.
అంతా మాయ..! చివరకు ఆ ఏడుకొండల వాడి కళ్లకే గంతలు కడుతున్నారు మన పాలకులు, వారి తాలూకు డప్పు మీడియా..! కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి పాతరేశారు…
నిన్న సాక్షి చూడండి… బ్యానర్ స్టోరీ… అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్దాంతమే, తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో కొవ్వు కలవలేదు, నాలుగు రకాల శాంపిల్స్ పరీక్షించి మరీ నిర్ధారణ… సీబీఐ దర్యాప్తులో తేలింది ఇదే…
Ads
బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం, పవన్ కల్యాణ్ వత్తాసు… అని రాసుకుంటూ పోయింది… కొవ్వు కలవలేదు అనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చి, మేం పత్తిత్తులం, మేం నిప్పులం అని చెప్పుకుంది… అది సరే, మరి 250 కోట్ల విలువైన లక్షల కిలోల నెయ్యి అసలు నెయ్యే కాదని, కేవలం రసాయనాలు- పలు వెజిటబుల్ ఆయిల్స్‌తో కృత్రిమంగా తయారీ చేసిన నెయ్యి అంటూ అదే సిట్ ఇచ్చిన రిపోర్ట్ మాటేమిటి..?
నెయ్యి అసలు నెయ్యే కాదు అంటే… తిరుమల వెంకన్నకు ఎంత ద్రోహం..? వెంకన్న భక్తగణానికి ఎంత అపచారం..? ధూర్తకార్యం చేయడమే కాదు, దాన్ని పదే పదే సమర్థించుకోవడం అసలు తప్పుకన్నా ఘోరం…

నిన్న ఈనాడు వార్త చూడండి… అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే అని సిట్ తేల్చింది, కోర్టులో చార్జ్ షిట్ దాఖలు చేసింది అని రాసుకొచ్చింది… జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలిపారనే అంశాన్ని, చంద్రబాబు అప్పటి విమర్శల్ని వదిలేసింది… సో, టీడీపీ క్యాంపు, వైసీపీ క్యాంపు ఎవరి వాదనలు వాళ్లవే… ఎవరి భాష వాళ్లదే… విషాదం ఏమిటంటే..? భక్తుడికే ఏ వాదనా లేకపోవడం, అదెవరూ వినిపించకపోవడం.,.

- చంద్రబాబు చెప్పిన జంతు అవశేషాల నెయ్యి అనేది సిట్ రిపోర్టులో ఏది..? మరి ఏ ఆధారాలతో అప్పట్లో చంద్రబాబు ఆరోపణలు చేశాడు..? ఇప్పుడెందుకు స్పందించడం లేదు..? సిట్ చెప్పిందే రైట్ అయితే తన పాత విమర్శలకు క్షమాపణ చెప్పాలి కదా… కానీ మాట్లాడడు…. మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకున్న పవన్ కల్యాణ్ అసలు తెర మీదకే రాడు… అంతా మాయ..!! వైసీపీ అసత్య ప్రచారమో, అబద్దమో, నిజమో బాబు భక్తులు చెప్పాలి…
- టీటీడీ నెయ్యి కల్తీ చేశారంటున్న డెయిరీ (హర్ష్- ప్రస్తుతం భోలే బాబా డెయిరీ) కి 2018లో అన్ని అనుమతులూ ఇచ్చి, 2019లో 94 వేల కిలోల నెయ్యి ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు హయాంలోనేనట… అంటే కల్తీ నెయ్యి బాగోతాలు ఎప్పుడు మొదలైనట్టు..?
ఇంతకీ 23.7.2024న గుజరాత్2లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఇచ్చిన ల్యాబ్ పరీక్ష నివేదిక ఏమైపోయినట్టు..? సిట్ దాన్నెందుకు పరిగణనలోకి తీసుకోలేదు..? అది ప్రతిష్ఠాత్మక సంస్థే కదా… తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కుళ్ళిపోయిన జంతు మాంసం నుంచి తీసిన నూనెల్ని వాడారు అని కదా అప్పట్లో చెప్పింది…

