.
Pardha Saradhi Upadrasta ….. హోర్ముజ్ జలసంధి సంక్షోభం: అణు చర్చలు విఫలం… ప్రపంచానికి కొత్త ఉద్రిక్తతల సంకేతాలు!
జెనీవాలో ఒమన్ మధ్యవర్తిత్వంలో జరిగిన అమెరికా– ఇరాన్ అణు చర్చలు రెండో విడత ముగిసినా స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. ఇరాన్ అధికారులు “గైడింగ్ ప్రిన్సిపుల్స్‌పై కొంత పురోగతి” ఉందని చెప్పినా, ప్రధాన అంశాలపై విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి.
Ads
యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రతిగా ఆంక్షల ఉపశమనం ఇవ్వాలని ఇరాన్ ప్రతిపాదించగా, అమెరికా మాత్రం పూర్తి స్థాయిలో ఎన్‌రిచ్‌మెంట్ నిలిపివేయాలని, మిసైల్ ప్రోగ్రామ్‌కు పరిమితులు విధించాలని కోరింది.
ఈ షరతులు తమ భద్రతకు విరుద్ధమని ఇరాన్ తిరస్కరించింది. చర్చలు ముగిసిన వెంటనే హోర్ముజ్ జలసంధి పైగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రత్యక్ష మిసైల్ విన్యాసాలు నిర్వహించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
ఇది సాధారణ సైనిక విన్యాసమని అధికారికంగా చెప్పినా, చర్చల అనంతరం జరిగిన సమయం కారణంగా అమెరికాకు పంపిన హెచ్చరికగా ప్రపంచం భావిస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్రిక్తతను పెంచాయి— అమెరికా విమాన వాహక నౌకలు శక్తివంతమైనవే అయినా, వాటిని ముంచగల మిసైళ్లు ఇంకా శక్తివంతమని అన్నారాయన.
ఇక అమెరికా నౌకాదళం తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచింది. USS Gerald R. Ford , USS Abraham Lincoln క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లు ప్రాంతానికి సమీపంగా ఉండగా, డిస్ట్రాయర్లు, సబ్‌మరైన్లు, అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లు కూడా మోహరించబడ్డాయి. మెడిటరేనియన్ సముద్రంలోకి USS Gerald R. Ford ప్రవేశించడం ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిగా విశ్లేషిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే వెళుతుంది. ఈ ప్రాంతంలో చిన్న అంతరాయం జరిగినా చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో రష్యా– చైనా నౌకాదళ విన్యాసాలు ఇరాన్‌తో కలిసి జరగడం గ్లోబల్ జియోపాలిటిక్స్‌ను మరింత సంక్లిష్టం చేస్తోంది. అయితే ఇది ప్రత్యక్ష సైనిక జోక్యం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే — మిసైళ్ల నీడలో కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలు రాజనీతి ఒప్పందంగా మారుతాయా? లేక హోర్ముజ్ జలసంధి మరో పెద్ద సంక్షోభానికి కేంద్ర బిందువవుతుందా?
— ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #Iran #USIranTensions #StraitOfHormuz #Geopolitics #WorldPolitics #BreakingNews #GlobalSecurity
Share this Article