.
పొద్దున్నే రెండు వార్తలు కనిపించాయి… 1) తిరుమలలోనే కాదు, నెయ్యి కాని నెయ్యిని కాణిపాకం, ద్వారక తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం గుళ్లకు కూడా సరఫరా చేశారనీ… వెంకన్న స్వామి క్షమిస్తాడేమో గానీ వినాయకుడు క్షమించడనీ… ఆ నెయ్యిని కూడా సరఫరా చేసే కంపెనీల ల్యాబుల్లోనే పరీక్షించేలా ఓ పిచ్చి నిబంధన పెట్టారనీ ఓ వార్త… 2) పెద్దప్పన్న సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న చెబితే చాలు, ఒకే నెలలో 6433 సుపథం దర్శనాలు కల్పించారని మరో వార్త…
ఇవే కాదు… ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్లస్ సదరు బాబు మీడియా చానెళ్లు కూడా రోజుకో అక్రమాన్ని బయటపెడుతూనే ఉన్నాయి.., ది గ్రేట్ చతుష్టయంగా పిలవబడుతున్న సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల హయాంలో తిరుమలను ఎలా భ్రష్టుపట్టించారో తెలుసా అన్నట్టుగా…
Ads
అంతిమంగా ప్లాన్ ఏమిటి..? జగన్ హిందూ ద్రోహి అని ముద్రను ఫిక్స్ చేయడం… లక్ష కోట్ల అవినీతి ముద్రలాగే… రాస్తూ రాస్తూ ఉంటే అదే జనాలకు ఎక్కుతుందిలే అని మర్మం… నిజానికి ఘాతుకాలు కూడా తక్కువేమీ కాదు… అబ్బే, సిట్ చెప్పింది కదా, లడ్డూ నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదు అని వైసీపీ, సాక్షి దాన్నే బహుళ ప్రచారంలోకి తీసుకొస్తూ, తీవ్రతను తగ్గించడానికి విఫల ప్రయత్నం చేస్తోంది…
కానీ… మరి అప్పట్లో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు మాటేమిటి..? సరే, సిట్ చెప్పిందే నిజం అనుకుందాం, నో, జంతు కొవ్వులేమీ లేవు, కానీ అసలు పాలే లేకుండా కెమికల్స్‌తో నెయ్యి తయారు చేసి సప్లయ్ చేశారనే కదా సిట్ చెబుతోంది… అది ద్రోహం కాదా..? హిందూ మనోభావాలను, వెంకన్న భక్తులను మోసగించడం కాదా..?
సెలబ్రిటీలకు, వీవీఐపీ ఆశీర్వచనాల్లో కప్పే పట్టు శాలువాల్లో అసలు పట్టే లేదని కాదా తేలింది..? ఏ ఒక్కటీ విడిచిపెట్టలేదు… అవన్నీ మోసాలు కావా..? దీనికి తోడు హఠాత్తుగా సనాతన ధర్మపరుడిగా మాట్లాడుతున్న భూమన ఇదే తిరుమల దేవుడిపై ఏమేం నాస్తిక వ్యాఖ్యలు చేశాడో జనం మరిచిపోయారా..? పైగా సుబ్బారెడ్డి, అధర్మారెడ్డి సరేసరి…
కానీ సిట్ అసలు జంతుకొవ్వు ప్రస్తావనే తీసుకురాకపోయేసరికి… జగన్‌ను పదే పదే హిందూ వ్యతిరేక ముద్రతో డీఫేమ్ చేయాలనుకున్న యెల్లో బ్యాచ్‌కు నచ్చలేదు… అందుకే రోజుకో కథనం… అసలు సిట్ అలా ఎలా చెప్పిందని ఈరోజుకూ యెల్లో డౌట్స్… ఈ కమీషన్ల కక్కుర్తి చిన్నప్పన్నల వెనుక ఉన్న పెద్దప్పన్నలను ఎందుకు వదిలేసిందని పెద్ద డౌట్… సరే, దీనికి వైసీపీ కౌంటర్ ఏమిటి..?
