.
గోవా పోండా ఉపఎన్నిక రద్దు: ప్రజాస్వామ్యమా? పరిహాసమా? ప్రహసనమా? … ఎన్నికల నగారా మోగింది.. నామినేషన్లు పూర్తయ్యాయి.. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు.. చివరికి పోస్టల్ బ్యాలెట్లు కూడా పోలయ్యాయి. సరిగ్గా పోలింగ్‌కు 24 గంటల ముందు బాంబే హైకోర్టు ఈ ఉపఎన్నికను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటనతో భారత ఎన్నికల కమిషన్ (ECI) విశ్వసనీయతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎన్నికల కమిషన్‌కు చట్టం తెలియదా? … సాధారణంగా ఏదైనా అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల లోపు ఎన్నిక నిర్వహించాలి. ఇది అందరికీ తెలిసిన నిబంధనే. కానీ, ప్రజా ప్రతినిధుల చట్టం (Representation of the People Act, 1951) లోని సెక్షన్ 151A ప్రకారం ఒక మినహాయింపు ఉంది. అసెంబ్లీ మొత్తం పదవీకాలం ముగియడానికి ఏడాది కన్నా తక్కువ సమయం ఉంటే, అక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదు.
Ads
పోండా విషయంలో జరిగిన పొరపాటు ఇదే…. అక్టోబర్ 2025…: స్థానిక ఎమ్మెల్యే మరణంతో సీటు ఖాళీ అయింది. అప్పుడు ఎన్నిక పెట్టి ఉంటే గెలిచిన వ్యక్తికి 16 నెలల కాలం ఉండేది.
-
మార్చి 2026: కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండి, మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటికే గోవా అసెంబ్లీ గడువు (మార్చి 2027) ముగియడానికి ఏడాది కన్నా తక్కువ సమయం ఉంది.
దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే అత్యున్నత రాజ్యాంగ సంస్థకు ఈ ప్రాథమిక నిబంధన తెలియకపోవడం లేదా కావాలనే విస్మరించడం వెనుక ఉన్న మర్మమేమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు కదా? మరి ఇప్పుడెందుకు? … భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 (b) ప్రకారం, ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు అందులో జోక్యం చేసుకోకూడదు. ఫలితాలు వచ్చాక ‘ఎన్నికల పిటిషన్’ ద్వారా మాత్రమే సవాలు చేయాలి. అయితే, పోండా కేసులో బాంబే హైకోర్టు “అసాధారణ పరిస్థితుల్లో జోక్యం తప్పదు” అని స్పష్టం చేసింది.
దానికి కోర్టు చెప్పిన కారణాలు
-
చట్ట ఉల్లంఘన: సెక్షన్ 151A అనేది చాలా స్పష్టమైన నిబంధన. దానిని ఉల్లంఘిస్తూ ఎన్నిక జరపడం రాజ్యాంగ విరుద్ధం.
-
ప్రజాధనం వృథా: కేవలం 9 నెలల పదవీకాలం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఎన్నిక నిర్వహించడం అర్థరహితం.
-
శాసనసభ గడువు: ఎన్నికల కమిషన్ వాదన ప్రకారం “నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఏడాది గడువు ఉంది” అని చెప్పినప్పటికీ, కోర్టు దానిని తిరస్కరించింది. ఫలితం వచ్చి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే నాటి సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
అనుమానాలు.. ఆరోపణలు… ప్రచారం పూర్తయ్యాక ఎన్నిక రద్దు కావడం వల్ల అభ్యర్థులు పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరైంది. విపక్షాలు దీనిని “ఫిక్సింగ్” గా అభివర్ణిస్తున్నాయి. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలుసుకునే, ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ ఈ డ్రామా ఆడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు, కోర్టు తీర్పు తమకు ప్రతికూలమని తెలిసినా కమిషన్ ఎందుకు మొండిగా ముందుకు వెళ్లిందనేది మేధావుల ప్రశ్న.
ముగింపు … గోవా చిన్న రాష్ట్రం కావచ్చు, కానీ పోండా ఉపఎన్నిక రద్దు అనేది దేశ ఎన్నికల చరిత్రలో ఒక విచిత్రమైన పరిణామం. చట్టాలను అమలు చేయాల్సిన కమిషనే చట్టాన్ని అతిక్రమించడం, కోర్టు కూడా రేపు పోలింగ్ అనగా ఎన్నిక రద్దు చేయడం… ఇందులో ఎవరిది తప్పు? చిక్కుముడి వంటి ప్రశ్న..!
పదవీకాలం అనేది ప్రమాణస్వీకారం నుంచి లెక్కించాలి గానీ, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి ఎలా లెక్కిస్తారు..? భారత ఎన్నికల సంఘం దారితప్పుతోంది..! ... …. గోపు విజయకుమార్ రెడ్డి
Share this Article