.
గురూ, బాగా టైట్‌గా ఉంది పర్సు… ఏమైనా సర్దుతావా..? చేబదులు… వచ్చే నెల పెద్ద ఖర్చులేమీ లేవు, ఇచ్చేస్తా… అవసరమైతే వచ్చే నెలలో నీకు అవసరముందే నేనే డబ్బు సర్దుతా….
ఈ సంభాషణలు నిత్య జీవితంలో సర్వసాధారణం కదా… సేమ్, ఇలాగే కరెంటును కూడా చేబదులు తీసుకుంటే..? ఇన్నొవేటివే గానీ, సాధ్యమేనా అనుకుంటున్నారా..? తెలంగాణ ప్రభుత్వం ఖర్చుల్ని తగ్గించుకుని, పవర్ డిమాండ్ తట్టుకోవడానికి ఈ ‘చేబదుళ్ల’ పద్ధతినే విజయవంతంగా ప్రయోగిస్తోంది…
Ads
ఆసక్తికరమైన ఈ పద్ధతి విశేషాల్లోకి వెళ్దాం… తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాదులో పవర్ డిమాండ్ బాగా పెరుగుతోంది… తలసరి విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతోంది… కానీ ప్రస్తుతం 18 వేల మెగావాట్లకు చేరిన డిమాండ్ నడి వేసవికి ఇంకా పెరుగుతుంది…
మన ఉత్పత్తి సామర్థ్యంతోపాటు పవర్ ఎక్స్‌చేంజుల్లో కొంటున్నాం, మొత్తానికి పవర్ కట్స్ లేకుండా మేనేజ్ చేస్తున్నాం… కానీ ఇంకా డిమాండ్ పెరిగితే..? అందుకే మన ప్రభుత్వం (డిస్కమ్‌లు) పవర్ బ్యాంకింగ్ అనబడే ఈ చేబదులు సిస్టం వైపు చూస్తున్నాయి… నిజం చెప్పాలంటే, సిస్టమ్‌ను పర్‌ఫెక్ట్ వాడుకోవడం ఇది…
ప్రస్తుత ఒప్పందం (UP & MP తో)… UP తో రోజుకు గరిష్టంగా 3,000 మెగావాట్లు తీసుకునేలా ఒప్పందం జరిగింది… MP తో రోజుకు 500 మెగావాట్లు తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయి… తిరిగి ఇచ్చే కాలం…: ఏప్రిల్ 20 నుండి జూలై 10 లోపు తీసుకున్న విద్యుత్తును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది… జూన్ నుంచి వర్షాలు స్టార్టయితే డిమాండ్ తగ్గుతుంది కదా…
తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని ఏళ్లుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటోంది… మార్కెట్లో యూనిట్ ధర రూ. 10-12 ఉన్నప్పుడు కొనడం కంటే, ఇలా అప్పుగా తీసుకోవడం వల్ల డిస్కమ్‌ల మీద ఆర్థిక భారం తగ్గుతుంది… మరీ అవసరమైతే, ఆయా రాష్ట్రాలు కోరితే అప్పు తీసుకున్న విద్యుత్తుకు అదనంగా కొంత శాతం (సుమారు 5% వరకు) కలిపి తిరిగి ఇస్తారు… ఇది కేవలం నగదు రహిత లావాదేవీ (Cashless Transaction)…
ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయ సీజన్ (ఫిబ్రవరి – మే) లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది… అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో చలికాలం ముగిసి, వేసవి ఇంకా మొదలవ్వని ఈ సమయంలో విద్యుత్ మిగులు ఉంటుంది… దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పుగా కరెంటు తీసుకుని, తిరిగి మనకు మిగులు ఉన్నప్పుడు (ఉదాహరణకు వర్షాకాలం లేదా తెలంగాణలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు) ఇచ్చేస్తారు…
మనమే కాదు, పలు రాష్ట్రాలు ఈ పద్దతి వైపు మళ్లుతున్నాయి… మిగులు ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలకు ఇవ్వడం, తమ డిమాండ్ పెరిగినప్పుడు తీసేసుకోవడం… మంచి సర్దుబాటు… పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా వరి సాగు సమయంలో ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ బ్యాంకింగ్ చేసుకుంటాయి…
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్… ఇక్కడ జలవిద్యుత్ (Hydro Power) ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది… వారు బయటి రాష్ట్రాలకు ఇచ్చి, చలికాలంలో (అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు) తిరిగి తీసుకుంటారు… ఇది ఒక ‘వస్తు మార్పిడి’ (Barter System) లాంటిది… కొనే అవసరం లేకుండా, అవసరమున్నప్పుడు వాడుకుని, ఉన్నప్పుడు ఇచ్చేయడం వల్ల అటు వినియోగదారులకు కోతలు ఉండవు, ఇటు ప్రభుత్వానికి భారం ఉండదు… ఎక్స్ఛేంజీలలో ధరల హెచ్చుతగ్గుల (Volatility) నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది…
నమ్మకమైన సరఫరా…: పవర్ ఎక్స్ఛేంజీలలో ఒక్కోసారి బిడ్లు వేసినా విద్యుత్ దొరకకపోవచ్చు (Shortage), కానీ ఇలాంటి ముందస్తు ఒప్పందాల వల్ల నిరంతర సరఫరాకు గ్యారెంటీ ఉంటుంది… ఈ ‘ఇన్నోవేటివ్’ పద్ధతి తెలంగాణ లాంటి లక్షల పంపుసెట్ల వ్యవసాయాధారిత రాష్ట్రాలకు చాలా లాభదాయకం…
Share this Article