.
హైదరాబాద్, నవంబరు 25 … ది రాజా సాబ్ సినిమా దర్శకుడు మారుతి పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ వింత నిరసన, అభిశంసన… ఇదో కొత్తరకం ట్రోలింగు… ఆన్‌లైన్‌లో మాటల దాడో, బూతుల దాడో కాదు, హైదరాబాద్ కొండాపూర్‌లోని మారుతి నివాసానికి జొమాటో, స్విగ్గిల ద్వారా వరుసగా ఫుడ్, మెడికల్ ఆర్డర్లు పంపిస్తున్నారు…
వీటిని ఏం చేయాలో తెలియక ఆయన సెక్యూరిటీ స్టాఫ్ కిందా మీదా పడుతున్నారు… గతంలో ప్రి-రిలీజ్ సందర్భంగా తన ఇంటి అడ్రెస్ చెప్పాడు కదా, అలా బుక్కయ్యాడు తను… నిజానికి ఇక్కడ ప్రభాస్ తప్పేమీ లేదు… మారుతి తప్పు కూడా లేదు…
Ads
సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు అనేకం… సినిమా నిర్మాణంలో విపరీతమైన జాప్యం, అనుకున్నట్టుగా ప్రభాస్ డేట్లు కుదరక, మారుతి ఎలాగోలా తిప్పలుపడి సినిమా పూర్తి చేశాననిపించాడు… రిలీజ్ చేశాడు… సినిమా ఔట్‌పుట్ చూశాక వాళ్లకే అర్థమైంది ఇది కేవలం ప్రభాస్ హీరోయిజంతో నాలుగు రోజులు నడవాల్సిన సినిమా మాత్రమేనని…
నిజంగానే సినిమా కథలో నానా అంశాలూ కలగలిపి, గందరగోళం చేశాడు మారుతి… దానికి తోడు ప్రజెంటేషన్ కూడా బాగాలేదు… సినిమా మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ మొదలైంది… పేరుకు 200 కోట్ల వసూళ్లు కనిపిస్తున్నా సరే, నిర్మాణవ్యయంతో పోలిస్తే, జరిగిన బిజినెస్‌తో పోలిస్తే బయ్యర్లు బాగా నష్టపోయినట్టే…
ప్రభాస్ దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు… పాటలు, గ్రాఫిక్స్, కథ ఏమీ పట్టించుకోడు పెద్దగా… ది రాజా సాబ్ కొత్తేమీ కాదు… గతంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ చూశాం కదా… మరీ ఆదిపురుష్ సినిమా అయితే వందల కోట్లు ఉత్త పుణ్యానికి ఖర్చు పెట్టించారు… చివరకు అడ్డదిడ్డం నాసిరకం గ్రాఫిక్స్‌తో ప్రభాస్‌ను నిండా ముంచేశాడు సదరు దర్శకరత్నం…
నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్… సరైన కథ, కథనం ఉంటే మినిమం గ్యారంటీ… ఇక్కడ అవే దెబ్బతీశాయి… మొదటి ఆట నుంచే ది రాజా సాబ్ సినిమాకు సంబంధించి మారుతి మీద భీకరంగా ట్రోలింగ్ సాగుతోంది… సర్దిచెప్పుకోవడానికి మారుతి దగ్గర సరైన సమాధానాలు కూడా లేవు…

భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే నాసిరకం సినిమాను వదిలేస్తే… మొన్నటి సంక్రాంతి బరిలో మన శివశంకర ప్రసాద్ గారు ఓ మోస్తరు క్వాలిటీతోనే వసూళ్లు కుమ్మేసింది… చిన్న సినిమాలే అయినా అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి కూడా హిట్టయ్యాయి… మరి ప్రభాస్ వంటి స్టార్‌తో సినిమా అంటే ఎలా ఉండాలి..?
అదీ ఫ్యాన్స్ అసంతృప్తికి కారణం… అది మారుతిపై ఆగ్రహంగా వ్యక్తమవుతోంది… కథా బలం లేదు, సరికదా ట్రీట్‌మెంట్ విషయంలో డైరెక్టర్ మారుతి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు… ఈ నేపథ్యంలో మారుతిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్, విమర్శలు ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా, ఇప్పుడు వ్యక్తిగతంగా వేధించే స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది…
https://x.com/Kishoreddyk/status/2014898569980076059
తాజాగా హైదరాబాద్ కొండాపూర్‌లోని కొల్లా లక్సురియా విల్లాస్‌లో నివసిస్తున్న దర్శకుడు మారుతి ఇంటిని లక్ష్యంగా చేసుకుని కొందరు అభిమానులు… ఆ అడ్రసుకు జొమాటో, స్విగ్గిల ద్వారా భారీగా ఫుడ్ డెలివరీ ఆర్డర్లు పంపించడమే కాకుండా, కొన్ని మెడికల్ షాప్ పరికరాల ఆర్డర్లు కూడా పంపించినట్లు సమాచారం… ఒక్కరోజులోనే 100కు పైగా ఆర్డర్లు రావడంతో విల్లా సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు…
వరుసగా వస్తున్న డెలివరీ బాయ్స్‌ను అడ్డుకోవడం, వివరణ ఇవ్వడం సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది… చివరికి మారుతి ఆగ్రహంతో “నా పేరు మీద ఏది వచ్చినా లోపలకు అనుమతించవద్దు” అని సెక్యూరిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు…
‘ ది రాజా సాబ్ ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సినిమా ఫలితంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పిన మారుతి, అభిమానులు నిరాశ చెందితే నేరుగా తన ఇంటికే రావొచ్చని సవాల్ విసిరాడు… అంతేకాదు, హైదరాబాద్ కొండాపూర్‌లోని కొల్లా లగ్జూరియా విల్లా నంబర్ 17 తన నివాసమని మైక్‌లోనే చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది… ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు దర్శకుడి కాన్ఫిడెన్స్‌కు నిదర్శనంగా అభిమానులు తీసుకున్నారు… కానీ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ నుంచి నెగిటివ్ టాక్ రావడంతో, అదే మాటలు ఇప్పుడు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యాయి…
మరోవైపు ‘ది రాజా సాబ్’కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఎస్‌కేఎన్ కూడా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు… సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా తనను, సినిమాను, హీరో హీరోయిన్లను అవమానకరంగా విమర్శిస్తున్నారంటూ ఎస్‌కేఎన్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు…!!
Share this Article