.
సాధారణంగా పద్మ పురస్కారాలు అనగానే రాజకీయాలు, అధికారంలో ఉన్న పార్టీ అనుకూల ప్రభావం ఎంతోకొంత ఉంటుంది… పద్మాలు అంటేనే పైరవీలు, పక్షపాతాలు అనే ఆరోపణలు ఎన్నాళ్లుగానో ఉన్నవే… ఏ పార్టీ కూడా అతీతం కాదు…
నిన్న ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితా మొత్తం మీడియాలో కవరైందే… కానీ ఒకటీరెండు విషయాలు చెప్పుకోవాలి… ఈసారి మోదీ ప్రదర్శించిన రాజకీయ పరిణతి గురించి కూడా చెప్పుకోవాలి…
Ads
ప్రధానంగా నచ్చిన పురస్కారాల్లో రెండు.. 1) అచ్యుతానందన్… 2) శిబూ సోరెన్… వీరిలో అచ్యుతానందన్ దేశ కమ్యూనిస్టు చరిత్రలో ఒక పేజీ రాసుకున్న ఘనుడు… సొంత పార్టీయే రెనిగేడ్ అని ముద్ర వేసినా సరే, మరణం వరకూ ఎర్ర జెండా వదలని రాజకీయ ప్రసిద్ధుడు… మోదీ ఆయనకు ఏకంగా పద్మవిభూషన్ ఇచ్చి గౌరవించాడు…
శిబూ సోరెన్ జార్ఖండ్ ఉద్యమ నేత… ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక కొన్ని ఆరోపణలకు గురైనా సరే జార్ఖండ్ ఆత్మ ఆయన… తనకు పద్మభూషణ్ ఇచ్చాడు మోదీ… జస్ట్, రెండు ఉదాహరణలే ఇవి… ఇంకా ఇలాంటివి బోలెడు… త్వరలో ఎన్నికలు జరగబోయే కేరళ, తమిళనాడులో ఎక్కువ పురస్కారాలు ఇవ్వబడ్డాయనే విశ్లేషణలున్నాయి…
కానీ అధిక భాగం మెరిట్ బేస్డ్ ఎంపికలే అనిపిస్తున్నాయి… కొన్ని మినహా… ఒక ధర్మేంద్రకు పద్మవిభూషణ్ సరైన ఎంపిక… అలాగే కేటీ థామస్ (కేరళ, పబ్లిక్ అఫయిర్స్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) , ఎన్.రాజం (యూపీ, కళలు), పి.నారాయణన్ (కేరళ, లిటరేచర్)లకు కూడా పద్మవిభూషణాలు…
మమ్ముట్టి పద్మభూషణ్‌కు అక్షరాలా అర్హుడే… ఇక్కడ కూడా మోదీ ఏ పక్షపాతానికీ పోలేదు… గాయని అల్కా యాజ్నిక్ సరేసరి… నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే… విజయ్ అమృతరాజ్ కూడా…

స్పోర్ట్స్ కోటాలో వుమెన్ క్రికెట్ వరల్డ్ కప్ విజేత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ… రోహిత్ శర్మకు కూడా… సరైన చాయిసే… అలాగే అడ్వర్టయిజ్ గురుగా పిలిచే పీయూష్ పాండేకు, నటుడు మాధవన్‌కు కూడా… మరి తెలంగాణ నుంచి అంటారా..? ఇవిగో…

ఇన్నాళ్లూ వీళ్ల గురించి జనానికి పెద్దగా తెలియకపోవచ్చు… ఇప్పుడు తెలుస్తుంది…
ఎటొచ్చీ ఏపీ నుంచి మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల పద్మాలు మాత్రం పక్కాగా పొలిటికల్ చాయిస్… మరీ ఈమధ్య ఏ వేదిక ఎక్కినా పిచ్చి కూతలకు దిగుతున్న రాజేంద్ర ప్రసాద్‌కు పద్మం చివుక్కుమనిపించేదే…
తమ తమ వృత్తిరంగాల్లో కనబరిచే ప్రతిభ ఎలా ఉన్నా.., వ్యక్తిత్వంలోనూ, ప్రజాజీవితంలోనూ కొంత హుందాతనం కనిపించాలి… మురళీమోహన్ సంగతి పెద్దగా చెప్పనక్కర్లేదు.,. పక్కా టీడీపీ… ఆ కోటాలో వచ్చిందే ఈ పద్మం…
కేరళ, తమిళనాడు (ఉదాహరణకు: S.K.M. మైలానందన్, కె. పళనిసామి) వంటి రాష్ట్రాల నుంచి అవార్డులు ఎక్కువగా ఉండటం వెనుక త్వరలో జరగబోయే ఎన్నికల ప్రభావం ఉందన్న విశ్లేషణను కూడా కొట్టిపారేయలేం…
మరికొన్ని “మెరిట్ బేస్డ్” ఉదాహరణలు….
