Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…

March 29, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః . నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ . తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ . సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ . భగవద్గీత (14.5&6) .

ప్రకృతి నుండి ఉత్పన్నములయిన సత్త్వ రజో తమో గుణములు నాశము లేని జీవాత్మను శరీరమున బంధించును . నిర్మలత్వాన్ని సాధించటమే సత్త్వ గుణాన్ని చేరుకోవటం . ఈ గుణ త్రయాన్ని మనం విశ్వామిత్రుడి చరిత్రలో బాగా చూడవచ్చు . కౌశిక మహారాజుగా తమో గుణం బంధంలో ఇరుక్కుపోయాడు .

Ads

వశిష్ఠునితో పంతంతో తపో శక్తిని సాధించినా త్రిశంకునికి ధారపోసినప్పుడు రజో గుణంలో బంధించబడ్డాడు . కేవలం రాజర్షి మాత్రమే అయ్యాడు . అన్నీ పరిత్యజించి నిర్మల మనస్కుడు అయినప్పుడు సత్త్వ గుణంతో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యాడు .

ఈ గుణత్రయ విభాగం మనందరికీ వర్తిస్తుంది . MBA విద్యార్ధులకు నేను ఈ గుణత్రయ విభాగాన్ని Eric Berne వ్రాసిన Transactional Analysis , Ego States తో సంధానం చేసి చాలా ఇష్టంగా బోధించేవాడిని . ఎన్నో Faculty/Executive Development Programmes లో కూడా వీటి మీద లెక్చర్స్ ఇస్తుండేవాడిని .

ఈ మూడు షేడ్స్ విశ్వామిత్రుడి జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి . యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 1989 జూన్ 18 న ఈ సినిమా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ షూటింగ్ ప్రారంభం అయింది . ఆనాటి నేషనల్ ఫ్రంట్ నాయకులు వి పి సింగ్ , కరుణానిధి , దేవీలాల్ వంటి అతిరధ మహారధులు ప్రారంభానికి హాజరయ్యారు .

ఆయన స్వంత సినిమాల్లో పౌరాణికత్వానికి సమకాలీనతను జోడించి అందించటం మనకు తెలుసు . ఈ సినిమాలోనూ అదే జరిగింది . సామ్యవాదం , దేవతల కన్నా మానవులే గొప్ప వంటి భావాలను జొప్పించారు . ఆయన ఆలోచనలకు అనుగుణంగా మాటల్ని నాగభైరవ కోటేశ్వరరావు గారు వ్రాసారు .

ఇంక నటనకు వస్తే ఆయన గురించి చెప్పేదేముంది ? విశ్వామిత్రుడిగా , రావణ బ్రహ్మగా గొప్పగా నటించారు . అయితే ఆయన డైలాగులు ఏకపాత్రాభినయం (monologue) లాగా సాగటం సినిమా విజయవంతంగా ఆడకపోవటానికి కొంత కారణం అయింది . సినిమాకు హైలైట్ మేనకగా మీనాక్షి శేషాద్రి . తన లాలిత్యంతో , సౌందర్యంతో , నృత్య కౌశల్యంతో ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది .

బాలకృష్ణ . హరిశ్చంద్రునిగా , దుష్యంతునిగా అందంగా , తండ్రికి తగ్గ తనయుడిగా నటించాడు . చంద్రమతిగా హిందీ రామాయణ్ సీరియల్లో సీత పాత్రధారి దీపిక నటించింది . శకుంతలగా మధుమతి నటించింది .‌ వీరబాహుడిగా అంజాద్ ఖాన్ , సోమిదేవమ్మగా అరుణా ఇరానీ నటించారు .

వశిష్ఠునిగా గుమ్మడి , ఇంద్రునిగా అశోక్ కుమార్ నటించారు . మామూలుగానే మన తెలుగు సినిమాల్లో ఇంద్రుడిని సకల దుర్గుణుడిగా చూపిస్తారు . ఇంక యన్టీఆర్ సినిమా అయితే చెప్పాలా !?

ఈ సినిమాకు టివి రామాయణ్ కు సంగీత దర్శకత్వాన్ని వహించిన రవీంద్ర జైనే ఈ సినిమాకూ సంగీత దర్శకత్వాన్ని వహించటం విశేషం . ఆయన పుట్టు గుడ్డి . అయినా దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసుడు అయ్యాడు . లతా మంగేష్కర్ , ఆశా భోంస్లే , సుశీలమ్మ , కవితా కృష్ణమూర్తి , హేమలత , అనూరాధ , బాలసుబ్రమణ్యం , రామకృష్ణ , జేసుదాస్ , రవీంద్ర జైన్ పాటల్ని , పద్యాల్ని పాడారు .

పాటలనన్నీ సి నారాయణరెడ్డి గారే వ్రాసారు . నృత్యాలన్నీ కమనీయమే . ఎందరో బులిపించినా మరులింతగా ఉలికించినా అనే పాట మీనాక్షి శేషాద్రి , యన్టీఆర్ల మీద చాలా బాగుంటుంది . హరిశ్చంద్రుడి నిద్రాభంగం చేసే పాట ఈ చిన్నది ఆ చిన్నది బాగా చిత్రీకరించబడింది . కుయిలీ , డిస్కో శాంతిల మీద బాగుంటుంది .

వీరబాహుడి వద్ద నృత్యం కల్లు పొంగినట్లు కూడ బాగా చిత్రీకరించబడింది . స్వాతి అనుకుంటా నటి పేరు . దైత్యాళి వధకు ధనుర్ధారి గావించె పాటను జేసుదాస్ శ్రావ్యంగా పాడారు . దుష్యంతుడి మీద ప్రియా చెలియా కూడా బాగుంటుంది .

రాజారెడ్డి , రాధారెడ్డిల మీద రామావతారం వరకు చూపే నృత్యం బాగుంటుంది . అయితే మనకు దశావతారాలలో కృష్ణావతారం వరకు నృత్య గీతాలు చాలా సినిమాల్లో వచ్చాయి . వాటి కన్నా గొప్పగా లేదు ఈ నృత్యం ఎందుకనో .

యన్టీఆర్ నటించిన పౌరాణికాల్లో బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టిన సినిమాలలో శ్రీమద్విరాట పర్వానికి జతగా నిలిచింది ఈ సినిమా కూడా . అయిననూ చూడవలసిన సినిమాయే . పాటలు , పద్యాలు , నృత్యాలు బాగుంటాయి . కాస్త ఓపిగ్గా చూడాలి .

1991 ఏప్రిల్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఈ సినిమా రోజుల్లోనే లోకసభకు మధ్యంతర ఎన్నికలు రావటం , ఎన్నికల మధ్యలో రాజీవ్ హత్య చేయబడటం జరిగాయి . అప్పట్లో చూడనివారు , అప్పుడప్పుడు టివిలో వచ్చినప్పుడు చూడనివారు చూడవచ్చు . ఎంతయినా యన్టీఆర్ పౌరాణికం కదా !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…
  • శెట్టి గ్యాంగ్ కకావికలు… డబుల్ హేపీతో రష్మిక పకపకలు…
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…
  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…
  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!
  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…
  • ‘కోడి మెడ’..! ఒవైసీ చేతికి చిక్కుతుందా..? బెంగాల్ ముఖచిత్రమేంటి..?!
  • పాపం కమలహాసన్..! త్యాగమో, వైరాగ్యమో, సన్యాసమో… హిట్ వికెట్..!
  • సదరు ప్రవచనకర్తకు అస్సలు నచ్చని 2 వార్తలు..! అవేమిటంటే..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions