.
Bhavanarayana Thota ….. ఒక వార్త ఆపటానికి ఇంత ప్రయాసా? ఎవరైనా ఒక సమాచారం జనానికి తెలియకూడదనుకుంటే అదే ‘వార్త’ అంటారు. వార్తకున్న అనేక నిర్వచనాల్లో ఇదీ ఒకటి. అలా ఏదైనా ఒక విషయాన్ని కప్పిపుచ్చాలని, జనానికి తెలియకుండా చూడాలని గట్టిగా అనుకుంటే ఆపటానికి రకరకాల దారులు వెతుక్కుంటారు.
వీలైతే రిపోర్టర్ కు నచ్చజెబుతారు. కుదరకపోతే ఎవరితోనైనా చెప్పిస్తారు. అప్పుడు కూడా సాధ్యం కాకపోతే రిపోర్టర్ ను భయపెట్టటానికో, డబ్బుతో కొనటానికో ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులేవీ పనిచేయకపోతే పై స్థాయిలో ఉండేవాళ్ళతో మాట్లాడతారు. రిపోర్టర్ మీద ఎడిటర్ కు ఫిర్యాదు చేయటమో, లేదా నచ్చజెప్పే ప్రయత్నమో చేస్తారు.
Ads
అయితే, ఇవన్నీ ఇప్పుడు చాలా పాత పద్ధతులైపోయాయి. నేరుగా యజమానితో సంబంధాలు పెట్టుకుంటే సరిపోతుందనే అభిప్రాయం వచ్చేసింది. కానీ యజమాని కూడా నిస్సహాయంగా మారిపోయి వార్తను ఆపలేకపోయే సందర్భాలుంటాయా?
*****
2003 ఏప్రిల్ ఆఖరులో అనుకుంటా. ఒకరోజు మా తిరుపతి రిపోర్టర్ మునిరాజు ఫోన్ చేశాడు. తిరుమలలో ఇళ్ళు కూల్చివేయటానికి పెద్ద సంఖ్యలో తిరుపతి నుంచి బుల్డోజర్లు కొండమీదికి బయలుదేరుతున్నాయన్నది ఆ ఫోన్ సారాశం.
ఈ విషయం మీడియాలో ఎవరికీ తెలియదని తను వెంటనే బయల్దేరి వెళుతున్నానన్నాడు. అలా చానల్ చీఫ్ ఎడిటర్ గా ఉన్న నన్ను అలర్ట్ చేసి బయలుదేరాడు. అప్పట్లో ప్రత్యేకంగా కెమెరామన్ లేకపోవటంతో తనే స్వయంగా కెమెరా ఆపరేట్ చేయాల్సి వచ్చేది. మొత్తానికి కెమెరా తీసుకొని కొండెక్కాడు.
ఇక్కడ కొంత నేపథ్యం చెప్పాలి. తిరుమల సుందరీకరణ పథకంలో భాగంగా అక్కడి ఇళ్ళు కూల్చివేయాలని టిటిడి అధికారులు నిర్ణయించుకున్నారు. వెంటనే గుడి వెనుక ఉన్న గొల్ల కిష్టయ్య సందులో ఇళ్లవాళ్ళందరికీ నోటీసులిచ్చారు. సుందరీకరణ అని నేరుగా చెప్పలేదుగాని, మాడ వీధుల విస్తరణ అంటూ నోటీసులివ్వటంతో కొన్ని ప్రజాసంఘాలు అభ్యంతరం చెప్పాయి.
దీంతో అధికారులు మెత్తబడ్డారు. ఆ విషయం మళ్ళీ పట్టించుకోలేదు. అంతటితో అది సమసిపోయిందనుకున్నారు. కానీ అందరూ ఏమరుపాటుగా ఉన్నప్పుడు అమలు చేయాలన్నది టీటీడీ అధికారుల వ్యూహంలో భాగం. ఉద్దేశపూర్వకంగానే టీటీడీ జేఈవో బాల సుబ్రహ్మణ్యం ఆ ఆదివారం రోజు హైదరాబాద్ లో ఉన్నారు. క్షణ క్షణం అక్కడ ఏం జరుగుతున్నదో మానిటర్ చేస్తూనే ఉన్నారు.
తిరుమల జెఈవోగా పనిచేసిన బాల సుబ్రహ్మణ్యం అప్పట్లో చాలా పవర్ ఫుల్. చాలాకాలం పాటు ఆ హోదాలో ఉన్నారు. ప్రముఖుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలు తన సీటుకు వచ్చిన ఢోకా ఏమీలేదనుకునే వ్యక్తి.
ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉంటూ తనకిష్టమొచ్చినట్టు వ్యవహరించేవారు. ఆయన జాగ్రత్తగా చూసుకునేవాళ్ళ జాబితాలో మీడియా పెద్దలూ ఉన్నారు. అందువల్ల తనకు ఇబ్బంది కలిగించే వార్తలేవీ మీడియాలో రావనే ధీమాతో ఉండేవారు.
మొత్తానికి మా రిపోర్టర్ మునిరాజు అక్కడికి చేరుకున్న సమయంలోనే కూల్చివేతలు మొదలయ్యాయి. జనం సామాను సర్దుకొని బైటికి వెళ్ళేందుకు కూడా సమయం ఇవ్వకుండానే కూల్చేస్తున్నారు. చిన్న పిల్లల ఏడుపులు, వృద్ధుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.
ఒక బాలింత వారాల శిశువుతో పరుగు తీయటం, సిఐ కరుణాకర్ ఆమెను కొట్టటం లాంటి దృశ్యాలన్నీ మా కెమెరాలో రికార్డవుతూ ఉన్నాయి. అక్కడి ఉద్యోగులు కొంతమంది మా రిపోర్టర్ వీడియో తీయటం చూశారు. అదే విషయం మా మునిరాజు చెప్పాడు. కాసెట్ తీసి జేబులో వేసుకొని కొత్త కాసెట్ కెమెరాలో వేసుకోమని చెప్పా. ఆపటం కోసం వత్తిడి చేయటానికి ఎవరు ఫోన్ చేసినా తీయవద్దని కూడా చెప్పా.
ఎలాంటి వత్తిడి వస్తుందో నేను కాస్త ఊహించా. కానీ నేను ఊహించని ఒక విషయం మా మునిరాజు చెప్పాడు. అదేంటంటే.. ముందుగా అక్కడ పాతుకుపోయిన కొంతమంది రిపోర్టర్లే నాకు ఫోన్ చేసి వార్త ప్రసారం చేయకుండా మొహమాట పెడతారని. చాలామంది రిపోర్టర్లకు తిరుమలలో షాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు జేఈవోకు అనుకూలంగా వ్యవహరిస్తారని, ఆయనకంటే ముందే వాళ్ళు స్వామి భక్తి ప్రదర్శిస్తారని కూడా హెచ్చరించాడు.
ఆ తరువాత కాసేపటికే తనకు తిరుమలలో కొంతమంది రిపోర్టర్లు ఫోన్ చేశారని, ఫోన్ తీయలేదని చెప్పాడు. మొత్తానికి కొండ దిగి కిందికి వచ్చి బస్సులో కాసెట్ పంపాక భారం దిగిపోయినట్టయింది. అప్పుడు మాత్రమే ఫోన్లకు జవాబిచ్చాడు. తన చేతిలో ఏమీ లేదని, కాసెట్ చెన్నై పంపించానని చెప్పి తప్పించుకున్నాడు.
మునిరాజు చెప్పినట్టే నాకు బాగా తెలిసిన నలుగురైదుగురు రిపోర్టర్లు ఫోన్లు చేశారు. వాళ్ళలో ఇండియన్ ఎక్స్ ప్రెస్, క్రానికల్ రిపోర్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ఫోన్లు తీయలేదు. మునిరాజు బస్సులో పంపిన కాసెట్ చెన్నై కోయంబేడు బస్టాండుకు, అక్కడి నుంచి చానల్ కు వచ్చేసరికి రాత్రి 7 అయింది.
అంటే, 8 గంటల న్యూస్ బులిటెన్ కు గంటముందు చేరింది. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఎందుకు కూల్చారన్న సంగతలా ఉంచితే, పోలీసులు వ్యవహరించిన తీరు ఎంతమాత్రమూ సమంజసంగాలేదు. అందుకే ఎలాగైనా ఈ ఘటన ఆరోజు మొదటి హెడ్ లైన్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అంతలోనే మునిరాజు నుంచి మళ్ళీ ఫోన్. జేఈవో ఫోన్ చేశారని, తాను జవాబివ్వలేదని చెప్పాడు.
తరువాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇప్పుడు జెమినీ డైరెక్టర్ కిరణ్ గారు ఫోన్ చేస్తారని, అది కూడా తీయవద్దని చెప్పా. కాస్త భయపడ్డాడు. తరువాత అడిగితే సైలెంట్ లో పెట్టానని చెప్పు, ఇంకేమైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పా.
