఇంకెవడో అన్న పదాలు వాడాను క్షమించగలరు… నేను చిన్న జీయర్ స్థాయిలో ఆ మాటలు అనుండకూడదు కదా?) 12 లేదా 13 శతాబ్దిలో ఆ మఠాల్ని స్థాపించారు అనీ చిన జీయర్ అపసవ్యం మాటలు అన్నారు. ఆయన చదువు లేక ఆ మాటలు అన్నారా? బుద్ధి మాంద్యంతో అన్నారా? శంకరులపై, అద్వైతంపై కృతక వైష్ణవ జనిత విద్వేషంతో అన్నారా? ఈ ప్రశ్నలకు బహుశా ఆయనకే కూడా సమాధానాలు తెలిసుండకపోవచ్చు.
ఆదిశంకరుల కాలం సామాన్య శకం 8వ శతాబ్ది కాదు. సామాన్య శకం 2000 తరువాతి అంతర్జాతీయ పరిశీలనలు వారి జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజేస్తున్నాయి. 1916లోనే వారి కాలం సా.శ. 509 అని తెలియజేసే పరిశీలనలు తెలుగులోనే ఉన్నాయి. శ్రీమాన్ కోట వెంకటాచలం (వీరూ ఒక పీఠాధిపతే) ఆదిశంకరుల కాలం 509 అనే నిరూపించారు.
ఆది శంకరాచార్య కాలం సామాన్య శకానికి పూర్వం (B.C.E.) 510 అని William Walker Atkinson 1920ల లోనే తన The Philosophies And Religions Of India పుస్తకంలో ప్రపంచానికి తెలియజేశాడు. సామాన్య శకానికి పూర్వం (BCE) 509లో శంకరులు పుట్టారు అని ప్రధానమైన శంకర మఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ, సరైన అధ్యయనం ద్వారానూ తెలియవస్తోంది.
చతురామ్నాయ శంకర మఠాలను స్వయంగా ఆదిశంకరాచార్యుల వారే స్థాపించారు. వారి ప్రత్యక్ష
శిష్యులైన పద్మపాద, హస్తామలక, తోటక, సురేశ్వరాచార్య ఈ నలుగురినీ శంకరులే వాటికి పీఠాధిపతులుగా నియమించారు. అంటే ఆ మఠాలు లేదా పీఠాలు శంకరుల కాలంలోనివే అనే కదా? సామాన్య శకం 12 లేదా 13 శతాబ్దుల్లో ఎవడో చెబితే ఎవడో (క్షమించండి… చిన్న జీయర్ దుష్ప్రభావం తప్పడం లేదు) ఆ మఠాల్ని స్థాపించడం ఏమిటి? ఇది విదూషకత్వం అవదా? కంచి శంకర మఠంతో సహా శంకర మఠాలన్నీ ‘నారాయణ స్మృతి’ అనడాన్ని, ‘హరి ఓం’ అనడాన్ని పాటిస్తాయి. అద్వైతంలో ఆదిశంకరత్వంలో విష్ణు త్యజనం, విద్వేషం లేవు; ఉండవు. ఈ కృతక వైష్ణవులకు శివ ద్వేషం, శివ నింద ఎలా, ఎందుకు అలవాటయ్యాయి?
అసలు చిన్న జీయర్ ఎందుకు పదేపదే ఇలాంటి పేలాపనలు చేస్తున్నారు? ఆయన తనను సనాతనుణ్ణి లేదా వైదిక వ్యక్తిని లేదా హిందువును అని అనుకోవడం లేదా? లేదా తన కృతక వైష్ణవం సనాతనానికి, అద్వైతానికి విరుద్ధమైన ఇంకేదో అని అనుకుంటున్నారా? రామానుజులు విశిష్ట ‘అద్వైతం’ అనే కదా అన్నారు? తమ సిద్ధాంత గుర్తింపు కోసం అద్వైతంకు విశిష్ట అని చేర్పు చేశారు అంతే. రామానుజులు అద్వైతానికి వ్యతిరేకం కాదు.
