.
Gurram Seetaramulu …. తెలంగాణ కోసం కాలికి గజ్జె కట్టి లక్షల కిలోమీటర్ల మేర తెలంగాణావాదాన్ని, పోరాట విత్తనాలను నాటిన గద్దర్ ని ప్రజాభవన్ గేటు కాడ నిలబెట్టిప్పుడే తెలంగాణ అస్తిత్వం ఎలిసి పోయింది…
దొర ఏందిరో వాని పీకుడెందిరో అని గొంతు నరాలు పగిలేలా పాడిన గూడ అంజయ్య చావులో దొరను పలవరించినా. దొరలను తిట్టిన గొంతు మీద కాలెత్తి తన్నాడు ఆనాటి జాతి పిత.
ఆయన కొండగట్టు అంజన్న దుర్ఘటనలో 2018 సెప్టెంబర్ 11న ఒకరు కాదు, ఇద్దరు కాదు, 65 మంది పోతే కనీసం బాదితులను పరామర్శించని నాయకుణ్ణి ప్రశ్నించని పాత్రికేయులం మనం.
గూడ అంజన్నను కలవక పాయె, గద్దర్ కోసం యేం చెయ్యలేక పోతిరి. ఒక్క వార్త అన్నా రాసారా ?
Ads
ముప్పై ఏళ్ళు చట్ట సభల్లో నిలబడ్డ దళిత గొంతు కంటోన్మెంట్ MLA సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలు ఇవ్వకపోగా ఆంధ్రా నందమూరి హరికృష్ణకు, సూపర్ స్టార్ కృష్ణకు అధికార లాంఛనాలు, నారాయణ విద్యా సంస్థల యజమాని కొడుకు చనిపోతే ఇంటిల్లిపాది దగ్గర ఉండి సాగనంపితిరి…
అలగా జనాలు మల్లేశం అనే ఒక నేత కార్మికుడి గురించి సినిమా తీస్తే, చిన్న రాయితీ ఇవ్వమని అడిగితే థూ నా బొడ్డు అని… సూపర్ స్టార్ కృష్ణ కొడుకు సీమంతుని సినిమాకు ట్వీట్లతో ముద్దులు పెట్టి ఇంకెవరికో అంబాసిడర్ కొలువు ఇస్తివి…
గ్రూప్ వన్ ఆస్పిరెంట్ బీద అమ్మాయి ప్రవళిక ఉరిబెట్టుకుంటే ఆమె అసలు పరీక్ష రాయలేదు, లవర్ కోసం ఉరిబెట్టుకుంది అన్ననాడు ఒక్క గొంతు లేవలేదు.
బెనిఫిట్ షో పెట్టీ, తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే ఇంకొకడు చావు బతుకుల్లో ఉంటే ఆ చావుకి బాధ్యులు యెవరూ ? సినిమా యజమాని కంకర చంద్రయ్య వారసులా ? ఎగ్జిబిటర్సా? అల్లు అర్జునా ?
కెవిపి రామచంద్రరావు, మెఘా కృష్ణారెడ్డి, శాపూర్జి పర్లోంజి, చిన్న జీయర్, శారదా పీఠం అధినేత,
యాదగిరిగుట్ట పునరుద్ధరణ శిల్పాలు తెలంగాణ ఆనంద సాయితో చెక్కించి… ఇంకా ఇంకా కోట్లాది మంది ఆంధ్రా పెట్టుబడిదారులతో గత రెండు దఫాల పాలనలో ఆంధ్రా సినిమా, పెట్టుబడి, సాంస్కృతిక పునర్ వికాసం కోసం మాత్రమే పనిచేసిననాడు కనబడని “ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం” “గడచిన పదేళ్లు సాంస్కృతిక వలసవాదాన్ని వదిలించుకునే పనిలో ఉన్నది తెలంగాణ.
ఇప్పుడు వలసవాదం మళ్ళీ మనలను చుట్టుముట్టే సూచనలు కనబడుతున్నాయి అని కొత్తగా అనడం అంత వంచక బాష మరొకటి లేదు. ” తెలంగాణ నాడు నేడు అంతా పెత్తందారుల కాళ్ళ కింద నుంచి విముక్తి కాలేదు. వాడెవాడో ముఖానికి రంగేసుకుని కాబరే డాన్స్ ఆడే కేతిగాడి మూలంగా అదనంగా ప్రమాదం ఏమీ లేదు మై డియర్ పింకీస్….
Share this Article