.
ఎప్పుడూ చెప్పుకునేదే కదా… రాజకీయాల్లో మమత ఆడే తొండి ఆట గురించి… తింగరి రాజకీయాల గురించి… తిక్క ధోరణుల గురించి… మళ్లీ మళ్లీ పదే పదే అదే తరహా … చివరకు ఇప్పుడు రాష్ట్రపతిని అవమానించిన తీరు మీద కూడా విఫల సమర్థనకు ప్రయత్నిస్తోంది…
సంతాల్ సదస్సుకు వచ్చిన రాష్ట్రపతి పర్యటన విషయంలో ఖచ్చితంగా మమత బెనర్జీ ప్రభుత్వం అధికారిక మర్యాదలను (ప్రోటోకాల్) ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించింది… కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నోటీసు కూడా జారీ చేసింది… ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఏమిటంటే..?
Ads
1) సదస్సు వేదికను మార్చేశారు. 2) ప్రయాణ మార్గాన్ని మార్చేశారు. 3) రాష్ట్రపతికి కేటాయించిన వాష్‌రూంలో అసలు నీటి సౌకర్యమే లేదు. 4) ఆమె ప్రయాణించే మార్గం చెత్తాచెదారంతో నిండి ఉంది. 5) సీఎం గానీ, మంత్రి గానీ, డీజీపీ, సీఎస్‌లు గానీ ఎవరూ స్వాగతం పలకలేదు. 6) పర్యటనలో ఏ మార్పులు జరిగినా రాష్ట్రపతి ఆఫీసు పర్మిషన్ అవసరం, కానీ తీసుకోలేదు…
….. ఇలా ప్రతి అంశంలోనూ రాష్ట్రపతిని అవమానించడమే కాదు… నామీద కోపం ఎందుకు సోదరీ అని రాష్ట్రపతి బాధను వ్యక్తీకరిస్తే… మరి మణిపూర్ గిరిజనంపై దాడులపై స్పందించావా అని ఎదురుదాడికి దిగింది… కావాలనే రాజకీయం కోసం రాష్ట్రపతిని గిరిజన సదస్సు పేరిట పంపించిందనీ ఆమె ఆరోపణ… మళ్లీ తనే మాట మార్చి, మా సిలిగురి మేయర్ వచ్చాడు కదా స్వాగతానికి, ఇంకేం మరి అంటోంది… అలాగే అదేదో స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన సదస్సు, ప్రయాణమార్గం ఎందుకు మార్చారో ఎయిర్‌లైన్స్ వాళ్లను అడగండి… నేనేమో వేరే పనిలో బిజీగా ఉన్నాను… (సర్ ప్రక్రియ మీద నిరసన ప్రదర్శనలు)… ఇలా ఎటుపడితే అటు నాలుక తిప్పుతోంది…
ఆమె పోలేదు సరే, సీఎస్, డీజీపీ, ఎవరైనా సీనియర్ మంత్రి…? వీళ్లేమయ్యారు..? రాష్ట్రపతి ఏ కార్యక్రమానికి వచ్చినా తన భద్రత, తన సౌకర్యాలు, తగిన మర్యాద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత… సర్లెండి, మమతకు మర్యాదలు, మన్నూమశానాలు ఏమీ పట్టవు కదా… ఇప్పుడు ఏమంటుదో తెలుసా..?
‘‘అసలు రాష్ట్రపతికి సరైన మర్యాద ఇవ్వనిదే మోడీ… అద్వానీకి పురస్కారం సమయంలో రాష్ట్రపతి నిల్చుని ఉంటే, మోడీ కూర్చుని ఉన్నాడు… ఎవరు ఆమెను అవమానిస్తున్నారు?’’ అంటోంది… ఇదీ ఆ ఫోటో…

నిజానికి అది భారతరత్న పురస్కారం, అద్వానీ వచ్చే ఆరోగ్యస్థితిలో లేడు కాబట్టి మోడీ, రాష్ట్రపతి స్వయంగా ఆయన ఇంటికే వెళ్లారు, కుర్చీల్లో కూర్చున్నారు, పురస్కారం ప్రదానం చేస్తున్నప్పుడు ఆమె కుర్చీ నుంచి లేచి అద్వానీకి అందించింది… అది మర్యాద, ఆమె పాటించింది… దానికి కూడా మమత బెనర్జీ తనదైన వక్రబాష్యం చెబుతోంది…
అసలు విషయమేమిటంటే…? రాష్ట్రపతిని పంపించి, గిరిజన వోట్లను పొందే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని ఆమె ఫ్రస్ట్రేషన్… అసలే సర్ ప్రక్రియతో లక్షల వోట్లు పోయాయి, అందులో అధికశాతం ఆమె వోట్లే… అవీ నకిలీవి, అక్రమ వలసదారుల వోట్లు, ఆమె బలం వాళ్లే కదా, అదీ ఆమె కోపం… సుప్రీం దాకా పోయి, స్వయంగా వాదించి ఏదో షో కూడా చేసింది కదా…

