.
Nàgaràju Munnuru …. సాగునీటి అవసరం ఎక్కువగా ఉండే చెఱకు సాగును ప్రోత్సహిస్తూ, అనారోగ్యానికి కారణమయ్యే చక్కెర ఉత్పత్తి అధికం చేస్తూ, చెఱకు నుండి ఇథనాల్ ఉత్పత్తి చేస్తూ, ఈ ఇథనాల్ ను పెట్రోల్ లో కలుపుతూ ప్రజలు లోన్లు తీసుకుని కొన్న కార్లు, బైకుల ఇంజన్లు పాడుచేసే బదులుగా.. నేపియర్ గడ్డి సాగును ప్రోత్సహించి మండలానికి ఒకటి చొప్పున కాంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG), తద్వారా CNG ఉత్పత్తి చేసి చౌక ధరకు ప్రజలకు CNG అందించే అవకాశం ఉంది.
ఇథనాల్ వినియోగం కంటే బయో గ్యాస్ CBG .కి వెళ్లడం ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ…
1. పంట సాగుకు అతి తక్కువ నీటి అవసరం
2. ఒక్కసారి సాగు చేస్తే దాదాపు పది సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. ప్రతి 40- 50 రోజులకు ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు.
3. గ్రామాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లాంటి జీవాలకు సంవత్సరం పొడవునా పచ్చిమేత లభ్యం అవుతుంది.
Ads
4. నేపియర్ ద్వారా CBG/ CNG ఉత్పత్తి చేసుకున్న తర్వాత మిగిలే వ్యర్థాలు సేంద్రీయ ఎరువుగా పొలాల్లో వేసుకోవచ్చు.
5. ప్రభుత్వం కోరుకున్నట్టు చమురు దిగుమతులను తగ్గించుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిలించవచ్చు.
కళ్ళ ముందు చౌకైన ప్రత్యామ్నాయాలు కనబడుతూ ఉంటే చెఱకు సాగును ప్రోత్సహించడం, పెట్రోల్ లో ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయడం, ఇథనాల్ ఇంధన వినియోగానికి అనుగుణంగా తయారుకాని వాహనాల్లో వాడటానికి ఇథనాల్ రహిత పెట్రోల్ అందుబాటులో లేకుండా చేసి కంబషన్ ఇంజన్ల సామర్థ్యాన్ని దెబ్బతీయడం, రిపేర్ల ఖర్చు పెరిగేలా చేయడం ప్రజల జేబుకు చిల్లు పడేలా చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఇంధన వినియోగం విషయంలో సరైన పాలసీ రూపొందించేవారే లేరా? ప్రతిపక్షాలు కూడా పనికిమాలిన విషయాల మీద రచ్చ చేసే బదులుగా నిజమైన సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. ప్రభుత్వం కోరితే సరైన ఇంధన పాలసీ ప్రణాళిక తయారుచేసి ఇవ్వడానికి నేను సిద్ధమే.
ఒకవేళ ప్రతిపక్షాలు కోరితే నిజమైన ప్రజల సమస్యలను తెలియజేయడానికి కూడా సిద్ధమే.
అంతిమంగా ప్రజలు బాగుండాలి, దేశం బాగుపడాలి.
– నాగరాజు మున్నూరు
Share this Article