1. అంకె గౌడ (కర్ణాటక) – అక్షర యోధుడు…. ఒకప్పుడు బస్సు కండక్టర్‌గా పనిచేసిన ఈయన, పుస్తకాలపై మక్కువతో ఏకంగా 20 లక్షలకు పైగా పుస్తకాలతో “పుస్తక మనె” అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత లైబ్రరీని స్థాపించాడు… 20 భాషల్లోని అరుదైన గ్రంథాలను భవిష్యత్తు తరాల కోసం కాపాడుతున్న ఈయనకు పద్మశ్రీ ఇవ్వడం అక్షరానికి దక్కిన గౌరవం…
2. డాక్టర్ అర్మిడ ఫెర్నాండెజ్ (మహారాష్ట్ర) – మాతృత్వపు ఆశ… ముంబైకి చెందిన ఈ నిష్ణాతురాలైన పీడియాట్రిషియన్, ఆసియాలోనే మొదటి **’హ్యూమన్ మిల్క్ బ్యాంక్’**ను స్థాపించింది… తల్లి పాలు దొరకక ఇబ్బంది పడే అనాథ శిశువుల ప్రాణాలను కాపాడటంలో ఆమె చేసిన కృషి సామాన్యమైనది కాదు… ఎలాంటి ప్రచారం కోరుకోని ఇలాంటి వారికి పద్మశ్రీ దక్కడం ఈ పురస్కారాల విలువను పెంచింది…
3. బుధ్రి టాటి (ఛత్తీస్‌గఢ్) – అడవిలో అక్షర వెలుగు …. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో, ప్రాణాలకు తెగించి గిరిజన పిల్లల కోసం స్కూళ్లు ఏర్పాటు చేసిన ధీశాలి… అట్టడుగు వర్గాల విద్యా వికాసం కోసం ఆమె పడుతున్న తపనను ప్రభుత్వం గుర్తించింది….
4. భిక్‌ల్యా లదక్య దిండా (మహారాష్ట్ర) – కళా వారధి… 90 ఏళ్ల వయసులో కూడా ఆదివాసీల సాంప్రదాయ వాయిద్యం ‘తార్పా’ (సొరకాయతో చేసే వాయిద్యం)ను వాయిస్తూ, ఆ కళను అంతరించిపోకుండా కాపాడుతున్న నిరుపేద కళాకారుడు…. ఇలాంటి “అన్ సంగ్ హీరోస్”కు పెద్దపీట వేయడమే ఈసారి జాబితాలోని గొప్పతనం….
5. వ్లాదిమిర్ మెస్త్వ్రిష్విలి (జార్జియా/భారత్) – గురు దక్షిణ… భారత రెజ్లర్లకు (యోగిశ్వర్ దత్, సుశీల్ కుమార్, రవి దహియా) శిక్షణ ఇచ్చి ఒలింపిక్ మెడల్స్ రావడంలో కీలక పాత్ర పోషించిన ఈ విదేశీ కోచ్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించడం విశేషం… సేవ ఎక్కడి నుంచి అందినా గుర్తించాలనే సంకల్పం ఇక్కడ కనిపిస్తుంది…
6. డాక్టర్ శ్యామ్ సుందర్ (ఉత్తరప్రదేశ్) – పేదల వైద్యుడు…. నయం చేయడం కష్టమనుకునే ‘కాలా అజర్’ (Kala-azar) వ్యాధి నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసిన వైద్యుడు. ఆయన సేవలు కేవలం ఆస్పత్రులకే పరిమితం కాలేదు, గ్రామాలకు పాకాయి…. ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు…!!
Share this Article