.
పక్కపక్కనే మూడు లవ్ అండ్ క్రైమ్ వార్తలు కనిపించాయి… మూడూ వేర్వేరు కథలు… మూడింటి విషాద ముగింపులు వేర్వేరు… చదువుతుంటేనే కడుపులో, మనసులో ఏదో దేవిన భావన… ఓసారి వివరంగా చెప్పుకుందాం…
ఒక కేసులో ఓ యువతి కనిపెంచిన తల్లిదండ్రులను ఘోరంగా హతమార్చింది… ప్రేమ పెళ్లి కోసం… మరో కేసులో తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని జంట ఆత్మహత్య చేసుకుంది… ప్రేమ పెళ్లి జరగలేదని… ఇంకో కేసులో ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ప్రియుడితో కలిసి ఆమె భర్తను చంపేసింది… ప్రేమ వ్యవహారం కోసం… ప్రేమ ఎంత కఠినం..?!
Ads
మొదటి కేసు… వికారాబాద్ ఏరియా… ఓ కుటుంబంలో తల్లిదండ్రులతో చిన్న కుమార్తె సురేఖ కలిసే ఉంటుంది… ఏదో ప్రైవేటు హాస్పిటల్‌లో నర్స్… ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు… ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు… కానీ తల్లిదండ్రులు అంగీకరించలేదు… దాంతో సురేఖ కాస్తా వక్ర రేఖ అయిపోయింది…
వేరే కులం అనేది ఒక కారణం… పరువుపై భయం మరో కారణం… చాలామంది తల్లిదండ్రులు ప్రేమ, కులాంతర పెళ్లిళ్లకు అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం సామాజికంగా చిన్నచూపుకి గురవుతామనే భయం..! ఇక్కడా అదే జరిగింది… కానీ ఆ యువతి ఏం చేసిందంటే..? అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను ఖతం చేయడమే పరిష్కారమని అనుకుంది…

(ఆ ప్రేమికుడికి ఇది సరిగ్గా అర్థం కావాలి… తల్లిదండ్రులనే ఖతం చేసిన క్రుయల్ మెంటాలిటీ… రేప్పొద్దున మరొకడు తగిలితే వీడిని కూడా ఖతం చేయగలదు…)
హాస్పిటల్ నుంచి నాలుగు మత్తు మందు వాయిల్స్ ఎత్తుకొచ్చింది… ఒళ్లునొప్పులు తగ్గుతాయి అని చెప్పి తల్లికి ఓవర్ డోస్ ఇచ్చింది… ఆమె స్పాట్ డెడ్… తరువాత తండ్రికీ అలాగే ఇంజక్షన్లు చేసింది… డెడ్… తరువాత సోదరుడికి ఫోన్ చేసి ‘నా పెళ్లి మీద రంది పెట్టుకుని చచ్చిపోయారు’ అని చెప్పి ఏడ్చింది… కానీ ఇరుగు పొరుగు చెప్పిన ఘర్షణలు విన్నాక సోదరుడికే డౌటొచ్చి పోలీసులను పిలిస్తే, వాళ్లు తమదైన శైలిలో అడిగారు… ఆమె అంగీకరించింది… ఎంత దుర్మార్గం..?
(అందుకే అంటారు నవీన ప్రవచనకారులు… మరీ అంతగా పిల్లల్ని ప్రేమించకండర్రా అని…) ఇక్కడ ఆ మెంటల్ కేసు చేసిన పొరపాటూ ఒకటుంది… 1. మత్తుమందు వాయిల్స్ ఎత్తుకొచ్చింది, కానీ సిరంజీలు అక్కడ దొరకనట్టు బయట ఏదో మెడికల్ షాపులో కొన్నది… 2. ఇంజక్షన్లు ఇచ్చి ఆ ఖాళీ వాయిల్స్, సిరంజీలు హత్యాస్థలంలోనే వదిలేసింది… సిరంజీకి అంటిన రక్తపుచుక్కలను చూశాకే సోదరుడికి డౌటొచ్చింది… కథ మారిపోయింది… కటకటాలకు చేరింది కథ…

రెండో కేసు… ఇది అచ్చంపేట ఏరియా… వీళ్లు పాతతరం ప్రేమికులు… ఒకే కులం… కానీ తల్లిదండ్రులు అంగీకరించలేదు… కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇంట్లో నిత్య ఘర్షణ… ప్రేమ జంట మనస్తాపానికి గురైంది… బతుకులు చాలించడమే సరైన పని అనుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు… ఈ ఖతం కాలంలో వీళ్లు మరీ సత్తెకాలం జంట…
మూడో కేసు… ప్రజెంట్ ట్రెండ్ ప్రియుళ్లతో కలిసి మొగుళ్లను ఖతం చేయడమే కదా… ఇక్కడా అంతే… ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది… నిజానికి వార్తల్లో ప్రేమికుడు అని రాస్తున్నారు కానీ ఇది అక్రమ సంబంధ యవ్వారం… కామికుడు అని రాయాలేమో… వ్యవహారం సాగినన్ని రోజులు సాగించి, తరువాత వదిలేస్తారు చాలామంది కామికులు… కానీ ఇప్పుడు కేసులు, అరెస్టులకూ సిద్దపడి… ప్రియురాళ్ల కోసం వాళ్ల మొగుళ్లను చంపేస్తున్నారు…
ఈ కుటుంబాల్లో పిల్లలు, పెద్దల స్థితి.., సంక్షోభం, దాని ప్రభావం ఎంత ఘోరంగా మారుతుందో కూడా ఈ అక్రమ బంధాలు చూడనివ్వవు... కైపెక్కిన కళ్లు ఇవేవీ చూడవు..!!
Share this Article