Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ వర్ణం ఎవడబ్బ సొత్తు..? తమిళనాట ఓ ‘రంగు రాద్ధాంతం’..!!

June 3, 2026 by M S R

.

చిన్నప్పటి నుంచీ గోడల మీద చూసిన ఓ నినాదం… ఎరుపు ఎవడబ్బ సొత్తురా, అది నా భరతమాత నుదుటి సిందూరం… అవును, రంగుకు భావజాలం ఉంటుందా..? ప్రతి వర్ణం ప్రతి ఒక్కరిదీ కదా… పింక్ అనగానే బీఆర్ఎస్, కాషాయం అనగానే బీజేపీ, పసుపుపచ్చ అనగానే టీడీపీ, ఆకుపచ్చ అనగానే మజ్లిస్, నీలి రంగు అనగానే బీఎస్పీ… ఇలా… పార్టీలు రంగులపైనా పేటెంట్లు పొందాయా..?

ఇదంతా ఎందుకు గుర్తుకు వచ్చిందంటే… తమిళనాట మరో వివాదం… తిరువళ్లువార్ ఓ ప్రసిద్ధ తమిళ కవి… తమిళజాతి ఆరాధించే కవి- తత్వవేత్త… మొన్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ లోకభవన్‌లో కాషాయం ధరించినట్టుగా చిత్రించబడిన తిరువళ్లువార్‌కు దండ వేశాడు, దండం పెట్టాడు, స్మరించుకున్నాడు… అదీ వివాదం… ఇది తిరువళ్లువార్‌ను హిందుత్వ చిహ్నంగా మార్చే ప్రయత్నం అని ద్రవిడవాద పార్టీలు విమర్శ అందుకున్నాయి…

Ads

అధికారంలో ఉన్న టీవీకే, దానికి కొమ్ముకాసే డీఎంకే, దాని మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే గవర్నర్ చర్యను వెంటనే ఖండించాయి… ‘తెల్లటి వస్త్రాల్లో తిరువళ్లువార్ చిత్రాలే కనిపిస్తాయి, కావాలనే గవర్నర్‌తో ఈ కాషాయ తిరువళ్లువార్‌కు నివాళి అర్పించేలా చేశారు, ఇదీ ఓ కుట్రే’ … ఇవీ ఆ విమర్శల సారాంశం… ‘ఆయన ఓ కులానికో, ఓ మతానికో, ఓ ప్రాంతానికో పరిమితం కాదు, కానీ కాషాయ క్యాంపు తనను ఓ సంకుచిత చట్రంలో బిగించే ప్రయత్నం చేస్తోంది, పైగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రతి జనవరిలో ఆయన సంస్మరణ దినాన్ని నిర్వహిస్తుంది కదా, మరి ఇప్పుడు ప్రత్యేకంగా లోకభవన్ సంస్మరణ ఏమిటనేది వాటి ప్రశ్న…

ఇక్కడ ఒక ప్రశ్న అడగాల్సిందే… అసలు కాషాయం ఎవరి సొత్తు..? ఇంకా విస్తరించి అడిగితే… ఎరుపు ఎవరి సొత్తు…? గులాబీ ఎవరి సొత్తు…? ఆకుపచ్చ ఎవరి సొత్తు…? రాజకీయాల్లో కొన్ని రంగులకు కొన్ని పార్టీలు, కొన్ని భావజాలాలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయాయి… ఒక రంగును ముందుగా ఎవరు వాడారన్నది కాదు అసలు ప్రశ్న… ఆ రంగుపై శాశ్వత హక్కు ఎవరికైనా ఉందా అనేదే అసలు ప్రశ్న…

కాషాయం భారతీయ సంప్రదాయంలో వేల ఏళ్లుగా త్యాగానికి, వైరాగ్యానికి, జ్ఞానానికి ప్రతీక… బీజేపీ పుట్టకముందే అది ఉంది… ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడకముందే అది ఉంది… శంకరాచార్యుల కాలం నుంచే కాదు, బౌద్ధ భిక్షువుల వస్త్రాల్లో కూడా ఆ రంగు కనిపిస్తుంది…

అలాగే ఎరుపు రంగు కమ్యూనిస్టులు పుట్టకముందే ఉంది… విప్లవాలకు ప్రతీకగా మారకముందే అది మానవ చరిత్రలో భాగం… గులాబీ రంగు తెలంగాణ రాజకీయాల్లోకి రాకముందే ప్రపంచమంతా వాడుతోంది… ఆకుపచ్చ కూడా ఏ ఒక్క మతానికో, పార్టీకో పరిమితం కాదు…

రాజకీయాలు ఒక పని చేస్తాయి… ప్రజల మనసుల్లో కొన్ని రంగులను కొన్ని భావజాలాలతో బలంగా అనుసంధానిస్తాయి… ఆ తర్వాత ఆ రంగును వేరెవరు ఉపయోగించినా అనుమానంతో చూడటం మొదలవుతుంది… తిరువళ్లువార్ విషయంలోనూ ఇదే జరుగుతోంది…

ఒక వర్గం ఆయనను ద్రవిడ ఆలోచనల ప్రతీకగా చూస్తుంది… మరో వర్గం ఆయన రచనల్లో హిందూ తత్వాల ప్రభావం కనిపిస్తుందని వాదిస్తుంది… ఈ నేపథ్యంలో ఆయన చిత్రంలో కాషాయం కనిపించగానే అది కేవలం ఒక రంగు కాకుండా ఒక రాజకీయ ప్రకటనగా మారిపోతోంది… అందుకే ఈ వివాదాన్ని చూస్తుంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది…

రంగులు ప్రకృతివి… సంస్కృతి సమాజానిది… మహనీయులు సర్వ మానవాళికీ వర్తిస్తారు… వాటిని పార్టీ కార్యాలయాల గోడల మధ్య బంధించాలని ప్రయత్నించడం వల్ల వివాదాలు పెరుగుతాయి తప్ప, చరిత్ర మారదు… అసలు ప్రశ్న రంగు గురించి కాదు… తిరువళ్లువార్‌ను మనం ఒక రాజకీయ చిహ్నంగా చూడాలా..? లేక శతాబ్దాలను దాటి నిలిచిన ఒక సార్వత్రిక జ్ఞానిగా చూడాలా..?

తిరువళ్లువార్‌ను ఏ రంగుతో చిత్రించారు అన్నది కంటే… ఆయన చెప్పిన విలువలను ఎంతమంది ఆచరిస్తున్నారు అన్నదే పెద్ద ప్రశ్న…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల బంగారం అమ్మేసిన మోదీ..! ఎందుకు..? ఏం జరుగుతోంది..?
  • కళ్లు పొడిచే LED కాంతి..! రాత్రి ప్రయాణం ప్రాణాంతకమేనా..?
  • కాలం ఎవరినీ క్షమించదు… ఒక మమత పతనం, ఒక గుణపాఠం!
  • ఏ వర్ణం ఎవడబ్బ సొత్తు..? తమిళనాట ఓ ‘రంగు రాద్ధాంతం’..!!
  • సినిమా ‘రాజీ’పడింది..! కానీ ఆ గూఢచారిణి ఆత్మ క్షమిస్తుందా..?
  • Jolly LLB 3 … ‘అభివృద్ధి’ ఎప్పుడూ రైతు ఇంటినే ఎందుకు కూల్చాలి…?
  • అయ్యోనివా, నువ్వు అవ్వోనివా… తెలంగాణోనికి తోటి పాలోనివా..?
  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions