.
నిన్న కూడా ఏదో ప్రిరిలీజ్ ఇంటర్వ్యూల్లో చెప్పినట్టుంది సమంత… మయోసైటిస్ భయంతో తిండి కూడా సరిగ్గా తినడం లేదు అని… గతంలో ఏదో ఓ సినిమా విషయంలోనూ అంతే, ముక్కు చీదుకుంటూ… తన అనారోగ్యాన్ని పదే పదే ప్రస్తావించింది…
ఒకప్పుడు సమంత అంటే బంగారం, చాలామందికి క్రేజ్, నటన- అందం కలబోత… కానీ అక్కినేని కుటుంబం నుంచి విడిపోయాక కొంత నెగెటివిటీ ఆమె చుట్టూ కమ్ముకుంది… దానికితోడు ఆమె అనారోగ్యం… హీరోయిన్ రోగిష్టిలా ప్రొజెక్టయితే ప్రేక్షకుడికి అంతగా రుచించదు… సినిమాకు సంబంధం లేకపోయినా సరే, ఆమె వ్యక్తిగతానికీ సినిమాలో పాత్రకూ లింకేమిటంటూ ఎవరంగీకరించినా లేకపోయినా రియాలిటీ అది…
Ads
ఐనా ఆమె పదే పదే తన వ్యాధిని ఎందుకంత ప్రొజెక్ట్ చేస్తుంది..? దేవుడికే ఎరుక… సరే, ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా వచ్చింది ఈరోజు… నిజానికి ఇది ‘వన్ -వుమెన్’ షో… ఆమే షీరో… కానీ నిర్మొహమాటంగా చెప్పాలంటే ఆమెకన్నా, తన స్నేహితురాలిగా చేసిన మంజూష కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది… కిరణ్మయి పాత్రకు ఆమె పెట్టిన ప్రాణం సినిమాకు అదనపు బలం…
ఇది ఒక “బాషా టెంప్లేట్ హీరోయిన్ వెర్షన్” అని సినిమా టీమే చెప్పుకుంది కదా… మరి ఈ ప్రయోగం వెండితెరపై ఎలా పండిందో పరిశీలిస్తే…
బల్లవరం గ్రామం.. అక్కడ ఆనంద్ పోషించిన రామరాజు గారి ఇల్లు అంటే పద్ధతులకు మారుపేరు… అలాంటి ఇంటికి స్వర్ణ (సమంత) కోడలిగా వెళ్తుంది… ఆదర్శ గృహిణికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేని స్వర్ణ, ఆ ఇంట్లో ఎలా ఇమిడిపోయింది..? అసలు ఆమె గతం ఏంటి..? ఝాన్సీ అనే పేరుతో ఉన్న ఆమెకు ఆ కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే ఈ కథాంశం… కథలో కొత్తదనం కంటే, కథనం (Screenplay) లో ఎంత వేగం ఉందనేదే ఇక్కడ కీలకం…
“ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్” తర్వాత యాక్షన్ అంటే సమంతకి వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి నిరూపించుకుంది. చీరకట్టులో ఫైట్స్ చేయడం చూడటానికి కొత్తగా అనిపించినా, ఆమె బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు తగ్గట్టుగా సెట్ అయింది. నటన గురించి వంకపెట్టడానికి ఏమీ లేదు, అలవోకగా లాగించేసింది…
ఈ సినిమాకి అసలైన సర్ప్రైజ్ ప్యాకేజీ మంజూష… సమంత స్నేహితురాలిగా ఆమె పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్… గుల్షన్ దేవయ్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం బాగున్నా, విలన్ పాత్రకు సరైన లోతు (Depth) లేదు… ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుందో చెప్పే జస్టిఫికేషన్ మిస్ అయ్యింది…
నందిని రెడ్డి ముద్ర అక్కడక్కడ స్పష్టంగా కనిపిస్తుంది… ముఖ్యంగా, తులసి కోట దగ్గర సీన్లు, “ముత్యమంత పసుపు” పాటతో క్యారెక్టర్ల మధ్య పోటీని డిజైన్ చేసిన విధానం చాలా తెలివైన పని… కానీ, సినిమా ఎమోషనల్ కోణంలోకి వచ్చేసరికి కాస్త తడబడింది…
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ రెట్రో స్టైల్ కోసం చేసిన ప్రయత్నం యాక్షన్ బ్లాక్స్‌కు సరిపోయినా, ఫ్యామిలీ సీన్స్‌లో పాటలు అంతగా పండలేదు. డే-టు-నైట్ ఫిల్టర్ ఎఫెక్ట్స్ వల్ల విజువల్స్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి…
“మా ఇంటి బంగారం” ఒక మంచి పాయింట్ తో మొదలైంది… ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ను ఇంకాస్త పకడ్బందీగా రాసుకొని ఉంటే, ఇది మరోస్థాయిలో ఉండేది… ఫ్యామిలీ సేవింగ్ డ్రామాగా ఆశించినంత కిక్ ఇవ్వకపోయినా, సమంత పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు… పోనీ, మంజూష ముక్కవల్లి కామెడీ కోసం చూడొచ్చునేమో..!!
Share this Article