.
Subramanyam Dogiparthi …. ముసలి ప్రేమికుల సినిమాలను చూసీ చూసీ విసిగి వేసారిన తెలుగు ప్రేక్షకులకు ఈ లేత లేత వయసు పిల్లల ప్రేమ సినిమా , ప్రేమ ఖైదీ , యమా నచ్చేసింది . పైపెచ్చు రామానాయుడు గారి సినిమా . ఆయన సినిమాల కధ , స్కీన్ ప్లే పకడ్బందీగా ఉంటాయి .
1990 లో సూపర్ హిట్టయిన ఈ ప్రేమఖైదీ సినిమాకు కధ , డైలాగులను పరుచూరి బ్రదర్స్ అందించారు . శారద జైలర్ పాత్రను చాలా పవర్ఫుల్ గా మలిచారు . పరుచూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రవీంద్రనాథ్ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసారు .
Ads
చెవిలో పువ్వు సినిమా ద్వారా వైఫల్యాన్ని చవిచూసిన ఇ వి వి సత్యనారాయణకు ఈ సినిమా ఓ గొప్ప అవకాశాన్ని కలగచేసింది . ఆయనా చాలా బాగా వినియోగించుకున్నారు . ముఖ్యంగా లేత ప్రేమికులుగా హరీషుని ,మాలాశ్రీని అందంగా చూపడమే కాకుండా లవ్ సీన్లను , లవ్ పాటల్ని కుర్ర ఆడియెన్సుకు నచ్చేలా తీసారు .
ఆల్మోస్ట్ అన్ని ప్రేమ కధల్లాగానే ఇందులో కూడా బాగా డబ్బు చేసిన హీరోయిన్ రెక్కాడితే కాని డొక్కాడని ఓ అమాయక ప్రాణి చేత ఐ లవ్ యూ చెప్పిస్తానని ఫ్రెండ్సుతో పందెం కడుతుంది . ఆ పందెంలో ఓడిపోయిన హీరోయిన్ హీరోని బకరా చేస్తుంది .
తర్వాత ప్రేమలో పడిపోతుంది . అది తట్టుకోలేని తండ్రి విలన్ గోకిన రామారావు హీరో మీద రౌడీలను పంపటం , ఆ ఘర్షణలో అతని తండ్రి చనిపోవటం , ఆ హత్యానేరం మీద శిక్ష పడటం , వయసు చిన్నది కాబట్టి Borston స్కూలుకు పంపబడతాడు .
ఆ స్కూల్ అధికారి శారద అతని ప్రేమకధకు జాలిపడి విలనుతో వియ్యానికి వెళ్లి కయ్యం తెచ్చుకుంటుంది . ఈ క్రమంలో స్కూల్లో ఉన్న హీరో మిత్రులు హీరోయిన్ని స్కూలుకు చేరుస్తారు . హీరోయిన్ని కాపాడుతూ ఉంటారు .
క్లైమాక్సులో రిజిస్ట్రార్ ఆఫీసులో అందరూ కలిసి పెళ్ళి జరిపేందుకు సాయం చేస్తారు . కానీ , విలన్ మనుషులు శారద మీద కాల్పులు జరపటంతో ఆమె ప్రాణాలను వదులుతూ పెళ్ళి రిజిస్ట్రేషనుకు రక్తంతో వేలి ముద్ర వేసి పెళ్లి పూర్తి చేస్తుంది .
అలా సినిమాకు గుండెకాయ వంటి పాత్రను శారద పోషించింది . అద్భుతంగా నటించింది . విలనుగా గోకిన రామారావు కూడా చాలా క్రూరంగా నటించాడు . మరో ముఖ్య పాత్ర హీరో తండ్రి పి యల్ నారాయణ . గొప్పగా నటించాడు . మరో ప్రధాన పాత్ర హీరోయిన్ తల్లి పాత్రను కన్నడ నటి చార్మిళ బాగా చేసింది . చార్మిళ పేరు భలే ఉందికదా !
ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి , రజిత , ఆలీ , బాబూ మోహన్ , త్యాగరాజు , గిరిబాబు , రాధాకుమారి , బ్రహ్మానందం , ఐరన్ లెగ్ శాస్త్రి తదితరులు నటించారు . ఎప్పటిలాగే నిర్మాత రామానాయుడు పోలీస్ ఉన్నతాధికారిగా కాసేపు తళుక్కుమన్నాడు .
రాజన్ నాగేంద్ర అత్యంత శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . వేటూరి పాటలను బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర , శైలజ , రమోలా శ్రావ్యంగా పాడారు . డ్యూయెట్లన్నీ ఇ వి వి అందంగా చిత్రీకరించారు . సుందర విశాఖ అందాలను చక్కగా వాడుకున్నారు .
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదో రాగము శ్రీరస్తు అన్న శివరంజని చాలా శ్రావ్యంగా ఉంటుంది . వల్లభా దుర్లభా అంటూ హీరోని హీరోయిన్ మాలాశ్రీ టీజ్ చేసే డ్యూయెట్లో మాలాశ్రీ అదరగొట్టేస్తుంది .
అలాగే బాగుండే మరో డ్యూయెట్ ఐ లవ్ ఫర్ యు అన్నది ప్రేమ ఐ డై ఫర్ యు అన్నది ప్రేమ . మరో డ్యూయెట్ ఓ న మః మనమిద్దరం . Borston స్కూల్లో విద్యార్ధులు పాడే పాట జోడీ కడితే బేడీలా ప్రేమా పెళ్ళి నేరాలా బాగుంటుంది .
Borston స్కూల్లో ఓ ఆడపిల్ల అన్ని రోజులు ఉంటే కాపలాదారులు , శిక్షకులు , అధికారులు కనిపెట్టలేక పోవడం సినిమా కధ లాగానే ఉంటుంది . సినిమాయే కదా ! నో లాజిక్కులు . ఓన్లీ మేజిక్కులు .
తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళంలోకి డబ్ చేయబడింది . హిందీలో రీమేక్ చేయబడింది . హిందీలో కూడా హరీషే హీరోగా నటించాడు . హీరోయిన్గా కరిష్మాకపూర్ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసింది . కన్నడంలో విజయ రాఘవేంద్ర , రాధికా కృష్ణమూర్తి లీడ్ రోల్సులో నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . ప్రేమ హృదయులు మరలా కూడా చూడొచ్చు . Love is always beautiful .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article