చిన్న జీయర్, జీయర్ వంటి వారికి సనాతనంలో ఏ ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాసంగికత లేవు, ఉండవు అనీ, చిన్న జీయర్ సనాతనం లేదా హైందవానికి ప్రతినిధి కానే కాదు అన్నది తెలివిడి. తన పేలాపనల వల్లా, ప్రవర్తన వల్లా తాను హైందవానికి చేస్తున్న హానిని ఒక క్షేత్ర వాస్తవంగా చిన్న జీయర్ స్వయంగా తెలుసుకోవాలి.
హైందవ వ్యతిరేక శక్తులు హైందవాన్ని, దేశాన్ని ధ్వంసం చేసేయ్యాలని వికృత ప్రయత్నాలు చేస్తున్న ఈ విపత్కర కాలంలో చిన జీయర్ తన అసంబద్ధ, అసమంజస, అసత్య, అనర్థదాయక, పేలాపనలు, ప్రవర్తనతో హైందవ మూలమైన అద్వైతానికి, హైందవానికి ఏ హాని చెయ్యకుండా ఇకనైనా చిత్త స్వాధీనంతో, చింతనా శ్రేష్ఠతతో మెలగాలని మనసా, వాచా, కోరుకుంటున్నాను.
ఆదిశంకరాచార్యుల వారే అద్వైతాన్ని స్థిరీకరించకపోతే, సంస్థాపించకపోతే, వ్యాపింపజెయ్యకపోతే రామానుజుల విశిష్ట అద్వైతం ఉండేదా? రామానుజుల నాటికి వైదికత్వం అన్నదే విలసిల్లుతూండేదా? శంకరులు అన్న ఒక మహా ప్రవాహంలోని ఒక చక్కటి పాయ మాత్రమే రామానుజులు.
- రామానుజులే లేకపోతే ఇవాళ్టి వైష్ణవం ఉండేదా? రామానుజులే లేకపోతే మనవాళ మామునిగళ్ వైష్ణవుడయ్యే వారా? మనవాళ మామునిగళ్ లేకపోతే తెన్‌గలై వైష్ణవం ఉండేదా? తెన్‌గలై వైష్ణవం లేకపోతే ఈ చిన్న జీయర్ ఒక స్టెనో జీవితం మాత్రమే గడిపేవారు కదా?!
చిన్న జీయర్ ఆదిశంకరుల వారి గురించి, అద్వైతం గురించి, శివుడి గురించి అనర్హ , అజ్ఞాన పేలాపన చెయ్యడం ఏమౌతుంది? రామానుజులు, వేదాంత దేశికులు శ్రేష్ఠ వైష్ణవులు. వారు ఈ చిన్న జీయర్‌కు ఎందుకు ఆదర్శం, మార్గదర్శకం కాలేదు? తన మాటలతో, ప్రవర్తనతో రామానుజుల స్ఫూర్తికి, వైష్ణవానికి చిన్న జీయర్ కళంకం, భారం, అవాంఛనీయం, వర్జనీయం అయిపోయారా? చిన్న జీయర్ హైందవానికే వర్జనీయమా?
‘సనాతన స్ఫూర్తిని సంస్థాపించి మన భారతావని మనుగడకు, మన వైదిక జీవనానికి ఆలంబన అయింది, ఎప్పటికీ ఆలంబనం అయ్యేది ఆదిశంకరాచార్యుల వారే’ అన్న సార్వకాలిక జ్ఞానంతో, సదాశివుడు ఆది గురువు, ఆదిశంకరులు ఆదర్శనీయమైన గురువు అన్న నిజ సనాతన స్పృహతో చిన జీయర్ వంటి వాళ్లూ, మనమూ మన భారతీయతా జీవనాలను సాగించాలి. తథాస్తు.
రోచిష్మాన్
9444012279
Share this Article