అవును గానీ, రెడ్ బుక్ అంటే తెలుసు, పింక్ బుక్ అంటే తెలుసు... మరి ఈ ప్రోటోకాల్ బ్లూ బుక్ ఏమిటి..?
భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పర్యటనల సమయంలో భద్రత, మర్యాదలకు సంబంధించి అనుసరించాల్సిన నిబంధనల సంకలనాన్ని ‘బ్లూ బుక్’ (Blue Book) అంటారు… దీనిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది…
1. స్వాగత సత్కారాలు (Reception) …. రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు, విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి స్వాగతం పలకడం సంప్రదాయం… ఒకవేళ ముఖ్యమంత్రి రాలేని పక్షంలో, తన తరపున ఒక మంత్రిని నామినేట్ చేయాలి… ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ (CS), డీజీపీ (DGP) వంటి కీలక వ్యక్తులు ఎవరూ హాజరుకాకపోవడం తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది… స్వాగతం పలికే వ్యక్తుల జాబితా (Line-up) ముందే రాష్ట్రపతి సచివాలయం ద్వారా ఆమోదించబడాలి…
2. భద్రతా ఏర్పాట్లు (Security) … రాష్ట్రపతి పర్యటించే మార్గాలను (Route) ముందే శుభ్రం చేయాలి, భద్రతను తనిఖీ చేయాలి… రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, అడ్డంకులు లేకుండా చూడటం రాష్ట్ర పోలీసుల బాధ్యత… అవసరమైన చోట్ల స్నైపర్లను ఉంచడం, యాంటీ సాబోటేజ్ (Anti-sabotage) తనిఖీలు చేయడం వంటివి ఇందులో భాగం…
3. వసతి మరియు వేదిక (Stay and Venue) …. రాష్ట్రపతి బస చేసే చోట అత్యున్నత స్థాయి భద్రతతో పాటు, కనీస సౌకర్యాలు (నీటి వసతి, విద్యుత్, టెలిఫోన్ మొదలైనవి) పక్కాగా ఉండాలి… కార్యక్రమం జరిగే వేదిక వద్ద డయాస్ (Dias) నిర్మాణం, అక్కడ కూర్చునే వ్యక్తుల క్రమం (Table of Precedence) ఖచ్చితంగా పాటించాలి… ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళిక (Contingency Plan) కూడా సిద్ధంగా ఉండాలి…
4. ఇతర ముఖ్యాంశాలు … జిల్లా స్థాయిలో ఈ నియమాల అమలును జిల్లా కలెక్టర్ (DM), జిల్లా ఎస్పీ (SP) పర్యవేక్షిస్తారు… ఇది ఒక అత్యంత రహస్య పత్రం… దీనిలోని కాపీలు కేవలం సంబంధిత అధికారుల వద్దే ఉంటాయి… బ్లూ బుక్ నిబంధనలలో చిన్నపాటి మార్పులు లేదా పొరపాట్లు జరిగినా కేంద్ర ప్రభుత్వం దానిపై వివరణ కోరుతుంది, విచారణ జరుపుతుంది…

బ్లూ బుక్ (Blue Book) నిబంధనలను ఉల్లంఘించినప్పుడు లేదా రాష్ట్రపతి పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తినప్పుడు, కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది… సరే, మోడీకి అంత ధైర్యం ఉందా లేదానేది పక్కన బెడితే ఆ ప్రొసీజర్, అంటే దీనికి సంబంధించి బాధ్యులను నిర్ణయించే విధానం, తీసుకునే చర్యలు ఇలా ఉంటాయి…
1. ప్రాథమిక బాధ్యులు (Primary Responsibility) రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనలో ఉన్నప్పుడు భద్రత, ప్రోటోకాల్ అమలు చేసే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే... ఇందులో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులను బాధ్యులుగా పరిగణిస్తారు…
-
చీఫ్ సెక్రటరీ (CS)…: రాష్ట్ర పరిపాలనా విభాగాధిపతిగా ప్రోటోకాల్ అమలుకు ఇతనే బాధ్యుడు…
-
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)…: భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగితే పోలీస్ బాధ్యుడిగా ఇతనిపై చర్యలు ఉంటాయి…
-
జిల్లా కలెక్టర్, ఎస్పీ…: పర్యటన ఏ జిల్లాలో జరుగుతుందో, ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఎస్పీలు క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది…
2. కేంద్రం తీసుకునే చర్యలు (Actions by Union Government) నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఈ క్రింది విధంగా స్పందిస్తుంది…
-
షోకాజ్ నోటీసులు (Show Cause Notice)…: ముందుగా సంబంధిత అధికారులకు (CS లేదా DGP) నోటీసులు జారీ చేసి, నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తుంది… ఇప్పుడు అదే జరిగింది…
-
కేంద్ర విచారణ (Central Inquiry)…: వివరణ సంతృప్తికరంగా లేకపోతే, కేంద్ర హోం శాఖ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక విచారణ కమిటీని నియమిస్తుంది…
-
క్రమశిక్షణా చర్యలు…: ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులు కేంద్ర సర్వీసులకు చెందిన వారు కాబట్టి, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సిఫార్సు చేయవచ్చు… అవసరమైతే వారిని సెంట్రల్ డెప్యుటేషన్‌పై వెనక్కి పిలిపించడం (Recall) లేదా సస్పెండ్ చేయమని ఆదేశించడం వంటివి జరుగుతాయి…
3. ప్రోటోకాల్ ఉల్లంఘన – రాజకీయ మరియు రాజ్యాంగ పరిణామాలు … ఒకవేళ ముఖ్యమంత్రి లేదా మంత్రులు కావాలనే ప్రోటోకాల్ పాటించకపోతే (ఉదాహరణకు స్వాగతం పలకకపోవడం)…
-
గవర్నర్ నివేదిక…: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపవచ్చు…
-
రాజ్యాంగ సంక్షోభం…: రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కేంద్ర రాజ్యాంగ అధినేతను (రాష్ట్రపతిని) అవమానిస్తోందని భావిస్తే, అది రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే (Article 356) చర్చకు కూడా దారితీయవచ్చు… (ఎన్నికల ముందు ఆమెకు సానుభూతి కలిగించే పని బీజేపీ చేయదు, పైగా 356 వినియోగంపై సుప్రీం మార్గదర్శకాలు అడ్డుపడతాయి)…
Share this Article