ఈ రిపోర్టులో బీఫ్ టాలో, లార్డ్ అంటే ఏమిటో ఎవరు చెప్పాలి భక్తగణానికి..? SIT రిపోర్ట్ లో, ICAR-NDRI అనే ఒక రీసర్చ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ చూపిస్తున్నారు… అది ఎక్కడా జంతు కొవ్వు లేదు అని కంప్లీట్ గా చెప్పడం లేదు.,.. “Limit of Detection (LOD): ≥ 10%” తీసుకున్నాం అని చెప్తున్నారు… అంటే జంతు కొవ్వు 10% కంటే తక్కువ ఉంటే, ఈ రిపోర్ట్ లో రాదు అని వాళ్ళే చెప్తున్నారు…
నిపుణుల అభిప్రాయం ప్రకారం, PCR టెస్ట్ లో జంతు కొవ్వు కలిపిందీ లేదూ తెలియదు… MTDNA టెస్ట్ లో మాత్రమే తెలుస్తుంది… మరి అసలు నిజం ఏమిటి..? ఇదే కాదు… భూమన, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, పరోక్షంగా జగన్, చెవిరెడ్డి కలిసి చేసిన వెంకన్న ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు అనే కదా భక్తగణం నమ్ముతున్నది…

అసలు ఒక నాస్తికుడికి (క్రిస్టియన్ అని ప్రచారం కూడా ఉంది) టీటీడీ పగ్గాలు ఇచ్చి ఈ మొత్తం అపచారాలకు ప్రధాన కారకుడు జగన్… వేల అన్యమత ఉద్యోగులు కూడా భూమన అండ్ కో వెంకన్నకు ప్రసాదించిన వరం అట… నెయ్యి నెయ్యే కాదు, శాలువాల పట్టు అసలు పట్టే కాదు… అక్కడ జరగని అపచారం లేదు…
లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలు బాగా వినిపిస్తున్నప్పుడు సోకాల్డ్ భూమన తిరుమల పుష్కరిణిలో స్నానం చేసి చెబుతాను, నేను ఏ తప్పు చేయలేదు అని ఏదో పాట వినిపించాడు… అసలు దేవుడినే నమ్మని నువ్వు, వెంకన్నకే అపచారం చేసే నువ్వు పుష్కరిణిలో పరిహార స్నానమో, ప్రాయశ్చిత్త స్నానమో చేస్తే దానికి విలువ ఏముంది..? స్వామికీ, భక్తగణం చెవుల్లో పూలు పెట్టడం తప్ప..!

సిట్ వార్తలు చదువుతూ ఉంటే, హఠాత్తుగా సాక్షిలో మొత్తం పాపం చంద్రబాబుదే అన్నట్టుగా భూమన రాసిన పే-ద్ద వ్యాపంతోపాటు సోషల్ మీడయాలో ఇదొకటి కనిపించింది… ఈరోజు శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేస్తాడట ఈరోజు… ఏదో తోచిన పేరు పెట్టేసి, ఏదో శుష్క రాజకీయ తంతు నడిపించేసి…
పుష్కరిణి స్నానం మాదిరి మరో పరిహాస హోమం చేస్తాడన్నమాట... అర్జెంటుగా అక్కడ టీడీపీ వాళ్లు శ్రీనివాస ప్రసాద నిందా నిర్ధారణ హోమం ప్రకటించాలి... ఎవడికి ఏం తోస్తే అది... ఏది ధర్మహితమో ఎవడు అడిగాడు గనుక...
చివరగా ఓ మాట అనడానికి సాహసిస్తున్నా... వెంకన్న భక్తుల మనోభావాలతో క్షుద్ర రాజకీయాలు..!! చివరాఖరుగా.... జగన్, ఇదుగో ఈ చేష్టలే నిన్ను ముంచాయి...
Share this Article