అనుకున్నదే జరిగింది. మునిరాజు ఫోన్ తియ్యలేదు. ఆ తరువాత నేను అనుమానించినట్టే నాకు మా కిరణ్ గారి నుంచి ఫోన్. నేను కావాలనే జవాబివ్వలేదు. హైదరాబాద్ నుంచి ఏ ఫోన్ వచ్చినా తీయవద్దని, తీసినా, కిరణ్ గారు ఫోన్ చేస్తే నేను లేనని ఆఫీసులో వాళ్ళను చెప్పమన్నా.
తిరుమల నుంచి ఏదైనా వీడియో వచ్చిందా అంటే తెలియదని చెప్పమన్నా. ఇలాంటి వార్తల విషయంలో ఆపటానికి నన్ను కాదని మా ఎండీ శరద్ గారితోగాని, చైర్మన్ కళానిధి మారన్ గారితో గాని మాట్లాడటానికి ఆయన ఇష్టపడరని నాకు తెలుసు.
కాసేపటికి జేఈవో బాల సుబ్రహ్మణ్యం ఫోన్. ఆ వార్త ఎలాగైనా ఆపమని రిక్వెస్ట్. నేను ఫోన్ లో దొరకటం లేదని కిరణ్ గారు చెప్పారట. “ఎందుకు ఆపాలి? కెమెరా అబద్ధం చెప్పదుగా. అదే చూపిస్తాం” అన్నాను. కిరణ్ గారికి ఫోన్ చేసినందుకు నేను మరీ పంతానికి పోతున్నానేమో అనుకొని సంజాయిషీ చెప్పే ప్రయత్నం చేశారు.
సమయానికి తాను తిరుమలలో లేకపోవటం వలన కూల్చివేత ఆదేశాలు అమలు జరిగి ఉంటాయని తప్పించుకోబోయారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెబితే మీ వెర్షన్ కూడా జోడిస్తాం” అనేసరికి ఇప్పుడు ఇంకా పెద్దది చేయటమెందుకులెండి. ఆపగలిగితే ఆపండి” అన్నారు. కుదరదని చెప్పాక ఫోన్ పెట్టేశారు.
మొత్తానికి 8 గంటల వార్తల్లో అదే ప్రధాన వార్త. అప్పటికింకా న్యూస్ చానల్స్ లేవు కాబట్టి మేం వేసిందే తొలి వార్త. న్యూస్ బులిటెన్ ఇంకా పూర్తికాకముందే ఆ వార్తను మెచ్చుకుంటూ ఫోన్లు రావటం మొదలయ్యాయి. తేజ టీవీ మాత్రమే ఆ ఘట్టాన్ని చిత్రీకరించి ప్రసారం చేయగలిగింది కాబట్టి అలాంటి మెచ్చుకోళ్ళు సహజం.
నిజంగానే ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. అదే వార్త మళ్ళీ 10 గంటల వార్తల్లో ప్రసారం కావాల్సి ఉంది. అప్పుడు మా డైరెక్టర్ కిరణ్ గారి ఫోన్ తీశా. ఆయన తిరుమల వార్త గురించి చెప్పబోతుండగానే
ఎండీ శరద్ గారు కూడా మెచ్చుకున్నారని, రిపోర్టర్ కి కూడా ఫోన్ చేసి అభినందించారని చెప్పేశా.
ఆయన దృష్టిలో పడ్డాక ఆపటానికి ప్రయత్నించే అవకాశం లేదని నాకే కాదు.. కిరణ్ గారికీ తెలుసు. కక్కలేక, మింగలేక అన్నట్టు తయారైంది ఆయన పరిస్థితి. నేను ఉద్దేశపూర్వకంగానే ఫోన్ తీయలేదని తెలియనంత అమాయకుడు కాదుగా!
****
నిర్దాక్షిణ్యంగా లాఠీలకు పనిచెప్పిన సిఐ కరుణాకర్ మునిరాజుకు మంచి మిత్రుడే. కానీ వృత్తికీ, స్నేహానికీ ముడిపెట్టకుండా వీడియో తీసి పంపాడు. ప్రజాసంఘాలు, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కరుణాకర్ విలన్ అయ్యారు. మొత్తానికి 2003 చివర్లో ఎలక్షన్స్ దగ్గరపడుతూ ఉండటంతో ప్రభుత్వం మీద వత్తిడి పెరిగింది.
భారీ పాకేజ్ ఇచ్చి తిరుమలలో షాప్స్ కేటాయించి కొందరికి, టిటిడిలో ఉద్యోగాలు ఇచ్చి మరికొందరికి ప్రభుత్వం పునరావాసం కల్పించింది. తిరుపతిలో అందరికీ ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇచ్చింది. నా మీద మాత్రం మా కిరణ్ గారి కోపం పెరుగుతూ వచ్చింది…. – తోట భావనారాయణ
Share this Article