1) భూమనతో సాక్షిలో నీతి వ్యాసాలు… అది వైసీపీకి మరింత మైనస్, ఆ సోయి లోపించింది ఆ క్యాంపులో…
2) హఠాత్తుగా హెరిటేజ్ పెరుగు తెరపైకి తీసుకొచ్చారు… ఈ పెరుగులో తగినంత పాల కొవ్వు (Milk Fat) లేదని, అది నాణ్యత లేని (Substandard) పెరుగు అని నిర్ధారిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రూ. లక్ష జరిమానా విధించిందని వైసీపీ ప్రచారం చేస్తోంది… అంతేకాదు, ఒడిశాలో Expired పాకెట్లు అమ్మారని కూడా… గతంలో కేరళలో ఈ పాలను నిషేధించారని మరో ప్రచారం… హెరిటేజ్ వాటిని ఖండించింది…
కానీ… లడ్డూ, శాలువాల దగ్గర నుంచి అనేక అక్రమాల వార్తలకు ఈ పెరుగుపై ప్రచారం కౌంటర్ అవుతుందా..? అసలు ఆ నెయ్యికీ, ఈ పెరుగుకూ ఏం సంబంధం..? జస్ట్, డైవర్షన్… నువ్వూ దొంగవే అని చెప్పడం… అవును, చంద్రబాబు దొంగ అయినంతమాత్రం సుబ్బారెడ్డి అండ్ కో దొంగతనం మాఫీ అయిపోతుందా..?
ఎస్, హెరిటేజ్ కోసం చంద్రబాబు ఏయే సర్కారు డెయిరీలను పొట్టనపెట్టుకున్నాడనేది పెద్ద కథ… ఆ పాలు, ఆ పెరుగు కథలు వేరు… దానికీ కోట్ల మంది వెంకన్న భక్తులకు జరిగిన ద్రోహం వేరు… ఈరోజయితే మరొకటి దొరక్క చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నుంచి కల్తీ పాలు సరఫరా జరుగుతున్నాయని సాక్షి మరో వార్త…
చివరకు జరిగేదేమిటి..? ఈ డైవర్షన్లు పనిచేయవు సరికదా, రోజూ నెయ్యి, పట్టు, ఇతర అక్రమాలు చదివీ చదివీ జనంలో చర్చ జరిగీ జరిగీ, అది అంతిమంగా ఇంకా ఇంకా బదనాం అయ్యేది వైసీపీయే… జగన్‌కు నేరుగా ఈ అక్రమాలతో సంబంధం లేకపోవచ్చు… కానీ ఆ చతుష్టయానికి మద్దతు ఇచ్చింది తనే, నియమించిందీ తనే… అంతిమంగా నైతిక బాధ్యత తనదే…
నో, నో, చంద్రబాబు హయాంలోనే ఆ కల్తీ నెయ్యి సరఫరా కావడం స్టార్టయిందని వైసీపీ మరో వాదన… తను శుద్ధపూస అని ఎవరూ అనడం లేదు, కానీ చంద్రబాబు చేశాడని మీరు కొనసాగిస్తారా..? అదెలా తప్పుకు పరిహారం అవుతుంది..? చంద్రబాబు నిజంగా ఆ తప్పు చేసి ఉంటే, జనం కోర్టులో నిలబెట్టి ఉండాలి కదా, మరి ఐదేళ్లలో ఎందుకు చేయలేదు, పైగా బాబే చేయగాలేనిది మనం చేస్తే, మరింత ఎక్కువ చేస్తే తప్పేముంది అనుకుని చెలరేగిపోయారా..? కటువుగా ఉన్నాసరే, వెంకన్న భక్తుల్లో సాగుతున్న చర్చ మాత్రం ఇదే…
వెరసి... ఏపీ క్షుద్ర రాజకీయాలు కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం నిజం... అసలు తిరుమల వంటి దేవస్థానాలు రాజకీయాల గుప్పిట్లో ఎందుకు ఉండాలి..? ఇలాంటి అక్రమాల కోసమేనా..? ఇదీ అసలు ప్రశ్న..!!
- అన్నట్టు… నాకు హెరిటేజ్ షేర్స్ ఏమీ లేవు, కానీ మార్కెట్‌లో హెరిటేజ్ ప్రీమియం ఫుల్ క్రీమ్ పాలు కొంటాం… నిన్నటి నుంచి 3 రూపాయలు తగ్గించారు, ఎందుకో తెలియదు… పెరుగు కొనాల్సిన అవసరం వస్తే, ఇతర పెరుగులకన్నా ఇదే మేలు అని అదే కొంటుంటాం… లడ్డూకూ ఆ పెరుగుకూ లింక్ తెలియని అజ్ఞానులం కదా… మరో విషయం… ఈమధ్య తిరుమల వెళ్లాం… క్యూ లైన్ వైపు వెళ్తుంటే లడ్డూ ఘుమఘుమలు ఆహా అనిపించాయి, ఎందుకో మరి..! ఏమోయ్, భూమనా, ఎనీ ఐడియా, నీ అన్యమతస్తులను అడిగి చెబుతానంటావా.?
Share this Article